ఓ మిత్రుడి పోస్టు సొరకాయను (తెలంగాణలో అనపకాయ, ఆన్యపుకాయ) మించిన కాయ లేదు అని..! నిజమే, దాని ఇంపార్టెన్స్ తెలియదు చాలామందికి… ప్రత్యేకించి ఈ తరానికి..! ఎప్పుడూ ఎగుడు దిగుళ్లు లేని రేటు… కాస్త అటూఇటూ ఒకటే రేటు ఎప్పుడూ… మంచి ఆర్గానిక్… ఎరువులు అక్కర్లేదు, పెస్టిసైడ్లు అక్కర్లేదు… పంట దెబ్బతినడాలు, అకస్మాత్తుగా రేట్లు పడిపోవడాలు, పెరిగిపోవడాల్లేవ్… ఊళ్లల్లో చాలావరకూ ఇరుగూపొరుగు నడుమ ఉచితంగా పంపిణీ కాబడే స్నేహపు దినుసు… పట్టణాల్లో కష్టంలే గానీ, ఊళ్లల్లో, ప్రత్యేకించి మారుమూల పల్లెల్లో ఇప్పటికీ అలా గుడిసెల మీదకు, ఇంటి కప్పుల మీదకు తీగెలు తీగెలుగా సాగి, పూలు పూసి, కాయలు కాసి, అందరికీ పంపిణీ కాబడుతుంది… నిజానికి పేదవాడి కూరగాయ ఇది…
ప్రపంచమంతా దొరికే ఏకైక కూరగాయ ఇది… వేల ఏళ్ల క్రితం నుంచీ ఉనికిని నిలబెట్టుకున్నది… అరెరె, కూరగాయ అనేస్తున్నాను గానీ… నిజానికి ఇది చాలా దేశాల్లో ఫలం కూడా..! ఈమధ్య జ్యూస్ చేసుకుని కూడా తాగేస్తున్నారు… ఒక్కసారి ఈ బాటిల్ గోర్డ్ సమాచారాన్ని సెర్చ్ చేస్తే మతిపోవడం ఖాయం… అంత ఫేమస్ ఇది… మనకు ఎంతసేపూ సొరకాయ అనగానే చీపుగా కనిపిస్తుంది గానీ, అత్యంత ‘‘విలువైనది’’… ఎవరైనా కోతలు కోస్తుంటే, కొయ్ కొయ్ సొరకాయ్ అని వెక్కిరిస్తాం… కానీ అత్యంత సులువుగా ప్రాసెస్ చేయబడే కూరగాయ కూడా ఇదే… త్వరగా ఉడుకుతుంది… పోషకాల కోణంలో చూస్తే… తక్కువ పిండిపదార్థాలు, ఎక్కువ నీటిశాతం, నో ఫ్యాట్, చాలా తక్కువ కేలరీలు… బీపీ పేషెంట్లకు బాగా ఉపయోగపడే విటమిన్ సి, పొటాషియం… ఇతర పోషకాలు… తేలికగా జీర్ణమవుతుంది…
Ads
అసలు సొరకాయ ముక్కల్లేని సాంబారును ఊహించగలమా..? అదొక్కటే కాదు, పాయసం, వడియాలు, హల్వా, పచ్చడి, తొక్కు, కూర… చివరకు పైన తొక్కును కూడా గీకేసి ‘కూరపొడి’ చేసుకుంటారు… జపాన్ వంటి కొన్ని దేశాల్లో ఒరుగుగా ఎండబెట్టుకుని, ఏడాదంతా వాడతారు… ష్, కొన్నిచోట్ల పులియబెట్టి మద్యం తయారు చేసుకుంటారు… పొగ తాగడానికి వాడతారు… అనేక ప్రాంతాల్లో వీటిని ఎండబెట్టి, డొల్ల చేసేసి, వాటర్ బాటిల్‌గా వాడటం కద్దు… (హిందీలో కద్దు అనే అంటారు)… ఇదొక కంటెయినర్… పేదవాడి గుడిసెలో ఈ డొల్ల పాత్రలే రకరకాల దినుసులను నిల్వ చేసేందుకు ఉపయోగపడతాయి… (చిన్నప్పుడు బాగా ఎండబెట్టిన పెద్ద సొరకాయను వీపుకు కట్టుకుని, ఈత నేర్చుకునేవాళ్లం గుర్తుందా..?) తూర్పు దేశాల్లో గృహాలంకరణకు వాడతారు…
అన్నట్టు… వాయిద్యాలుగా కూడా చాలాచోట్ల గుండ్రటి సొరకాయలు యూజ్ ఫుల్… మన వీణలకు ఒకప్పుడు వీటిని అమర్చేవారు… ఇన్ని ఏల..? ప్రపంచంలో ఏ కూరగాయ కూడా మనిషికి ఇంత దగ్గర కాలేదు… ఇన్నిరకాలుగా ఉపయోగపడలేదు… కొబ్బరి, తాటిచెట్లను కల్పవృక్షాలు అంటుంటాం కదా… సరదాగా దీన్ని కల్పకాయ అనాలేమో… చెప్పనేలేదు కదా… సన్నగా తురిమి సర్వపిండిలో వేస్తే ఆ టేస్టే అదుర్స్ కదా… లేత ముక్కల్ని, కాస్త ఉప్పేసి ఉడకబెట్టి, పైన కాసింత మిరియాల పొడి చల్లుకుని స్నాక్స్‌గా, మంచింగ్ మెటీరియల్‌గా కూడా వాడేస్తుంటారు… కాస్త ఆధారం, తేమ దొరికితే చాలు, వేగంగా పెరిగిపోయి, అల్లుకుపోయి, విస్తారంగా కాయల్ని అందించే సొరతీగెను మించిందేముందో ఇప్పుడు చెప్పండి…!?
Share this Article