Sampathkumar Reddy Matta….. దేవుని తలువాలు
~~~~~~~~~~~~~
రాజన్నగుడిలో.. సీతారాముల పెండ్లి ముచ్చట ఇది…
వైష్ణవ ఆలయాలలో సీతారాముకళ్యాణం జగమెరిగినదే.
కానీ శివాలయంలో సీతారాముల పెండ్లి, ఒక పెద్ద ముచ్చట !
వేములవాడ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన శివాలయం.
ఇక్కడి పురాపద్దతులూ ఆచారాలూ అంతే ప్రాముఖ్యత కలిగినవి.
తమ లింగభేదంతో సంబంధం లేకుండా ఆడా, మగా, వైవిధ్యులూ.. అన్నిరకాల వారూఇక్కడ రాజరాజేశ్వరున్ని పెండ్లి చేసుకుంటరు.
దేవున్ని తమ ఆత్మలో భర్తగా స్వీకరించే ఈ ప్రక్రియ పేరు.. ధారణ.
ధారణ అంటే లింగధారణ & వివాహపు పుస్తెమట్టెల ధారణ..!
వేములవాడ రాజన్న గుడిలో జరిగే.. సీతారాముల పెండ్లికి
వందలయేండ్లుగా ధారణ విషయమై విశేషప్రాధాన్యత ఉన్నది.
ధారణ చేయించుకునుటకు ఇదొక సద్ముహూర్తంగా భావిస్తరు.
లింగవైవిధ్యం కలిగిన ఎందరో యువతీయువకులకు ఈ పెండ్లి
ఇంటిలో జరిగే తమ అక్కాబావల పెండ్లంతటి గొప్ప సంబురం.
వీరందరికీ.. శ్రీరాముడు తరతరాలుగ పెద్దదిక్కైన ఆరాధ్యదైవం.
వీరి జీవనసంస్కృతిలో రాముడు, శక్తి (ఇక్కడ బద్ది పోచమ్మ )
ప్రముఖమైన దేవతలు. తమ అస్తిత్వాన్ని గుర్తించిన రాజుగా
శ్రీ రామచంద్రున్ని తమ ఆత్మీయుడిగా భావించేసంస్కృతి ఇది.
తమకు ఇష్టమైన రీతిలో జీవించి ఆడిపాడి సంబురపడుటకు
ఇక్కడ.. వారందరికీ ఆటంకం, అవమానం లేని స్వేచ్ఛ ఉన్నది.
ఇందుకోసమే దేశదేశాలవారంతా.. పెండ్లికి ఈడికి చేరుకుంటరు.
దేవునిపెండ్లి కండ్లారావీక్షించి ఆ తలువాలు అక్షతలుగా తలదాల్చి
ఆ తర్వాత అర్థనారీస్వరూపుడైన రాజరాజేశుడిని తమ భర్తగా
స్వీకరించి, దేవునితో ఇచ్ఛాపూర్వక వివాహం జరుపుకుంటరు..!
అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా.. వేములవాడ రాజన్నగుడి
శ్రీరామనవమికి ఒక విశిష్టమైన కళ్యాణవేదిక. ఇదో పెద్ద నేపథ్యం.
మనకు ఒక్కచేతికి ఉన్న అయిదువేళ్లు సమానంగా లేనట్టుగానే
ప్రకృతి ఒకటేఅయినా , తమను కన్నతల్లి గర్భం ఒకటే అయినా
మనుషుల పుట్టుకలో ఎన్నో అసమానతలు, ఎన్నో వైవిధ్యాలు.
అందరికీ జీవించే హక్కువుంది అని ప్రకటించే పవిత్రస్థలం ఇది.
అందుకే అటువంటివారందరికీ.. ఈ రాజన్నగుడి అమ్మగారిల్లు..!
మనుషుల హక్కుల గురించిన, సమానత్వం గురించిన చర్చ
శైవంలో బొచ్చెడు జరిగింది. ఆ.. సంస్కరణల అవశేషమే ఇది.
ఇక్కడ అందరూ సమానమే. పైగా వీరంతా అందరికీ పూజ్యులు.
వీరి మనసును గౌరవించుట, మనలో మనుషులుగా గుర్తించుట
సమాజపు బాధ్యత. దీన్ని మనకు స్పష్టంజేసేదే ఈ రాజన్నగుడి !
వేములవాడ రాయేశుని గుడి అనాదిగ సంస్కరణలకు తావు.
అంగవైవిధ్యంతో పుట్టిన పశువులు.. ఇక్కడ దైవ స్వరూపాలు.
అంగవైవిధ్యంతో పుట్టిన మనుషులు.. ఇక్కడ దైవంలోభాగాలు.
ఒకసారి ధారణజరిగిందంటే వారిని కామెంటు చెయ్యడం తప్పు.
ఇదీ.. ఇక్కడ వైవిధ్యపుట్టుకలకు దొరికే ఒక వివాహాత్మక భద్రత.
ఈ తాత్త్వికత తెలియని మనుషులకు ఈ విషయంతో పనిలేదు.
వెంట్రుకపీకి చేతికిస్తే, కొనమొదలు తెలువనివారినీ.. వదిలేద్దాం..!!
~ డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
Share this Article
Ads