.
Mohammed Rafee ….. 216 గంటల శాస్త్రీయ నృత్య మారథాన్
భరతనాట్యంలో విదుషి దీక్ష ప్రపంచరికార్డు
భరతనాట్యం అంటే తమిళనాడు! కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్! పేరిణి అంటే తెలంగాణ! యక్షగానం అంటే కర్ణాటక! కానీ, ఇప్పుడు భరతనాట్యం అంటే కర్ణాటక రాష్ట్రం వైపు చూసే రోజులు వచ్చాయి!
Ads
జూలై నెలలో కర్ణాటక మంగుళూరుకు చెందిన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని రెమోనా పెరీరా 170 గంటల పాటు భరత నాట్యం చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది! ఆ అమ్మాయి రికార్డును నెల రోజుల్లోనే తుడిచి పడేసింది కర్ణాటకకే చెందిన విదుషి దీక్ష!
బి.ఎడ్., కోర్సు చదువుతున్న విదుషి ఏకంగా 216 గంటలు అంటే తొమ్మిది రోజులు భరత నాట్యం చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది!
గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వారు ప్రపంచ రికార్డు సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఇప్పుడు ఈ రికార్డును విదుషి గిన్నిస్ బుక్ రికార్డులోకి ఎక్కించాలని ప్రయత్నిస్తోంది! ఇలాంటి నృత్య మారథాన్ లకు లేదా ఈవెంట్స్ కు గిన్నిస్ బుక్ నిబంధనల ప్రకారం గంటకు 5 నిముషాలు విరామం తీసుకోవచ్చు!
ఆ లెక్క ప్రకారం విదుషి ప్రతి మూడు గంటలకు 15 నిముషాల విరామం తీసుకున్నారు. అలాగే ప్రతి 8 గంటలకు డ్రెస్ చేంజ్, ఇతరత్రా అవసరాల కోసం గంట పాటు విరామం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 21వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన నృత్య మారథాన్ 30వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఘనంగా ముగిసింది!
(ప్రతి 8 గంటలకు గంట విరామం, ప్రతి గంటకు 5 నిముషాలు, తిండి, నిద్ర అంతా ఆ టైంలోనే, అంటే రోజుకు 5 గంటల సమయం విరామం)
విదుషి దీక్ష ఉడిపి జిల్లాలోని బ్రహ్మవర అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె వయసు 23 ఏళ్ళు! బియస్సి పూర్తి చేసి ప్రస్తుతం బి.ఎడ్., కోర్సు చేస్తున్నారు. భరత నాట్యంతో పాటు యక్షగానం, వీణ, మృదంగంలోనూ రాణిస్తున్నారు!
మంచి గాయని కూడా! రాహుల్ తో వివాహమైంది! తల్లి శుభ, తండ్రి విఠల్ పూజారి సహకారం నృత్య గురు విద్వాన్ శ్రీధర్ రావు ప్రోత్సాహంతో ఈ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అందరూ అనుకున్నట్లుగా తనకు స్ఫూర్తి 170 గంటలు నృత్యం చేసిన రెమోనా కాదని, మంగుళూరులో 24 గంటల పాటు బాలు పాటలు పాడిన యశ్వంత్ తనకు స్ఫూర్తి అని విదుషి తెలిపారు.
రత్న సంజీవ నృత్య కళామండలి ఆధ్వర్యంలో ఉడుపిలోని డాక్టర్ జి.శంకర మహిళా కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ నృత్య మారథాన్ ను మొదట పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు! మూడవ రోజు నుంచి ప్రేక్షకులు రావడం మొదలుపెట్టారు!
చివరకు జనంతో నిండిపోయింది కళాశాల ప్రాంగణం! ముగింపు ఉత్సవంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డికె శివకుమార్, మాజీ ఎమ్మెల్యే రఘుపతి భట్, పారిశ్రామికవేత్త మహేష్ ఠాకూర్ పాల్గొని విదుషిని ఘనంగా సత్కరించి అభినందించారు!
విదుషి దీక్ష పేరుకు తగ్గట్లుగానే దీక్షతో ఒక తపస్సులా నాట్యం చేశారు. మణిపూర్ నుంచి వచ్చిన రత్న సంజీవ నాట్యమండలి కళాకారులు వాయిద్య సహకారం అందించారు! కాళ్ళు బొబ్బలెక్కి గాయాలు అయినా ఆమె మొక్కవోని దీక్షతో మొండిగా కొనసాగించారు.
విరామ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ బ్యాండెజ్ లు వేసుకుంటూ, వైద్యులు వద్దని వారించినా వినకుండా తను అనుకున్న రికార్డును సాధించారు. అభినందనలు విదుషి! భవిష్యత్ లో విదుషిమణి కావాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు…. - డా. మహ్మద్ రఫీ
Share this Article