Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ పాట చరణాల సొగసు చూడతరమా…? వేటూరి మేథోమథనం కథ..!!

April 7, 2025 by M S R

.
వేటూరి వారి అయిదో చరణం అనబడే ఓ సాహిత్య మథనం కథ…
.
మేం ‘మిస్టర్ పెళ్ళాం’ ఫీచర్ ఫిలిం తీస్తున్న రోజులు. అది 14, డిశెంబరు 1992, మార్గశిర సోమవారం, ప్రఖ్యాత గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారు అయ్యప్ప దీక్షలో, హైదరాబాదులో ఉన్నారు. నిర్మాణ సారధ్యం పూర్తిగా చేస్తున్న నేనేమో చెన్నైలో బాపుగారి దగ్గర వున్నా.

మా సినిమాలో, ఓ సందర్భంలో, హీరోయిన్ని ఆటపట్టిస్తూ, హీరో చిలిపిగా పొగిడే ఓ పాటని, త్యాగరాజ కృతి “నీ సొగసు చూడ తరమా ..” అనే పదాలను అనుపల్లవిగా పొదుగుతూ అందించడానికి ప్రయత్నించమని, ప్రముఖ గేయ రచయిత శ్రీ వేటూరి గారికి బాపూ గారు సూచించారు.

అలా అడిగిన మర్నాడే ఆ పాటకి అద్భుతమైన ఓ నాలుగు చరణాలను వేటూరి గారు మాకు అందించారు. ఐతే ఐదో చరణాన్ని మాత్రం మరో మూడు రోజుల్లో అందిస్తానన్నారు. కానీ అలా జరగలేదు. కానీ, అప్పటికే ఆ మొదటి నాలుగు చరణాలకి అద్వితీయ సంగీత దర్శకుడు శ్రీ యం.యం. కీరవాణి గారు మధురమైన ఓ ట్యూన్ కట్టేసి, రికార్డింగ్ కి సిద్ధమైపోయారు.

Ads

Dec-18 తారీకున A-VMG స్టూడియోలో రికార్డింగ్ కాల్షీట్ కూడా కంఫర్మ్ చేసేసాను. ఆ ఐదో చరణం మాత్రం ఇంకా అందకపోడంతో, నాకు కంగారు మొదలై హైదరాబాదుకి ఫోన్ చేసి, వేటూరి గారిని కాంటాక్ట్ చేస్తే, తాను అదే మధ్యాన్నం ఫ్లయిట్ లో వస్తున్నాననీ, 3 గంటలకల్లా, చెన్నైలో దిగిన వెంటనే, డైరెక్ట్ గా AVM-Gకి వచ్చి, స్వయంగా తన ఐదో చరణాన్ని నాకు అందించడం ఖాయమని భరోసా ఇచ్చేశారు.

వెంటనే బాపూ గారికి ఆ విషయం చెప్పేశాను. దాంతో ఆయన, అంతకు ముందనుకున్నట్టు కాల్షీటుని కాన్సిల్ చెయ్యకుండా రికార్డింగ్ స్టూడియోకి 2.30 pm కల్లా చేరుకున్నారు.

అప్పటికే మన బాలూ గారు అక్కడికి వచ్చేసి, పాట రిహార్సల్స్ లో మునిగిపోడం మాకు కనిపించింది. బాపూ గారు నావేపు చూసి, ఓసారి తన అరచేతిని నాకు చూపించారు. ఆ ఐదో చరణం సంగతేంటన్నది ఆయన ఉద్దేశమే ఐనా, అది నా చెంప ఛెళ్ళుమనిపించే ఓ లుక్ లా నాకనిపించి, బయటికి పారిపోయాను. మరో 20 నిమిషాల్లో, అయ్యప్ప దీక్ష దుస్తుల్లో వున్న వేటూరి గారు AVM_G కి చేరిపోయి నాకు ఓ టెన్షన్ తగ్గించి, మరో టెన్షన్లో పడేసారు.

