‘‘రామోజీ… నేను సీబీఐ, ఈడీ, ఎఫ్బీఐ ఏ విచారణకైనా రెడీయే… చంద్రబాబు, నువ్వు సిద్ధమా..? తరువాత ఎవరు జైలుకు వెళ్తారో చూద్దాం… నీకు పోటీగా మీడియాలోకి వస్తున్నా, చూసుకుందాం’’ ఇదీ విజయసాయిరెడ్డి ప్రకటన… ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలో నంబర్ టు స్థాయి కీలకనేత నుంచి వచ్చిన ఈ ప్రకటన సహజంగానే ఆసక్తిని రేపుతోంది… పైగా రామోజీని సవాల్ చేయడం, ఇన్నేళ్లూ రామోజీ సామ్రాజ్యానికి ఆయువుపట్టుగా ఉన్న ఆ మీడియాలోకి వస్తాను, చూసుకుందాం అనడం జర్నలిస్ట్, పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిళ్లలోనే కాదు, ఇతర సర్కిళ్లలోనూ చర్చనీయాంశం అవుతోంది… (చంద్రబాబు, రామోజీరావుల మీద ఈ దేశంలో ఎవడూ విచారణ జరపడు… అది అసాధ్యం, వాళ్లిద్దరూ వాటికి అతీతులు… అది వేరే సంగతి…)
ఐనా గతంలోనైతే రామోజీరావును ఏమైనా అనాలంటేనే ఎవరికైనా వణుకు… ఆయనతో సత్సంబంధాల కోసం వెంపర్లాడిపోతుంటారు… అంత బలమైన పట్టు తనది… కానీ ఎప్పుడైతే ‘‘ఆ రెండు పత్రికలు’’ అని మొదలుపెట్టాడో అప్పటి నుంచీ స్టార్టయి, జగన్ తిట్లతో పెరిగి, ఇప్పుడు వైసీపీలో చోటా స్థాయి లీడర్లు కూడా తిట్టేస్తున్నారు… సవాళ్లు విసురుతున్నారు… సో, రామోజీరావుకు సవాల్ విసరడం వార్త కాదు… విజయసాయిరెడ్డి సవాల్ విసరడం వార్త… ఎందుకంటే..?
తను ఆల్ రెడీ ఒక తెలుగు న్యూస్ చానెల్ కొనేందుకు ప్రయత్నించాడు… మీడియాలోకి వచ్చే విషయంలో సీరియస్‌గానే ఉన్నాడు… కేవలం విశాఖలో తన ఆస్తులపై దుష్ప్రచార కథనాలు రాస్తున్నారనే కోపంతో… ఇప్పటికిప్పుడు తాత్కాలిక ఆవేశంలో పొలిటికల్‌గా, పర్సనల్‌గా రామోజీకి చేసిన సవాళ్లు కావు ఇవి… ఒకవైపు ఆదానీ వంటి ప్రపంచ కుబేరులే సొంత మీడియా కావాలని కోరుకుంటున్నారు… సొంత మీడియాకు ఉండే అడ్వాంటేజీలు బోలెడు… పొలిటికల్‌గానే కాదు, రకరకాల పెట్టుబడుల మళ్లింపుకు మంచి వేదిక మీడియా… సాక్షి, సన్ టీవీ వంటి మీడియా గ్రూపుల యవ్వారం, కేసులు తెలిసినవే కదా…
Ads
అయితే ఆదానీ ప్రింట్ మీడియాలోకి రాడు… ఇప్పుడు తెలివైన వ్యాపారవేత్త ఎవరూ ప్రింట్ మీడియాలోకి రాడు, ఉన్నవే మూసుకుంటున్న దశ ఇది… సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగాక, పత్రికల్లో చద్దివార్తల్ని ఎవడూ చదవడం లేదు… రాజకీయ అవసరాల కోసం పెట్టబడిన పత్రికల్ని ఆయా పార్టీల కేడరే చదవడం లేదు… పైగా ప్రింటింగ్ దగ్గర్నుంచి డెలివరీ దాకా నానా కష్టాలూ, ఖర్చులూ… చాలా శాటిలైట్ చానెళ్ల పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు… సో, రాబోయే రోజులన్నీ ఓటీటీ ప్లస్ డిజిటల్ రోజులు…
నో, నో, పొలిటికల్ అవసరాలు ప్లస్ కొన్ని ఆర్థిక ఇకమతులకు ఓ మీడియా వేదిక కావాలి అనుకుంటే మాత్రం ఒక టీవీ చానెల్ సరిపోతుందిగా… పత్రిక దేనికి..? నెత్తికొట్టుకోవడానికి తప్ప..!! సో, అది తెలివైన నిర్ణయం కాదు, బహుశా అది వర్కవుట్ కాదు… (అందుకే మీడియాలోకి వస్తున్నా, కాచుకో, ఇక చూసుకో అనే ప్రకటన చూసి రామోజీరావు పకపకా నవ్వుకుని ఉంటాడు అన్నది అందుకే…) (సాక్షి ఎడిటోరియల్ టీంలో గతంలో పనిచేసిన రాజశుక ఎడిటర్‌గా ఒక పత్రిక వస్తోంది… స్టాఫ్ రిక్రూట్‌మెంట్ జరుగుతోంది… ఆ పత్రిక ఎవరిదో సరైన వివరాలు తెలియడం లేదు… ఏమో, సాయిరెడ్డితో సంబంధం ఉండకపోవచ్చు కూడా…)
సాయిరెడ్డి స్వతహాగా చార్టెర్డ్ అకౌంటెంట్… జగన్ పెట్టుబడులు, ఆస్తులకు సంబంధించి అనేకానేక లెక్కలు, యవ్వారాల వెనుక సాయిరెడ్డే కీలకం… జగన్ కేసులో ప్రధాన నిందితుల్లో తను కూడా ఉన్నాడు… తను మాటల మనిషి కాదు, చేతల మనిషి… కేంద్రంలోని పెద్దలతో సత్సంబంధాలున్నయ్… మంచి ఆర్గనైజర్… ఇప్పుడిక సాక్షికి దీటైన మీడియాను కూడా తను నిర్మించుకుంటే, తనకు సమాంతరంగా, బలంగా ఎదగడాన్ని జగన్ సహిస్తాడా అనేది మరో చిక్కు ప్రశ్న… రాజకీయాల్లో శాశ్వత విధేయతలు ఉండవు కదా…!!
Share this Article