నిజానికి ఈ సినిమాకు రివ్యూ అనేది అనవసరం… అంత అప్రధానంగా ఉంది సినిమా… అయితే అలా అలా కాస్త కాస్త చూడబడ్డాను… ఒకటీరెండు అంశాలు చెప్పుకోవచ్చు… జీవిత బిడ్డ శివాని… ఈమె మాత్రమే సినిమాలో కాస్త చెప్పుకోదగిందిగా కనిపించింది… ఈమెకు మంచి పాత్రలు పడితే బాగా షైన్ అవుతుంది… జీవిత బిడ్డ కదా… నటవారసత్వం…
అందంగా చూపించబడింది… పోనీ, అందంగా కనిపించింది… సరే, అందంగా ఉంది… మొహంలో ఎమోషన్స్ బాగానే పలుకుతున్నాయి… ఫ్లెక్సిబుల్ ఫేస్… ఇక హీరోగారి పేరు రాహుల్ విజయ్ అట… కొత్తేమీ కాదు, తమిళ స్టంట్ మాస్టర్ కొడుకు అట… ఏడెనిమిది సినిమాలు చేశాడు… కానీ అంత సీన్ కనిపించలేదు… మొహంలో నిల్ ఎక్స్‌ప్రెషన్స్..,
మిగతా పాత్రల్లో మీసాల నారదుడిగా శ్రీనివాసరెడ్డి ఎందుకు కనిపించాడో తనకే తెలియాలి ఫాఫం… ఇక విష్ణువుగా అవసరాల శ్రీనివాస్ మరీ దారుణమైన లుక్కు… మిగతావాళ్లలో జస్ట్, ఒకటీరెండుసార్లు తనికెళ్ల భరణి తప్ప పెద్దగా తెలిసిన, పేరున్న నటీనటులెవరూ కనిపించలేదు… అసలు పాత్రల కేరక్టరైజేషనే కుదరలేదు…
Ads
పోనీ, పాటలు… అబ్బే, చెప్పుకోవడం అనవసరం… అదేమిటో గానీ ఓసారి గడియారంలో ముళ్లు తిరుగుతుంటాయి… కానీ పెండ్యులమ్ మాత్రం కదలదు… మరీ జీతెలుగువాడి త్రినయని సీరియల్‌లాగా శివానీ రాత్రి బెడ్ మీద కూడా ఖరీదైన చీరె కట్టుకుని పడుకుంటుంది… పైగా అత్యంత లిబరల్, మోడరన్ లేడీ పాత్ర… చెప్పుకుంటూ పోతే బోలెడు…
సరే, కథ మంచిదే… ముందుగా ఓ ప్రశ్నావళి ఇచ్చి, సంతృప్తికరమైన జవాబులు ఇచ్చిన వాడినే పెళ్లిచేసుకోవడం వరకూ కొత్తగానే ఉంది పాయింట్… కానీ చిన్న చిన్న ఇగోలు, విభేదాలు, పనికిరానివాడిగా చిత్రీకరించిన హీరో పాత్ర తరువాత చివరలో బుద్ధిమంతుడు, పనిమంతుడు అయిపోతాడు… సరే, సినిమా కథలోకి, కథనంలోకి మరీ అంతలోతుగా వెళ్లి మనస్సు ఖరాబు చేసుకోవడం దేనికిలే గానీ… మరో చిన్న సంగతి చెెప్పుకుని ఈ కథనానికి శుభం కార్డు వేద్దాం…
సినిమా పేరు ‘విద్యా వాసుల అహం… హీరోయిన్ పేరు విద్య, హీరో పేరు వాసు… వాళ్ల ఇగోల కథే కాబట్టి విద్యావాసుల అహం… మళ్లీ ఈ మూడు పదాల్లో నుంచి వి, వా, హం తీసుకుని సపరేట్ కలర్ పులిమితే అది వివాహం… గుడ్, పెళ్లి, తదనంతర సమస్యల కథ కాబట్టి, ఆప్ట్… వాళ్ల ఇంటికి నేమ్ ప్లేటు కనిపిస్తుంది… విద్యావాసుల గృహం… ఇందులోనూ వివాహం వస్తుంది… ఈమధ్య ఒక సినిమా టైటిల్ మీద ఇంత కసరత్తు చేయడం కనిపించలేదు… కానీ ఇదే ప్రయాస కథాకథనాల మీద పెట్టి ఉంటే మరింత బెటర్ ఔట్‌పుట్ వచ్చేదేమో…
పెళ్లి చూపుల్లో… ఆమె అతన్ని టెర్రేస్ మీదకు తీసుకెళ్లి సిగరెట్ డబ్బా ఇస్తే వద్దంటాడు, ఏం పొగ తాగరా అంటే, అది నా బ్రాండ్ కాదు అంటాడు… లిక్కర్ చిన్న సీసా ఇస్తే వద్దంటాడు, అదేమిటి మందు తాగరా అనడిగితే, మధ్యాహ్నం తాగడం అలవాటు లేదంటాడు… ఇలాంటి సీన్లలో రష్మిక, విజయ్ దేవరకొండ వంటి నటులు ఉండి ఉంటే నాసామిరంగా… సర్లెండి, ఎన్నెన్నో అనుకుంటాం…!! ఈ సినిమా ఆహా ఓటీటీలో ఉంది…
Share this Article