ముందుగా ఓ కథ వంటి సంఘటన చదువుదాం… కథ అనడం ఎందుకంటే… పిల్లికి బిచ్చం వేయని, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వాళ్లుండే సినిమా ఫీల్డులో ఇలాంటి ‘‘నిజమైన హీరోలు’’ ‘‘మనసున్న కథానాయకులు’’ కూడా ఉంటారా అని మనకు డౌట్ వస్తుంది కాబట్టి… 2015లో ఆంధ్రజ్యోతిలో శ్రావణ్ అనే పేరుతో ఓ ఆర్టికల్ వచ్చింది… అందులోనే వివరాలున్నాయి కాబట్టి… సంక్షిప్తంగా, సూటిగా అందులో ఏముందో చూద్దాం…
‘‘తెలంగాణలోని మానుకోట నుంచి 1973లో ఓ కుర్రాడు మద్రాసు పారిపోయాడు… వాడికి సినిమా పిచ్చి… ఏడో తరగతి పరీక్షలు రాసి, సెకండ్ షో చూసి, 20 రూపాయలతో మద్రాస్ రైలెక్కేశాడు… పగలంతా సినిమా నటుల ఇళ్ల చుట్టూ తిరిగాడు… రాత్రి కాగానే భయం… ఓ డ్రైవర్ తన కారు షెడ్‌లో పడుకోనిచ్చాడు… తెల్లారి హీరో కృష్ణ ఇంటి ముందు చేరి, తచ్చాడుతున్నాడు… సాయంత్రం దాకా అక్కడక్కడే కనిపిస్తున్నాడు…
విజయనిర్మల మూడునాలుగుసార్లు ఆ కుర్రాడిని చూసింది… సాయంత్రానికి కృష్ణ వచ్చాడు, పిలిచాడు… ఎవరు నువ్వు అన్నాడు… నేను అనాథను అని ఆ పిల్లాడు అబద్ధం చెప్పాడు… సర్లే, ఇక్కడే ఉండు అన్నారు… ఆ సమయానికి వాళ్లకు అలా అనాలని అనిపించింది… ఇలా పారిపోయి వచ్చే వాళ్లందరినీ ఉండిపొండి అనలేరు కదా… డ్రైవర్‌ను పిలిచి ఆ కుర్రాడికి కొత్త బట్టలు కొనివ్వమని డబ్బులు ఇచ్చారు… మరుసటిరోజు దీపావళి… ఆ పిల్లాడితో టపాకులు కూడా కాల్పించారు కృష్ణ దంపతులు…
Ads
మూడున్నర నెలలు అక్కడే ఉన్నాడు… ఫోన్ దగ్గర కూర్చుని, ఎవరెవరు ఫోన్లు చేశారనే వివరాలు, నంబర్లతో సహా రాసిపెట్టడం తన పని… ఈలోపు పిల్లాడి తల్లిదండ్రులు తన జాడ కోసం వెతుకుతూ ఉన్నారు… పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు… చివరకు తెలిసింది… బంధుగణం కృష్ణ ఇంట్లో వాలింది… ఆయన పిల్లాడిని పిలిచి ‘‘తల్లిదండ్రులను బాధపెట్టకు, బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు’’ అని హితవు చెప్పి వాళ్లతో పంపించేశాడు…
ఆ పిల్లాడికి సినిమాల పిచ్చి… మధ్యలో ఒకసారి కృష్ణను కలిశాడు… ఆయన ఇచ్చిన కీచైన్ గిఫ్టు తీసుకున్నాడు… ఆ తరువాత 40 ఏళ్లపాటు కృష్ణ దగ్గరకు వెళ్లలేదు… కొడుకు పేరు విమల్ కృష్ణ, కూతురు పేరు రమ్య కృష్ణ అని పెట్టుకున్నాడు… ఆ కుర్రాడిని నేనే… ఇది నా కథే…’’……. ఇదీ ఆ ఆర్టికల్ సారాంశం… గుడ్, అలా ఆదరించేవాళ్లు ఎవరుంటారు ఈరోజుల్లో… దటీజ్ కృష్ణ… ఇండస్ట్రీలో కూడా అందరికీ కావల్సినవాడు…
సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు Bhandaru Srinivas Rao ఆ పాత క్లిప్పింగ్ జతచేస్తూ… ఇంకొన్ని వివరాలు పంచుకున్నారు ఇలా… ‘‘ఆ ఆర్టికల్ రాసింది మా మేనల్లుడే… పింగిలి శ్రవణ్ కుమార్… ఈ ఉదంతం సుఖాంతం కావడంలో ‘ఆంధ్రజ్యోతి’కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీబీఐ డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు అప్పట్లో కృష్ణా ఎస్పీ. వారిని కలిసి ‘మిస్సింగ్ అప్లికేషన్’ ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము.
మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి, కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి, మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. ‘బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు’ అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు…
ఆ శ్రావణ్ కొడుకు విమల్ కృష్ణ పెద్దయి, బీటెక్ చేశాడు… కొలువుల జోలికిపోలేదు… సినిమాల మీద తనకూ మక్కువే… అదే ధ్యాస… తనను తాను నిరూపించుకునే డీజె టిల్లు సినిమా డైరెక్ట్ చేసి, మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న సినిమా కోరికను ఈ విధంగా తీర్చాడు…’’
Share this Article