తన ఐదో చరణాన్ని ఇంకా రాయలేదన్నారు. కాసేపట్లో రాసేసి, ఇచ్చేస్తానంటూ, ఆరు బయట వున్న సిమెంట్ సోఫాలో కూర్చొని, నన్ను తన పక్కనే కూర్చోమంటూ, రాయడం మొదలెట్టారు. ఒక్కసారి తానొచ్చిన సంగతి బాపు గారికి చెప్పొస్తానంటే, ముందుకాదని, సరేనన్నారు.

భయం భయంగా లోపలికెళ్ళిన నన్ను బాపూగారు ,”ఇప్పుడేంటీ కధా ?” అన్నట్టు చూడ్డంతో, “వేటూరి గారొచ్చేసి ఐదో చరణం రాస్తున్నా”రని చెప్పా. “ఈసారి చరణాన్ని పంపించండి.. చాలు !” అని తన ఫైల్ వేపు తల తిప్పుకున్నారు. మీకు తెలుసుగా… that is Bapu. ఐతే , ఆ ఐదో చరణం అంత సాధారణంగా పుట్టలేదు. దాదాపు ఓ చిన్న సైజు సాగర మథనం జరిగింది. అదెలాగంటే..

నేను బాపు గారిని కలిసి తిరిగి రాగానే వేటూరి గారు ఐదో చరణాన్ని రాసి, పక్కన పెట్టేసి, ఇంకేదో రాస్తూ కనబడ్డారు. చిన్న సైగతో ఆయన అనుమతి తీసుకొని, ఆయన పక్కన పడేసిన కాయితాన్నందుకొని, ఆ ఐదో చరణాన్ని చదివాను:

‘ఇల్లాలుగ అల్లాడిన ఆ రోజులలో, సఖికీ సుఖమే మిగిలిందిలే,
ఆఫీసుకి వెళ్ళొచ్చే ఈ రోజులలో, పతికీ బ్రతుకే తెలిసిందిలే,
చిగురాకులే సడి చేసినా, చిలకమ్మ వచ్చిందని,
ఎదతోడుగా ఎదురేగినా, నిదరొచ్చి వాలిందనీ,
త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి
సొగసు చూడ తరమా ‘

అది చదివిన నాకు, అమ్మో, అంతుందా! అనిపించింది. ఆనందం పట్టలేక ఒక్క గెంతేయాలనిపించింది. ఆ ఐదో చరణాన్ని తీసుకొని బాపూగారి దగ్గరికి లంఘించబోయాను. వెంటనే వేటూరి గారు నా చొక్కా పట్టుకొని వెనక్కిలాగి, నన్నక్కడే కూర్చోమన్నట్టు సైగచేసారు. అలా ఎందుకో నా కర్ఢం కాలేదు.

నేనలా కూర్చోగానే, నా చేతిలో వున్న కాయితాన్ని లాగేసి, నలిపేసి, ఉండచుట్టి వెనక్కి పడేసారు. తను ఫ్రెష్ గా రాసిన మరో వెర్షన్ నా చేతికిచ్చి, మళ్ళీ రాసుకోడంలో మునిగిపోయారు. ఆ రెండో వెర్షన్ ఎలా సాగిందంటే….

‘తెలి చీరల మరుమల్లెల ముస్తాబులలో, క్షణమే యుగమై గడిచేనులే,
కడకొంగున తలవాల్చిన నారీమణికి, కనులా కలలే మిగిలేనులే,
ఒకనాటి ఎడబాటులో, ఒరిగిందిలే వనితామణి,
వొడిదీపమే కొడిగట్టగా,కరిగింది కాంతామణీ..

