.
Subramanyam Dogiparthi…. ద్విపాత్రాభినయం సినిమాలను తీయటంలో మన భారతీయ సినిమాయే ముందు వరసలో ఉండటం మనకు గర్వకారణం . ప్రపంచంలోనే మొదటి ద్విపాత్రాభినయం సినిమాను డైరెక్ట్ చేసిన వారు దాదా సాహెబ్ ఫాల్కే .
సినిమా పేరు లంకా దహన్ . మూకీ సినిమా . 1917 లో వచ్చిన ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన నటుడి పేరు Anna Salunke. ఈ సినిమాలో ఆయన రాముడి పాత్ర , సీతమ్మ పాత్ర రెండింటినీ పోషించాడట. గొప్ప ఫీటే.అదీ 1917 లో.
Ads
తర్వాత దక్షిణ భారతంలో భానుమతి ద్విపాత్రాభినయం చేసిన చండీరాణి 1953 లో వచ్చింది . రాజూపేద సినిమా 1954 లో , ఏయన్నార్ నటించిన ఇద్దరు మిత్రులు 1961 లో , యన్టీఆర్ నటించిన రాముడు భీముడు 1964 లో వచ్చాయి . ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి .
అయితే ఒకరు మరుగుజ్జుగా , మరొకరు మామూలు వ్యక్తిగా నటించిన సినిమా ఈ విచిత్ర సోదరులు సినిమాయే . 1989 లో వచ్చిన ఈ సినిమాకు ప్రధాన సూత్రధారి కమల్ హాసనే . మొత్తం మూడు పాత్రలు ధరించిన ఆయన ఈ సినిమాకు స్క్రీన్ ప్లేని కూడా సమకూర్చారు .
పుష్పక్ వంటి ప్రయోగాత్మక సినిమాకు దర్శకత్వం వహించిన సింగీతం శ్రీనివాసరావే ఈ ప్రయోగాన్ని చేసారు . ఇప్పటిలాగా సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లోనే కెమెరా మేన్ శ్రీరాం గారి నైపుణ్యాన్ని , సింగీతం గారి దర్శకత్వాన్ని అభినందించాల్సిందే .
(చాన్నాళ్లు ఆ టెక్నిక్ ఎవరికీ అర్థం కాలేదు… ఇప్పుడంటే గ్రాఫిక్స్‌తో చేసేస్తారేమో కానీ అప్పట్లో విశేషమే… ఆ టెక్నిక్ కూడా సింగితం బయటపెట్టేశారు చాన్నాళ్ల తరువాత…) (ప్రయోగాలంటే సింగితం, కమలహాసన్ ఇద్దరూ ఇద్దరే)… (మన తెలుగు హీరోలకు ఇలాంటి ప్రయోగాలపై ఆసక్తి ఉండదు ఎందుకో మరి..)
కధ బీటెన్ ట్రాకే . రివెంజ్ కధ . నిజాయితీ కల ఇనస్పెక్టర్ చలపతిని దుష్టచతుష్టయం చంపేస్తారు . గర్భవతిగా అతని భార్య నోట్లో విషం పోయటంతో ఒక బిడ్డ మరుగుజ్జు గాను , మరో బిడ్డ మామూలు గాను పుడతారు .
ఒకరు తల్లి శ్రీవిద్య వద్ద , మరొకరు మనోరమ వద్ద పెరుగుతారు . మరుగుజ్జు జెమినీ సర్కస్ వారి వద్ద పెరిగి రింగ్ మాస్టర్ అవుతాడు . తన తండ్రిని చంపిన దుష్టులనందరినీ చంపేస్తాడు . ఇక్కడే సింగీతం , కమల్ హాసన్ల పనితనం కనిపిస్తుంది . మెకానికల్ ఫీట్సుతో , తెలివితేటలతో , మెయిన్ విలన్ని క్రూరంగా చంపటం వినూత్నంగా ఉంటుంది .
మొదటి మెప్పు కమల్ హాసనుకే . బ్రహ్మాండంగా నటించారు . ప్రేయసిగా గౌతమి , తల్లులుగా శ్రీవిద్య , మనోరమలు , సర్కస్ ఓనర్ కూతురిగా రూపిణి , అయోమయం ఇనస్పెక్టరుగా జనక్ రాజ్ , విలన్లుగా నగేష్ , జయశంకర్ తదితరులు నటించారు . జనక్ రాజ్ నటన ప్రేక్షకులకు హాస్యాన్ని అందిస్తుంది . కామెడీ పాత్రలకు చిరునామా అయిన నగేష్ విలనుగా బాగా నటించారు .
ఇళయరాజా సంగీతం , రాజశ్రీ పాటలు , బాలసుబ్రమణ్యం , చిత్ర , శైలజ గాత్రం డబ్బింగ్ సినిమా అని అనిపించదు . ముఖ్యంగా నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే పాట సూపర్ హిట్ . మిగిలిన వాటిల్లో రాజా చెయ్యి వేస్తే , బుజ్జి పెళ్ళికొడుకే రాజయోగంరా కమల్ హాసన్ గ్రూప్ డాన్సులు , వేడి వేడి ఆశలకే కమల్ , గౌతమి డ్యూయెట్ చాలా బాగుంటాయి .
సినిమాలో రాజశ్రీ డైలాగులు కూడా డబ్బింగ్ సినిమా అని అనిపించదు . తమిళంలో అపూర్వ సహోదరగళ్ , హిందీలో అప్పూ రాజా అనే టైటిల్సుతో రిలీజయి అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది . సినిమా యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ సినిమా . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక వాచ్ లిస్టులో పడేసేయండి .
నేను పరిచయం చేస్తున్న 1231 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్
Share this Article