కొందరి జీవితకథల్ని వాళ్ల తదనంతరం ఎవరో రాస్తారు… కొందరు తామే రాయించుకుంటారు బతికి ఉన్నప్పుడే… ఇంకొందరైతైే తామే రాసుకుంటారు… సహజంగా ప్లస్ పాయింట్స్ హైలైట్ చేసుకుంటారు… మైనస్ పాయింట్స్ పరిహరిస్తారు… సహజమే… బయోపిక్స్ మాటేమిటి..? అవీ అంతే… కానీ బయోపిక్ తీయించుకోబడటానికి అర్హత ఏమిటి..?
మామూలుగానైతే భిన్నమైన రంగాల్లో అసాధారణ కృషి చేయడం, మంచి విజయాలు సాధించడం, లెజెండరీ స్టేటస్ పొందడం, సొసైటీలో మంచి పేరు గడించడం… స్పూర్తిదాయకంగా జీవితాలు గడపడం… ఇలాంటివే కదా… ఇందులో ముఖ్యమంత్రి కావడం అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది… ఈ ప్రశ్న ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా ప్రేక్షకుల్లో చర్చకు వచ్చింది… ఎందుకంటే..? మాజీ సీఎం సిద్ధరామయ్య మీద బయోపిక్ వస్తోంది…
వస్తే వచ్చింది, బయోపిక్ సినిమా కాదు, వెబ్ సీరీస్ తీసుకోనివ్వండి పర్లేదు… కానీ అందులో తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి నటిస్తుండటమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది… గాసిప్ కాదు, సిద్ధరామయ్యే ఈ వార్త నిజమని అంగీకరించాడు… కానీ నిజంగా ఓ బయోపిక్ తీసి, జనానికి ప్రదర్శించేంత ఆదర్శ జీవనమా తనది..? అంత దృశ్యము లేదు… తన రాజకీయ జీవితంలో మరకల సంగతి అటుంచి, మెరుపులు అయితే లేవు… ఐనా సీఎం, పీఎం కావడం పెద్ద ఇన్‌స్పిరేషన్ అయితే కాదు… కుమారస్వామి సీఎం అయ్యాడు, దేవెగౌడ పీఎం అయ్యాడు… సో వాట్..?
Ads
డీకే శివకుమార్, గాలి జనార్దన్‌రెడ్డి, యడ్యూరప్ప, కుమారస్వామి… వీళ్లేం తక్కువ సిద్ధరామయ్యకన్నా… డబ్బులు కూడా ఉన్నయ్… సరే, ఆ చర్చలోకి వద్దు గానీ… ఈ పాత్రకు విజయ్ సేతుపతి ఎలా అంగీకరించాడు..? నిజానికి పాత్రల ఎంపికలో సేతుపతి ప్రామాణికాలు ఏమిటి అనేది పెద్ద చిక్కు ప్రశ్న… ఇంకా ఎదగాల్సినవాడు, ఏది పడితే అది ఒప్పుకుంటున్నాడు… సిద్ధరామయ్య బయోపిక్ తన కెరీర్‌కు ఏరకంగా ఉపయోగకరం..?
ఒక దశ దాటాక కేవలం డబ్బు మాత్రమే ప్రధానం కాదు కదా… ఇమేజీ కాపాడుకోవడం కూడా ముఖ్యమే… విక్రమ్ వేధ, కరుప్పన్, సూపర్ డీలక్స్, మాస్టర్, విక్రమ్… తనవి లీడ్ రోల్స్ కావు… కానీ పేరొచ్చింది… అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా పాత్రల ఎంపిక ఉండాలనేది ప్రస్తుతం తమిళ, కన్నడ మీడియా, సోషల్ మీడియా హితవు చెబుతోంది…
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సిద్ధరామయ్యకు బలమైన ప్రత్యామ్నాయం డీకేశివకుమార్… తనే పీసీసీ అధ్యక్షుడు… కాంగ్రెస్ మూలాలు ఇప్పటికీ రాష్ట్రంలో బలంగా ఉన్నయ్… బీజేపీ మీద నెగెటివిటీ కూడా పెరుగుతోంది… ఈ స్థితిలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ తనే సీఎం రేసులో ముందుండాలనేది సిద్ధరామయ్య ఆకాంక్ష… దానికి వ్యక్తిగతంగా ఇమేజీ పెంచుకునే పనిలో పడ్డాడు…
ఉత్తర కర్నాటకకు చెందిన ఓ మాజీ మంత్రి, సిద్ధుకు వీరవిధేయుడు ఈ సినిమాకు నిర్మాత అంటున్నారు… సినిమా బడ్జెట్ 50 కోట్లట… అవునూ… బయోపిక్స్ వ్యక్తిగత ఇమేజీని పెంచుతాయా..? ప్రజలు ఆదరిస్తారా..? ఒక సెక్షన్ ఇప్పటికీ దేవుడిగా భావించే ఎన్టీయార్ మీద ఆయన కొడుకే రెండు సినిమాలు తీస్తే ఎవరూ పట్టించుకోలేదు… తెలుగుదేశానికి పొలిటికల్‌గా ఏమీ ఉపయోగపడలేదు… ఇది రియాలిటీ…!!
Share this Article