జీతెలుగు చానెల్ బాధ్యులు ఒక్కసారి గనుక పాత పాడుతా తీయగా వీడియోలు గానీ… మన తెలుగు టీవీల్లోనే వచ్చిన సూపర్ సింగర్ ఎపిసోడ్లు గానీ…. పోనీ, ఇప్పటి ఇండియన్ ఐడల్ గానీ చూసి ఉన్నట్టయితే బాగుండు…! సరిగమప గ్రాండ్ ఫినాలే ఇంత పేలవంగా ఉండి, ఇంతగా ఇజ్జత్ పోయేది కాదు..! ఈమధ్యకాలంలో ఏ టీవీ ప్రోగ్రాం ఫినాలే కూడా ఇంత బేకార్ ఫినాలేగా ముగియలేదేమో… మూడున్నర గంటలపాటు ఇంతటి నిస్సారమైన ఫినాలేను ప్రసారం చేయడానికి నిజానికి జీవాడు భలే సాహసం చేసినట్టే..! వాస్తవానికి ఈ ప్రోగ్రాం మొదటి నుంచే ఫ్లాప్… టీఆర్పీల వేటలో ఎప్పుడో చతికిలపడిపోయింది… మరీ అర్థంతరంగా రద్దు చేయలేరు కాబట్టి మమ అనిపించేసి, ఫినాలే దాకా ఎలాగోలా లాక్కొచ్చి, హమ్మయ్య అని చేతులు దులిపేసుకున్నారు… ష్, యశస్వి విజేత అవుతాడని చిన్న పిల్లలు కూడా చెప్పేస్తున్నారు చాలారోజుల నుంచి..! ఈమధ్య ఈటీవీ వాడు వావ్, క్యాష్, జబర్దస్త్… ఇలా ప్రతి ప్రోగ్రామునూ సినిమా యాడ్స్‌కు వేదికలుగా చేసేశాడు కదా… నేనేం తక్కువ తిన్నాను అనుకుని జీవాడు కూడా సేమ్ బాట… అయితే ఓ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేను కూడా సినిమా ప్రచారానికి వాడేసిన కక్కుర్తి మాత్రం ఇదే తొలిసారి కావచ్చు…
సూపర్ స్టోన్… సిద్ శ్రీరాం వచ్చాడు… కొందరు హఠాత్తుగా ఎందుకు పాపులర్ అవుతారో తెలియదు… సరే, కాసేపు పాడి వెళ్లిపోయాడు… కొంతసేపు సునీతకు అభినందనల ప్రోగ్రాం… ఎందుకా..? పెళ్లిచేసుకున్నది కదా… అందుకు…! ఆయనెవరో పాటలు నేర్పే గురువును తీసుకొచ్చి, పాపులర్ గాయనీగాయకులు సన్మానించారు… సరే, అదొక్కటీ మంచిదే… కానీ ఒక ప్రోగ్రాం ఫినాలేకు సూటయ్యేది కాదు… మిగతా ఎపిసోడ్లలో వోకే… తరువాత రాణా వచ్చాడు… వెంబడి అరణ్య హీరోయిన్ శ్రియ వచ్చింది… తనెందుకు వచ్చాడబ్బా అని మనం అనుకునేలోపు… త్వరలో విడుదల కాబోయే అరణ్య సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడని కాస్త లేటుగా అర్థమయింది… ఓ ట్రెయిలర్, ఓ టీజర్, ఓ సాంగ్ వీడియో… వేసేసి, ఆ సినిమా గురించి రాణాతో నాలుగు ముచ్చట్లు చెప్పించి… ప్రమోషన్ వర్క్ పూర్తి చేశామనిపించేశారు…
Ads
ఈ బోరింగ్ ఎపిసోడ్లతో అసలు ఫినాలే బోలెడంత ఎడిటింగుకు గురైంది… పేరుకు లైవ్ అన్నారు… అంతే… ఫైనలిస్టుల పాటల ఎంపిక కూడా పేలవం… చకచకా ఎలిమినేషన్లు… అసలు ఒక ప్రోగ్రాం ముగింపు పాటలు ప్రేక్షకులను ఎంత అలరించాలి..? ఇక్కడ పూర్తి విరుద్ధం… జడ్జిలు కూడా వచ్చామా, కూర్చున్నామా, చెప్పినట్టుగా ప్రకటించామా, చేతులు దులుపుకుని పోయామా అన్నట్టుగా వ్యవహరించారు… ఒక జోష్, ఒక ఎమోషన్ ఏమీ లేకుండా సాగిన మ్యూజిక్ టీవీ షో ఫినాలే ఇదే… ఈమాత్రం షోకు ఎడాపెడా ప్రొమోలు స్పెషల్‌గా షూట్ చేసి కట్ చేయించారు… ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణానంతరం ఈటీవీ స్వరాభిషేకం వేగంగా దిగజారిపోయింది… మాటీవీలో వచ్చే స్టార్ మ్యూజిక్ అనేది ఓ కిట్టీ పార్టీ పల్లీబఠానీ టైపు… ఇక జీవాడి సరిగమప గురించి చెప్పేసుకున్నాం… జెమినివాడు సర్వసంగ పరిత్యాగి, వాడికి ఇవేమీ పట్టవు… మరీ మన తెలుగు చానెళ్ల సీరియళ్లే దరిద్రం అనుకుంటే, చివరకు రియాలిటీ షోలను కూడా ఇంత నాసిరకంగా మార్చేయాలా..?!
Share this Article