ఫాఫం… దర్శకేంద్రుడిగా పిలిపించుకున్న అలనాటి పాపులర్ నంబర్ వన్ దర్శకుడు రాఘవేంద్రరావును చూస్తే జాలేసింది… నవ్వొచ్చింది… ప్రతి పండుగకీ ఈటీవీ వాళ్లు ఏదో ఓ స్పెషల్ ప్రోగ్రాం చేస్తారు కదా… ఈసారీ చేశారు… పేరు దసరా బుల్లోళ్లు… ప్రదీప్, ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ సీను, పొట్టి నరేష్‌తోపాటు సరే, ఎలాగూ ఉంటారు కదా… రోజా, శేఖర్ మాస్టర్ ఎట్సెట్రా… ఉన్నారు, మూడు గంటలపాటు ఏదేదో చేశారు, నవ్వించే ప్రయత్నం చేశారు… అంతమంది కమెడియన్లు ఉన్నా సరే, నవ్వించలేక నానా అవస్థలూ పడ్డారు… కానీ ఒక విషయంలో రాఘవేంద్రరావును చూస్తే ఎందుకు జాలేసిందీ అంటే..? అలనాటి పెళ్లిసందడి అనే సూపర్ హిట్ సినిమాను తలపిస్తూ ఈమధ్య రాఘవేంద్రరావు తన పర్యవేక్షణలో పెళ్లిసందD అనే ఓ పిచ్చి సినిమాను తీశాడు కదా ఈమధ్య… నాటి సినిమాలో హీరో శ్రీకాంత్ కొడుకు ఈ కొత్త సినిమాలో హీరో… దాని ప్రమోషన్ కోసం ఈ దసరా బుల్లోళ్లు అనే దసరా స్పెషల్ ప్రోగ్రాంలో దాదాపు గంటసేపు స్కిట్స్ గట్రా చేశారు… పరమ నాసిరకంగా సాగింది… అంతేకాదు…
అది నడిచినంతసేపూ బొడ్డు, పళ్లు అంశం మీదే నడిచింది ఎపిసోడ్ అంతా..! అందుకని రాఘవేంద్రరావును చూస్తే జాలేసింది… ఆ బొడ్డు సెటైర్లు చూస్తూ రాఘవేంద్రరావు నవ్వాడు, ఆనందించాడు, తనూ ల్యాండింగ్ ప్లేస్ అంటూ వెకిలి వ్యాఖ్యలు చేశాడు… అంతేలెండి, అంతకుమించి చేసేది కూడా ఏమీ లేదు… నిజంగా రాఘవేంద్రరావు అంటే బొడ్డు, పళ్లు… ఇవేనా..? తెలుగు సినిమాను ఓ సూపర్ కమర్షియల్ తోవ చూపించిన దర్శకుడు తను… పాత్రౌచిత్యం, లాజిక్కుల కథనం తొక్కాతోలూ ఏమీ పట్టించుకోకుండానే సూపర్ స్టార్లతో సూపర్ సినిమాల్ని తీశాడు, విమర్శకులు ఛ, థ గుణింతాలు వల్లెవేసినా సరే, సగటు ప్రేక్షకుడు ఎంజాయ్ చేశాడు… కరోనా కాలంలో హాస్పిటల్స్ మైనింగు చేసుకున్నట్టు నిర్మాతలు కూడా ఆయన సినిమాల్ని తెగ డబ్బు చేసుకున్నారు… జనం పల్స్ తెలిసిన దర్శకుడు తను… విలువలు, ప్రమాణాలు, బొక్కా, బోషాణం వంటి పదాలేమీ ఆయనకు అక్కర్లేదు… అవి పనికిమాలినవి అని ఆయనకు ఎప్పుడో తెలుసు… అందుకే మాంచి ఫార్ములా కథలతో కుమ్మేసేవాడు… కానీ ఆయనంటే కేవలం ఆడదాని బొడ్డు, దాన్ని ఓ డస్ట్ బిన్‌గా మార్చేసి పళ్లను డంప్ చేయడమేనా ఆయన ఘనత..?
Ads
ఈ దసరా బుల్లోళ్లు ప్రోగ్రాంలో చాలాసేపు ఇదే చర్చ, ఇదే రచ్చ… థూ… నిజానికి రాఘవేంద్రరావు సిగ్గుపడాలి… పరమ చిల్లరగా, నాసిరకంగా సాగింది ఆ ఎపిసోడ్ అంతా…! ఈలెక్కన ఎవడైనా రాఘవేంద్రరావు బయోపిక్ తీస్తే, బయోగ్రఫీ రాస్తే అందులో ఈ బొడ్డు-పళ్లే ఎక్కువగా చోటుచేసుకుంటాయేమో…. చివరకు నీ బతుకు ఎలా మారిపోయింది రాఘవేంద్రా..? సరే, ఈ ప్రోగ్రాంలో మరీ ఆడ్‌గా అనిపించింది శశిరేఖ పరిణయం అనే ఎపిసోడ్… అది మరింత చిల్లరగా ఉంది… ప్రత్యేకించి రోజా శశిరేఖగా కనిపించినంతసేపూ… ఆ శేఖర్ మాస్టర్‌ను అభిమన్యుడిగా చూస్తున్నంతసేపూ ఓ వెగటు గగుర్పాటు… ముసలిదైపోయాక కూడా జమున సత్యభామ వేషం వేసేది కొన్నాళ్లు… అది చూసినట్టు అనిపించింది… ఫాఫం, ఆ స్థూలకాయంతో నాటి మహానటి సావిత్రి ఇజ్జత్ తీశావు కదా రోజమ్మ తల్లీ… దసరా రోజున ఇంత వెకిలి, నాసిరకం ప్రోగ్రాం అందించిన మల్లెమాల వాళ్లకు…?? వద్దులెండి…!! ఏమాటకామాట… ఆడవాళ్లపై అకృత్యాలపై చేసిన ఓ ఎపిసోడ్ మాత్రం బాగుంది… అభినందనలు…!
Share this Article