“ఆహా, ఎంతద్భుతంగా వుందో – లోపలికి తీసుకెళ్ళనాండీ ?” అనడిగిన నావేపు చిరు కోపంతో చూసి, దాన్ని కూడా వెనక్కి లాక్కొని, ఉండ చుట్టి వెనక్కి పారేసారాయన. నాకేమీ అర్ధం కాలేదు.
ఓ చిర్నవ్వు నవ్వి, మళ్ళి రాయడంలో ఒదిగిపోయి, మరో వెర్షన్ మరింత అద్భుతంగా సృష్టించి నాకు చూపించారు. దాని తీరెట్లు కొనసాగిందనగా…

‘ కౌగిళ్ళకు కట్నాలుగ దాచిన పరువం, కన్నీటికి కరిగిందొక కాటుక రేఖై,
వస్తాడని ముస్తాబులు చేసిన అందం, ఈనాటికి
మిగిలిందొక రాలిన పూవై,
పసిగాలిలో పతి ఊసులే వినిపించె విధి ఆటలో,
కడకొంగునే పడకిల్లుగా గడిపింది ఎడబాటులో,
త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి
సొగసు చూడ తరమా…’

ఈ చరణం చూసిన నాకు, ఓ క్షణం గురువు గారి మనోవేదన పట్ల ధ్యాస పెరిగి, ఆలోచనలో పడ్డాను. ‘అసలీయన ఏం చెప్పదల్చుకున్నారు, ఎందుకిలా మథన పడుతున్నారు…’ అనుకుంటూ పైకి చూస్తుండగా, దాన్ని కూడా ఆయన వెనక్కి లాగేసి, ఉండచుట్టి వెనక్కి పడేశారు.
‘మరో వెర్షన్ రాస్తాను, అలా కూర్చో’ అన్నట్టు నాకు సైగ చేసారు.

అవతల, పాట రికార్డింగ్ మొదలైందని, బాపుగారు ఐదో చరణం కోసం ఎదురు చూస్తున్నారనీ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి రహస్యంగా నాకు చెప్పి వెళ్ళిపోయాడు. నా గుండెల్లో బాంబు పేలినట్టవడం వేటూరి వారు గమనించారు. అంతే, వెంటనే ఆయన స్పీడందుకొని, మరో కొత్త చరణం రాసి నా చేతిలో పెట్టేసారు. అదెలా నర్తించిందనగా…

‘రామలాలికి లేచిన పసిప్రాయం బరువై, రామపాదమే సోకని శిలకన్నా బరువై,
రాముడికోసం కన్నుల ప్రాణాలే కొలువై, రామచిలక ముక్కుపుడక ముద్దులు కరువై,
మల్లెపూలు నలుపన్నది మాపటి విరహం, వెన్నెలైన వేడన్నది మంచపు నరకం,
పతిరాకకు ఎదురుచూపు పడతుల పరువం, నిట్టూర్పుకు పుట్టినిల్లు కదలని నిమిషం,
త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి సొగసు చూడ తరమా…’

“ఇదెలా వుంది, నిర్మొహమాటంగా చెప్పండి !” అంటూ స్వామి దాదాపు నన్ను శాసించారు. నిజం చెప్పొద్దూ, నాకెందుకో కొంచెం ఎక్కువైందనిపించి, నోరుజారి, ఆ మాటే ఆయనతో అన్నా. అంతే, ఠక్కున ఆ కాయితం కూడా లాగేసి, నలిపేసి, వెనక్కి పారేసారు. తమ ఐదో వెర్షన్ కి శ్రీకారం చుట్టారు.

AMANI

అంతలో మా రమణ గారు స్టూడియోకి వచ్చి, కారు దిగి, మా దగ్గరికి రావడం, వేటూరి గారు తమ ఐదో చరణపు ఐదో వెర్షన్ ఆయనకి చూపడం, దాన్ని చూసిన రమణగారు ‘అత్యద్భుతం మహప్రభో !’ అంటూ ఓకే చెయ్యడం, నా మనసు కుదుటబడ్డం, అన్నీ ఒకే క్షణంలో జరిగిపోయాయి.
ఇపుడా ఐదో వెర్షన్ ఎలా మెరిసిందనగా….

