.
మళయాళ సినీ ఇండస్ట్రీ చూసిన గొప్ప నటుల్లో పలుప్పురాత్ కేశవన్ సురేంద్రనాథ్ తిలకన్ ఒకరు. ముందు ఒక థియేటర్ ఆర్టిస్ట్ గా నాటకాలు వేసిన తిలకన్.. సూపర్ స్టార్ సంస్కృతికి బద్దవ్యతిరేకి.
అలా మళయాళ సూపర్ స్టార్స్ గా ఇప్పటికీ తిరుగులేకుండా వెండితెరపై కనిపిస్తున్న మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి స్టార్స్ సినిమాలనూ వ్యతిరేకించినవాడు. అయితే, నెహ్రూ మన్ననలు పొందిన తిలకన్ జీవిత కథ మిగిలిన నటులతో పోలిస్తే కాస్త భిన్నమైంది.
Ads
సినీనటుడిగా ఎంట్రీ కంటే ముందే ఆర్మీలోకి!
తిలకన్ జీవితం స్టేజ్ నాటకాలతోనే ప్రారంభమైనా.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం రావడంతో పొట్టకూటి కోసం తన అభిరుచిని పక్కనబెట్టాల్సి వచ్చింది. అలా భారత సైన్యంలో పనిచేస్తున్నప్పుడు సర్వీస్ లో ఉండగా తిలకన్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు.
తన కాలు తొలగించాల్సిన పరిస్థితేర్పడింది. ఆర్మీ శిబిరంలోని వైద్యులు తొలగించకపోతే ఇబ్బంది పడుతారని చెప్పారు. ఆ సమయంలో తానున్న ఆర్మీ బేస్ క్యాంపుకు అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వచ్చారు. వాస్తవానికి ఆర్మీ రూల్స్ ప్రకారం ఎవరు పడితే వారు గెస్ట్ గా వచ్చిన ప్రధానితో మాట్లాడటమంటే కుదిరే పని కాదు.
కానీ ఎలాగోలా ఆ సమయంలో నెహ్రూతో మాట్లాడే అవకాశం తిలకన్ కు దక్కింది. తనను తాను నటుడిగా కూడా పరిచయం చేసుకున్న తిలకన్.. తనకు యాక్సిడెంటల్ గా జరిగిన గాయంతో తన కాలు తీసేయాలంటున్నారనే విషయాన్ని నెహ్రూ చెవిన వేశారు. కానీ, అది తనకిష్టం లేదని తెలియజేశారు.
దాంతో వెంటనే సైనికుడిది గానీ, వారి కుటుంబీకులది గానీ అనుమతి లేకుండా… కాలు తీసేసే పని చేయొద్దని.. వెంటనే మరింత మంచి హాస్పిటల్ కు తరలించి తిలకన్ వైద్యమందించాలని నెహ్రూ ఆర్మీ అధికారులను ఆదేశించారు. అలా తన కాలు తీసేయాలనే ఆర్మీ శిబిరంలోని వైద్యుల ఆలోచన నుంచి తిలకన్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏకంగా ఆ ఆర్మీ ఉద్యోగం నుంచే బయటకొచ్చేశాడు తిలకన్.
ఆర్మీ నుంచి మళ్లీ థియేటర్ ఆర్ట్స్ లోకి రీఎంట్రీ!
కేరళ పతనంతిట్ట జిల్లాలోని అయిరూర్ లో జన్మించిన తిలకన్ కొల్లాం కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే నాటకాల వైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన స్నేహితులతో కలిసి ముండకాయం నాటక సమితిని ఏర్పాటు చేసుకుని నాటకాలు వేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా జూలియస్ సీజర్ నాటకమంటే తిలకన్ కు చాలా ఇష్టముండేదట.
కేరళ పీపుల్స్ ఆర్ట్ క్లబ్ తోనూ, కాళిదాస వంటి నాటక సమితితోనూ పనిచేస్తూనే.. తన సొంత నాటక సమితిని కూడా ఏర్పాటు చేసుకున్న తిలకన్ సినిమావాళ్ల దృష్టిలో పడ్డాడు. అలా 1973లో పెరియార్ సినిమాలో పీజే ఆంటోని పాత్రతో తిలకన్ సినిమా జీవితం ప్రారంభమైంది.
ఎన్నో చిత్రాల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో అవార్డులు కొల్లగొట్టిన తిలకన్ ముక్కుసూటి వ్యక్తి. సూపర్ స్టార్ సంస్కృతిని వ్యతిరేకించినవాడు కావడంతో.. చాలా సినిమాల్లో ఆయనకు వచ్చిన అవకాశాలూ ఆ తర్వాత దూరమైపోయాయి.
ఆయన ముక్కుసూటి తనం, తనకు ఇష్టం లేని విషయాలన్ని కుండబద్ధలు కొట్టే సంస్కృతేదైతే ఉందో అది ఆయన్ను కొందరు నిర్మాతలు, నటులు ఏకంగా తమ సినిమాల నుంచే నిషేధించే స్థాయికి చేరుకుంది.
అమితాబ్ కు అవార్డ్ రావడంపై వివాదాస్పద వ్యాఖ్యలు!
1991లో పెరుమ్తచన్ అనే సినిమాలో అతడి నటన కేవలం మళయాళం వరకే కాకుండా.. దేశవ్యాప్తంగా విమర్శలకుల ప్రశంసలందుకుంది. వాస్తవానికి ఆ సినిమాలో తిలకన్ నటనకే ఆ ఏడాది జాతీయ చలనచిత్ర అవార్డ్ దక్కుతుందనేంత చర్చ జరిగింది.
- కానీ, ఆ అవార్డ్ ఆ ఏడాది అనూహ్యంగా అగ్నిపథ్ సినిమా కోసం అమితాబ్ కు ఇచ్చారు. 2008లో ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో తిలకన్ గుర్తు చేసుకుంటూ ఆ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరలేపారు.
- నాయకుడెవరనే పేరును రివీల్ చేయకుండా ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి అండదండలతోనే.. పొల్టికల్ లాబీయింగ్ తోనే అగ్నిపథ్ లో అమితాబ్ కు ఆ అవార్డ్ ఇచ్చారన్న ఆ వ్యాఖ్య ఆ సమయంలో పెద్ద చిచ్చే రేపింది. అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పే బోల్డ్ మనస్తత్వంతోనూ వార్తల్లో వ్యక్తైన నటుడు తిలకన్.
సమరసింహారెడ్డిలో బాలయ్య తండ్రిగా కనిపించిన తిలకన్ అడపాదడపా కొన్ని తెలుగు సినిమాల్లోనూ నటించారు. కన్నడలోనూ మదర్ ఇండియా సినిమాలో నటించారు. మళయాళంతో పాటు.. మరిన్ని ఎక్కువగా తమిళ సినిమాల్లో పనిచేశారు.
తిలకన్ కు 2006, 2001లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు.. 1987, 2006, 2012లో ఉత్తమ సహాయ నటుడిగా, ఆ తర్వాత ఉత్తమ జ్యూరీ మెన్షన్ లో భాగంగా జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాడు. 2009లో భారత ప్రభుత్వం తిలకన్ ను పద్మశ్రీతో సత్కరించింది.
తన జీవితంలో తనకెదురైన శారీరక, మానసిక సవాళ్లను ఎదురీదుతూ నటనా సమాజంలో మాత్రం తిలకన్ తనకంటూ ఒక గొప్ప పేరు తెచ్చుకుని వెళ్లిపోయాడు…… ( రమణ కొంటికర్ల )
Share this Article