.
రెండు మూడురోజుల క్రితం ఓ వార్త… నలుగురు ముఖ్యమంత్రులతో ప్రధాన పాత్రల్లో నటించిన ఆమె ఎవరో తెలుసా అనే శీర్షిక…
ఎవరెవరు..? ఏంజీ రామచంద్రన్, జయలలిత, ఎన్టీయార్, కరుణానిధి… హీరోయిన్‌గానే గాకపోవచ్చు… ఆమె జన్మదినం సందర్భంగా ఆ వ్యాసం… ఆ నలుగురితో నటించడం, కలిసి పనిచేయడం అనేది పెద్ద విశేషం కాకపోవచ్చు,… కానీ..?
Ads
ఇప్పుడు ఆమె వయస్సు 93 ఏళ్లు… నిండు నూరేళ్లూ బతకనీ… ఆమె చిత్రరంగ ప్రస్థానం వివరాలు అందరికీ తెలుసు గానీ… ఇన్నేళ్లూ ఆరోగ్యాన్ని కాపాడుకునే తీరు విశేషం అనిపించింది… ఆమె చెల్లె కృష్ణకుమారి కూడా అందరిెకీ తెలిసిన తెలుగు హీరోయినే…
బెంగుళూరు శివార్లలో, విస్తారమైన పచ్చదనం నడుమ ఇంటిలో ఉండేవారు… సినిమా రంగం అంటేనే అనేక ప్రలోభాలు, వ్యసనాలు, అనారోగ్యకరమైన అలవాట్లు, సమయపాలన లేని వృత్తి, ఒత్తిళ్లు, వేధింపులు గట్రా బోలెడు… అదుగో ఆ పరిస్థితుల నుంచి కూడా దాటుకుని, ఇన్నేళ్లు ఆరోగ్యకరమైన విశ్రాంత జీవితం పొందగలగడం ఓ వరమే…
కావచ్చు, కొందరి బాడీ కాన్‌స్టిట్యూషన్ సహకరించవచ్చు… అసలు ఇలా ఏజ్ ఓల్డ్ బామ్మలు ఎవరున్నారా అని వెతికితే… ఒక పేరు కనిపించింది… ఆమె తారలందరిలోనూ సీనియర్… పేరు కామిని కౌశల్… ఆమె వయస్సు 97 ఏళ్లు…
పుట్టింది లాహోర్, ఆమె నటిస్తున్న రోజుల్లో దిలీప్ సహా చాలామంది ప్రేమించారు… కానీ ఇద్దరు పిల్లల్ని కని మరణించిన తన అక్క భర్త (బావ)ను పెళ్లిచేసుకుంది, ఆ పిల్లల కోసం… షావుకారు జానకికన్నా కాస్త చిన్న వైజయంతిమాల… ఆమె 91 ఏళ్లు…
అప్పట్లో బాలీవుడ్‌లో మాలా సిన్షా పాపులర్ నటే… ఇప్పుడు చాలామందికి ఆమె పేరు తెలియదు… ఇప్పుడామె వయస్సు 88 ఏళ్లు… మనకు తెలిసిన బి.సరోజాదేవి 86 ఏళ్లు… హెలెన్ తెలుసు కదా, మెరుపు తీగ… డాన్సర్… వయస్సు 86 ఏళ్లు…
అందరూ తమ ఆరోగ్యాల్ని బాగానే కాపాడుకున్నారు… అసలు 70 దాటడం ఒకప్పుడు పెద్ద విషయం… మన ఇండియన్ సొసైటీలో సగటు ఆయుప్రమాణం బాగానే పెరిగింది… ఐనా 80 దాటడం ఈరోజుకూ ఓ ఘనతే కదా…
అంతెందుకు..? మనందరికీ బాగా తెలిసిన హీరోయిన్ కాంచన… 85 ఏళ్లు… ఉన్నదంతా దేవుడికి రాసిచ్చి, ప్రశాంతంగా ఓ ఆధ్యాత్మిక జీవితం గడుపుతోంది… హిందీ హీరోయిన్, అప్పుడప్పుడూ తెరపై కనిపించే వహీదా రెహమాన్ వయస్సు 86 ఏళ్లు… సేమ్, షర్మిలా ఠాగూర్ కూడా అదే వయస్సు… ఆశా పరేఖ్ వయస్సు 82 ఏళ్లు…
నిజానికి వాళ్లతో పోలిస్తే జీనత్ అమన్ (73), రేఖ (70), హేమమాలిని (76) ఇంకా చిన్నవాళ్లే… మొన్న ఏదో వేదిక మీద రేఖ ఈ వయస్సులో కూడా డాన్స్ చేసి మెప్పించింది… సేమ్, హేమమాలిని కూడా వేదిక మీద డాన్స్ చేయగల మంచి ఫిట్‌నెస్ ఇప్పటికీ…
వేర్వేరు భాషల్లో ఇంకా చాలామంది ఉండవచ్చు… అందరూ అభినందనీయులే… ఒకప్పుడు సినిమాల్లో వెలిగి, నాటి ఇండస్ట్రీ అనారోగ్య వాతావరణంలో కాలం వెళ్లదీసి… ఈ వయస్సు దాకా ఆరోగ్య, ఆయుమార్గంలో రావడం ఓ వరమే..!!
Share this Article