Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కదిలిందీ కరుణరథం… సాగిందీ క్షమాయుగం… అప్పట్లో పాన్- వరల్డ్ మూవీ…

October 12, 2024 by M S R

రాముడు , కృష్ణుడు అనగానే NTR ఎలా గుర్తుకొస్తారో అలాగే యేసుక్రీస్తు అనగానే విజయచందర్ గుర్తుకొస్తారు . 1978 క్రిస్టమస్ సందర్భంలో రిలీజయిన ఈ కరుణామయుడు సినిమా ద్వారా అంతటి పేరు ప్రఖ్యాతులను విజయచందర్ సంపాదించుకున్నారు . యేసుక్రీస్తు మీద వచ్చిన అన్ని సినిమాలలో కమనీయంగా తీయబడింది ఈ సినిమా . 14 భాషల్లోకి డబ్ చేయబడింది . విదేశాలలో ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో ప్రదర్శించబడింది .

యేసుక్రీస్తు పాత్రను వేయాలని మొదలుపెట్టిన వారు చివరిదాకా బతకరు అనే భయం ఉన్న రోజుల్లో ధృఢ సంకల్పంతో విజయచందర్ ఈ సినిమాను ప్రారంభించారు . సినిమా కష్టాలన్నీ పడ్డారు . 1974 లో మొదలుపెడితే 1978 క్రిస్టమసుకు విడుదల చేయకలిగారు . ఎలాంటి హడావుడి , హైప్ లేకుండా మొదలయిన ఈ సినిమా శంకరాభరణం సినిమాలాగా నోటి ప్రచారంతో బ్లాక్ బస్టరుగా నిలిచింది . ఈ సినిమాకు దర్శకుడు భీమ్ సింగ్ . ఆయన 1978 జనవరిలో సినిమా పూర్తి కాకముందే చనిపోయారు . క్రిస్టఫర్ కోలో అనే మరో దర్శకుడు సినిమాను పూర్తి చేసారు .

ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అలవాటయిన హిందూ పౌరాణిక సినిమాల్లాగా తీయడం అని నేను భావిస్తాను . ముఖ్యంగా పాటలు , పద్యాల వంటి వచనాలు హిందూ పౌరాణికాల్లాగా అనిపిస్తాయి . వీటన్నింటినీ మించి సినిమా చివరిలో యేసుక్రీస్తు శిలువ వేయబడే సీను అద్భుతంగా పండింది . సినిమా ఆఖరిలో ఉన్న ఈ శిలువ వేసే సీనుతో పూర్తయిన ఈ సినిమాను చూసి థియేటర్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కళ్ళు చెమ్మగిల్లే ఉంటాయి . అంతలా ఆ సీనుతో ప్రేక్షకుడు మమైకం అయ్యేలా చిత్రీకరించారు . సినిమా అఖండ విజయానికి గుండె కాయలాంటి ఈ సీనే కారణమని నేను నమ్ముతాను . కదిలింది కరుణ రధం పాట ఈరోజుకీ చాలా గొప్ప పాట . మోదుకురి జాన్సన్ వ్రాయగా బాల సుబ్రమణ్యం ఎంతో గొప్పగా పాడారు .

Ads

జోసెఫ్ పెర్నాండెజ్ , బి గోపాలం సంగీత దర్శకత్వాన్ని వహించారు . బాల సుబ్రమణ్యం , రామకృష్ణ , ఆనంద్ , సుశీలమ్మ , వాణీ జయరాంలు గాత్రాన్ని అందించారు . మోదుకురి జాన్సన్ డైలాగులను వ్రాసారు . సినిమా సక్సెస్ అయ్యే రాత ఉంటే అన్నీ ఇలాగే కలిసొస్తాయి . టైటిలే గొప్ప ఎంపిక . కరుణామయుడు అనే చక్కటి టైటిల్ని ఎంచుకున్నారు .

చంద్రమోహన్ పాత్ర పాడే దేవుడు లేడని అనకుండా , కదిలే మువ్వల సందడిలో , పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . టైటిల్సు పడేటప్పుడు వచ్చే పాట పరలోకమందున్న మా తండ్రి అనే పాట ప్రేక్షకులను సినిమాలోకి లాక్కొనిపోతుంది . భారీ హిందూ పౌరాణిక సినిమాల్లో ఎలా అయితే చాలా పాత్రలు ఉంటాయో అలాగే ఈ సినిమాలో కూడా చాలా పాత్రలు వస్తాయి . తెలుగు సినిమా రంగంలో నటీనటుల్లో చాలామంది ఈ సినిమాలో నటించారు . ఇంతమందిని విజయచందర్ ఎలా తీసుకుని రాగలిగాడు అనే సంశయం కూడా వస్తుంది .
జగ్గయ్య , ధూళిపాళ , చంద్రమోహన్ , గిరిబాబు , మిక్కిలినేని , త్యాగరాజు , పద్మనాభం , రాజనాల , సారధి , మాడా , కొమ్మినేని శేషగిరిరావు , ముక్కామల , రాజబాబు , మాదల రంగారావు , సురేఖ , వెన్నిరాడై నిర్మల , రాజసులోచన , హలం , కె విజయ , అనిత , సుమలత ప్రభృతులు నటించారు .

ఇంగ్లీషు సినిమా The King of Kings ఆధారంగా తీయబడింది . ఈ సినిమాకు ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డుని పొందింది . ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అవార్డు మోదుకురి జాన్సనుకు లభించింది . ఈ సినిమా ఎంత పాపులర్ అయిందంటే క్రిస్టమస్ నాడు ఏదో ఒక టివి చానల్లో తప్పకుండా వేస్తుంటారు . ఈ సినిమా తర్వాత విజయచందర్ దయామయుడులో సెయింట్ పాల్ గా నటించారు . DD నేషనల్ వారు నిర్మించిన హిందీ ధారావాహికలో యేసుక్రీస్తు పాత్రను మరలా పోషించారు .

యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ చిత్రం . కళకు మతం లేదు అని రుజువు చేసిన సినిమా . క్రైస్తవేతరులు కూడా చూసిన సినిమా . చూడనివారు తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ………. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions