నిజమా..? నిజమేనా..? ఒకటికి నాలుగుసార్లు కళ్లు నులుముకుని చూడాల్సి వచ్చింది… కోట్లకుకోట్ల ఖర్చు పెడుతున్నారు కదా బిగ్‌బాస్ షో మీద… స్టార్ మాటీవీకి ప్రిస్టేజియస్ షో కదా… బోలెడు వివాదాలు… తెల్లారిలేస్తే బొచ్చెడు వార్తలు… హౌజు నిండా తగాదాలు… ఫుల్ హంగామా కదా… ఆ షో గ్రాండ్ లాంచింగ్ నాలుగో తేదీ, ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుంచి 9.40 గంటల దాకా… అంటే పావు తక్కువ నాలుగు గంటలు…
కంటెస్టెంట్ల ఎంట్రీలు, డాన్సులు, అట్టహాసాల ప్రదర్శనకే బోలెడు ఖర్చు పెట్టారు… సహజంగానే మంచి రేటింగ్స్ వచ్చి ఉంటాయని అనుకుంటాం కదా… కానీ తీరా తాజా బార్క్ రేటింగ్స్ పట్టికలు చూస్తే హాశ్చర్యపోవాల్సి వచ్చింది… అసలు టాప్ వన్ అనుకుంటే, టాప్ టెన్‌లో లేదు, టాప్ ట్వంటీలో లేదు, టాప్ థర్టీలో కూడా లేదు… ఎక్కడో దిగువన టాప్ 42 ప్లేసులో కనిపించింది… జస్ట్, 5.44 రేటింగ్స్ మాత్రమే… (హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ కేటగిరీ)…
ఏమిటిది..? ఎందుకిలా జరిగింది..? నిజంగా ఎవరూ చూడలేదా..? జనం ఛీకొడుతున్నారా..? ఎహెఫోరా అని అందరూ సీపీఐ నారాయణలై పోయారా..? కాదు, ఏదో జరుగుతోంది… అదీ తరువాత చెప్పుకుందాం… ముందు అంకెలు తెలుసుకుందాం… ఎన్టీఆర్ హోస్ట్‌గా వచ్చిన మొదటి సీజన్‌కి 16.18 రేటింగ్ వచ్చింది. బుల్లితెర హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ రేటింగ్ కాగా.. నాని హోస్ట్ చేసిన రెండో సీజన్ 15.05 రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే మూడో సీజన్‌కి 17.9 రేటింగ్ రాబట్టి ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేశారు కొత్త హోస్ట్ నాగార్జున. నాలుగో సీజన్‌లో పాత రికార్డులన్నింటినీ చెరిపేస్తూ 18.5 రేటింగ్ సాధించారు. ఐదో సీజన్ 18 రేటింగ్ మాత్రమే సాధించి, పర్లేదు అనిపించుకుంది…
Ads
సో, ఎప్పుడైనా గ్రాండ్ లాంచింగ్ 15 కనీస టీఆర్పీ దాటాల్సిందే… కానీ ఈసారి మరీ 5.44 రేటింగ్స్… మహా అయితే ఏపీ, తెలంగాణ రేటింగ్స్ కూడా కలిపితే మరో 2 లేదా 3… మరీ ఇంత ఘోరం ఏమిటి..? ఓ తప్ప, ఓ తాలు సరుకుకు కూడా ఇంతకన్నా మంచి రేటింగ్స్ వస్తున్నాయి కదా… ఇవి హోస్ట్ నాగార్జునతో సహా బిగ్‌బాస్ షో ఒరిజినల్ నిర్మాతలు ఎండెమాల్ షైన్, ఇండియా హక్కుల ఓనర్ అంబానీ వయాకామ్ కలర్స్, తెలుగులో ప్రసారం చేసే స్టార్‌మాటీవీ అన్నీ సిగ్గుతో తలదించుకునేవే..?
రేటింగ్స్ జాబితాలు రాగానే, అప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో ప్లాట్‌ఫారాల మీద డప్పు కొట్టుకునే స్టార్‌మా నుంచి చడీచప్పుడు లేదు… హడావుడి లేదు… మరీ ఇంత దరిద్రంగా రేటింగ్స్ అనేది రెగ్యులర్‌గా టీవీ రేటింగ్స్ ఫాలోఅప్ చేసుకునే రివ్యూయర్లకు కూడా అంతుపట్టడం లేదు… టీవీ మార్కెటింగ్ సర్కిళ్లలో కూడా ఇప్పుడు ఇదే చర్చ… బిగ్‌బాస్ రేటింగ్స్ విషయంలో ఏం జరుగుతోంది..?! అసలు ఈసీజన్ మొత్తానికే ఎందుకు అండర్ ప్లే అవుతోంది..? అవీ చెప్పుకుందాం… కానీ వేరే కథనంలో…!!
అన్నట్టు… గ్రాండ్ లాంచింగ్ కాస్తా ఢమాల్ సరే… మరి వీక్ డేస్‌లో… అవి మరీ దారుణం… సోమ, మంగళవారాల్లో 2.59, శుక్రవారం 2.06, గురువారం 1.86, బుధవారం 1.83 రేటింగ్స్… ఈ దెబ్బకు ఆరేడు వారాలకు కుదించి, అర్థంతరంగా లేపేస్తే బెటర్ అనిపిస్తోందా…? అదే కరెక్టు…!!
Share this Article