“సిరిమల్లెలు హరినీలపు జడలో తురిమి, క్షణమే యుగమై, వేచీ వేచీ,
చలిపొంగులు చెలికోకల ముడిలో అదిమీ, అలసీ, సొలసీ, కన్నులువాచీ,
నిట్టూర్పుల, నిశిరాత్రిలో, నిదరోవు అందాలతో,
త్యాగరాజ కృతిలో సీతాకృతిగల ఇటువంటి నీ సొగసు చూడ తరమా !”

– అంతే, దాన్ని తీసుకొని వాళ్ళిద్దరూ లోపలికెళ్ళగానే, నేను కాసేపాగి, వెనక్కి పారేయబడ్డ కాయితం ఉండలన్నీ ఏరుకొని, కళ్ళకద్దుకొని దాచుకున్నాను. (అందువల్లే ఇవాళ ఈ మధురాను భూతిని మీతో పంచుకోడం సాధ్యపడింది.)

ఆ తర్వాత, మరో గంటలో శ్రీ బాలుగారి గళాన, ఖరహరప్రియ రాగంలో, మధురగాన సురభి శ్రీ యం.యం.కీరవాణి గారు స్వరపరచిన బాణీలో, ఆ ఐదో చరణం అత్యద్భుతంగా ప్రాణం పోసుకొంది. అది వింటుండగా నా కళ్ళవెంట జల జలా ఆనందాశ్రువులు రాలడం గమనించిన బాపూ గారు, నన్ను కౌగలించుకొని ఉపశమింపజేసారు. వారందరి సమక్షంలో శ్రీ వేటూరి స్వామికి పాదాభివందనం చేసాక గానీ నా ఆవేదన చల్లారలేదు.

ఓ సానబట్టిన వజ్రం లాంటి పాట పుట్టుక వెనక ఎంత మేథోమథనం జరుగుతుందో ఉటంకించడానికి, ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ దొరకడం అసాధ్యమేమో.
That is VETURI .
ఆయనకి రజత కమలం రావడంలో ఆశ్చర్యమేముంది. అంతటి మహానుభావుణ్ణీ మన తెలుగువాడిగా పొందగలగడం మనమంతా చేసుకున్న అరుదైన అమూల్య అదృష్టం. కాదనగలరా?

గీత గీస్తే ప్రాణం పోసినట్టుండాలి!
గీతం రాస్తే పువ్వు పూసినట్టుండాలి!
ఇది తిరుగు లేని సత్యం
ఇందుకు “వేటూరే” సాక్ష్యం!

వేదనల్ని నేలలో నాటితే
వెదురు పొదలై ప్రభవించాయి!
వెదురు పొదల్ని ఊపిరితో మీటితే
వేటూరి పాటలై ప్రవహించాయి!!

ఆయన అక్షర తూణీరంలో… ‘ఓంకార నాదానుసంధానమౌ గానా’లే కాదు
‘ఓలమ్మీ తిక్కరేగిందా’లూ ఉంటాయి!
‘రాలిపోయే పువ్వు’లే కాదు
‘రగులుతోంది మొగలిపొద’లూ ఉంటాయి!
‘ఆరేసుకోబోయి పారేసుకున్న’
అందం చందం ఊహకందాక
ఓహో ‘కందం’ అనుకున్నాం!

రాలుపూల రాగపరాగాన్ని
పాటగా మలచి, పాటను పక్షిని చేసి
వాగర్ధాల రెక్కలు తొడిగిన
వాఙ్మయ సిద్దార్థుడు ఆయన!!
తెలుగు నుడికారం అలంకారమై
పదపదాన మెరిసి ప్రేక్షకజన రంజకమై
ఆయన పాటల గుడికి ప్రాకారమైంది!

తెలుగు జాతీయం ఓంకారమై
ఆ కలాన ఒదిగి జాతీయపురస్కారమై
సినీ గేయ విజయానికి శ్రీకారం చుట్టింది!!
ప్రపంచ పర్యాటక స్థలాల్ని చూడడం టూరిజం!
ప్రపంచాన్ని పాటల్లో పట్టి చూపడం “వేటూరిజం”!!….. [[ Wtitten by శంకు… ]]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions