వెట్రిమారన్ సినిమాలు అంటే… అణగారిన వర్గాల గొంతుకలు… వివక్షకు వ్యతిరేక పతాకాలు… సోకాల్డ్ కమర్షియల్, మాస్, ఇమేజీ బిల్డప్పులు కాదు… కథను నమ్ముతాడు… టేకింగులో నేచురాలిటీని నమ్ముతాడు… డిఫరెంట్ క్రియేటర్… కానీ తాజాగా తను దర్శకత్వం వహించిన విడుదలై – పార్ట్ 1 లో మాత్రం కథ లేదు… పార్ట్-2 కథకు ఇంట్రడక్షన్ ఉంది… ఒక్కమాటలో చెప్పాలంటే రాబోయే రెండో భాగానికి ఓ పెద్ద ట్రెయిలర్‌ను థియేటర్లలో రిలీజ్ (విడుదలై) చేశాడు వెట్రిమారన్…
తను తమిళంలో లబ్ధిప్రతిష్టుడే… అన్ని సినిమాలూ హిట్సే… ఏ కమర్షియల్ అవలక్షణాలు లేకపోయినా సక్సెస్ అవుతున్నాయి… కథలో దమ్ముంటే, టేకింగులో సరుకుంటే వచ్చే ఫాయిదా అది… అయితే వాటిని నేరుగా డబ్ చేస్తే మాత్రం తెలుగు ప్రేక్షకులను కనెక్ట్ కాలేకపోతున్నయ్… ఎందుకు..? నేచురాలిటీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా జీర్ణం కాదా..? గుప్పున కొట్టే తమిళ నేటివిటీ అడ్డుపడుతోందా..? వెట్రిమారన్ సినిమాలు తమిళ జనాన్ని టార్గెట్ చేసేవే… వాళ్ల టేస్టుకూ మన టేస్టుకూ నడుమ ఏదో తేడా ఉంది…
పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళంలో సూపర్ హిట్… ఇతర భాషల్లో ఎవడికీ నచ్చలేదు… కొన్ని అంతే… విడుదలై సినిమా బాగా నడుస్తోందని అల్లు అరవింద్ తెలుగులోకి డబ్ చేసి విడుదలై చేశాడు… అది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవచ్చు… బ్రీఫ్‌గా, రఫ్‌గా చూద్దాం…
Ads
- తీవ్రవాదులకు మద్దతుగా ఉండే సినిమాలు తెలుగులో పెద్దగా క్లిక్ కావు, కాలేదు… విడుదలై సినిమాలోనూ తీవ్రవాదం పాలెక్కువ…
- సినిమాల్లో విపరీతమైన హింసను తెలుగు జనం నచ్చరు, మెచ్చరు… విడుదలై సినిమాలో పోలీస్ ఇంటరాగేషన్ సీన్లలో జుగుప్స ఎక్కువ…
- విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్ తెలుగువాళ్లకు పరిచయం… మిగతావాళ్లు తెలియదు… అసలు హీరోయే తెలుగు జనానికి పెద్దగా పరిచయం లేడు… సూరి తమిళంలో కమెడియన్… ఈ సినిమాలో ప్రధాన కథానాయకుడు తనే… బాగానే చేశాడు కానీ, మనకు ఎరుక లేని నటుడు…
- రీరికార్డింగ్ బాగానే ఉన్నా, పాటల్లో అరవతనం ఎక్కువ… పైగా ఇళయరాజా మంచి ట్యూన్లు గతించిన గతవైభవం మాత్రమే…
- ఎప్పుడో రాబోయే సెకండ్ పార్ట్ కోసం కథలోని కీలకమైన పాయింట్లన్నీ దాచిపెట్టేసి, ఈ ఫస్ట్ పార్ట్‌ను కేవలం ట్రెయిలర్‌గా మార్చేయడం…
- గౌతమ్ మేనన్ అనగానే పోలీస్ ఆఫీసర్ పాత్రలు గుర్తుకురావడం… ఇందులోనూ అదే… మొనాటనీ వచ్చేస్తోంది…
- మనకు పరిచయమున్న విజయ్ సేతుపతి పాత్ర మరీ మూడునాలుగు సీన్లకే పరిమితం…
- అస్సలు డ్రామా, ఘర్షణ, కథనంలో గ్రిప్ లేకపోవడం, మరీ నేచురాలిటీ ఎక్కువైపోవడం బోరింగ్…
ఈ సినిమాకు సంబంధించి ఇంకా కథ, ఇతర అంశాల లోతుల్లోకి వెళ్లి సమీక్షించడం కూడా అనవసరమే… ఏమో, పార్ట్-2 బాగుంటుందేమో, అది అర్థం కావాలంటే, ముందుగా ఈ ఉపోద్ఘాతం చూసి, మదిలో నిక్షిప్తం చేసుకోవాలి… అబ్బే, పార్ట్-2 కూడా అల్లు అరవిందే విడుదలై చేస్తాడు కదా… అప్పటికి అది మంచి టాక్ తెచ్చుకుంటే చూడొచ్చులే, ఈ పార్ట్-1 వీక్షణాన్ని ఓటీటీలో చేసుకోవచ్చులే అంటారా..? అంతే… కొన్నిసార్లు అలాగే రాజీపడాలేమో…
Share this Article