నిజమో, అబద్ధమో… కల్పనో, గాలివంటకమో… ఏదయితేనేం… మాంచి మసాలా వంటకంగా మార్చి, బాగా గార్నిష్ చేసి వడ్డించగలదు ఆంధ్రజ్యోతి… ప్రత్యేకించి రాజకీయవార్తలు..! ఈరోజు ఫస్ట్ పేజీలో వచ్చిన వార్త ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఒకింత చర్చ జరిగేదే… ఏమిటంటే..? ‘‘ఆదానీ భార్య ప్రీతికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నాడని… విజయసాయికి మరోసారి చాన్స్ ఇస్తాడని… రేసులో ఆలీ ఉన్నాడని… రేసులో బొత్స, సజ్జల, వైవీ కూడా ఉన్నారని… కానీ..?
జగన్ ఆలోచనల్ని అందుకోవడం ఆ పార్టీ పెద్దలకే కాదు, తలలు పండిన పాత్రికేయులకూ సాధ్యం కాదు… జగన్ లెక్కలు వేరు… తన చుట్టూ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఓసారి అంచనా వేసుకోవడమే తప్ప… ఆంధ్రజ్యోతి ఊహాగానంలో చాలా లొసుగులున్నయ్… వైసీపీలో పారిశ్రామిక కోటా అని వెటకారం సరే గానీ… జగన్ అవసరాల రీత్యా తనకు అంబానీ, ఆదానీ కావాలి… ఆర్థిక సంబంధాలే కాదు, కేంద్రంతో సత్సంబంధాల దిశలో, ఢిల్లీ లాబీయింగు దిశలో తనకు అంబానీకన్నా నిజానికి ఆదానీయే ఫస్ట్ ప్రయారిటీ…
పైగా తను సీఎం కాకమునుపే ఆదానీతో దోస్తీ ఉంది… సో, ఆదానీ అడగాలే గానీ జగన్ ఒక్క క్షణం కూడా ఆలోచించడు… అయితే ఆదానీ తన భార్యకే అవకాశం ఇస్తాడా, తన ప్రతినిధిగా ఇంకెవరినైనా ‘పరిమళ్ నత్వానీ’ తరహాలో సజెస్ట్ చేస్తాడా వేచి చూడాలి… చాలా కోణాల్లో ఆలీకి రాజ్యసభ సభ్యత్వం రాకపోవచ్చు… జగన్ లెక్కల్లో తను ఫిట్ కాడు, కాకపోతే ఇంకేదైనా రాష్ట్ర స్థాయి పదవిని ఇస్తాడేమో…
Ads
విజయసాయికి మళ్లీ చాన్స్ ఉండకపోవచ్చునేమో… ఎందుకంటే..? ఈమధ్య విజయసాయికి జగన్ కత్తెర వేస్తున్నాడంటున్నారు… ఢిల్లీలో ఆయనకు బీజేపీ నాయకులతో జగన్ అవసరాలకు మించిన సంబంధాలు పెరుగుతున్నాయట… సో, తన కనుసన్నల్లోనే ఉంటే బెటర్ అని జగన్ గనుక అనుకునే పక్షంలో తనను ఎమ్మెల్సీని చేసి, గౌతమ్ రెడ్డి మరణం ద్వారా ఖాళీ అయిన పరిశ్రమల శాఖను అప్పగించే అవకాశాల్ని కూడా తోసిపుచ్చలేం… పైగా సేమ్ జిల్లా… సేమ్ కులం… ఆర్థిక, పారిశ్రామిక వ్యవహారాల్లో దిట్ట… ఇంకేం కావాలి..?
కుటుంబసభ్యుడే అయినా తనకు ఓ మంచి పదవి ఇవ్వలేదనే బదనాం తప్పించుకోవడానికి జగన్ వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ చాన్స్ ఇవ్వొచ్చు… వివేకా మర్డర్ కేసుకు సంబంధించిన ప్రచారంలో… జగన్ తన కుటుంబసభ్యులను కూడా పట్టించుకోడనీ, ఎంతసేపూ తన అవసరాలే తప్ప, వేరే ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వడనీ జనంలోకి వెళ్తోంది… దాన్ని బ్రేక్ చేయడానికి కూడా వైవీ ఎంపిక పనికొస్తుంది…
గౌతమ్రెడ్డిలాగే తనకు ఆంతరంగికుడైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా చేయొచ్చు… (విజయసాయిని రాష్ట్రానికి తెచ్చేస్తే ఆ పదవి ఖాళీ అవుతుంది కదా…) ప్రీతి సరే, వైవీ సరే… మరి సజ్జల..? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున ప్రస్తుతం ఎవరూ మాట్లాడేవాళ్లు లేరు… పార్టీ ఇతర నేతలు, మీడియా సలహాదారులు గట్రా ఫెయిల్… సజ్జల మాత్రమే ఆ బాధ్యతలను నిర్వరిస్తున్నాడు… సో, తనను ఢిల్లీకి పంపించడం గానీ, టీటీడీ అధ్యక్ష స్థానంలోకి పంపించడం గానీ జరగకపోవచ్చు…
కాకపోతే బీద మస్తాన్‌రావు వంటి బీసీ నేతల్లో ఒకరికి చాన్స్ దక్కొచ్చు… జగన్ రాజకీయ సమీకరణాల్లో బీసీలకు ఇంకాస్త ప్రాధాన్యం అవసరం… అలాగే ఎస్టీలకు జగన్ ఎమ్మెల్సీ పదవుల్లో గానీ, కార్పొరేషన్ పదవుల్లో గానీ పెద్దగా ఏమీ ఇవ్వలేకపోయాడు… అందుకని ఏ పుష్ప శ్రీవాణి భర్తనో (శత్రుచర్ల పరీక్షత్ రాజు) రాజ్యసభకు పంపిస్తే సరిపోతుందేమో… పైగా తన క్లాస్మేట్ అట… ఇలా అనేక సమీకరణాలతో ముడిపడి ఉన్నయ్ నాలుగు రాజ్యసభ స్థానాలు… జూన్‌లో ఖాళీ చేయబోతున్న చౌదరి, టీజీలకు బీజేపీ తరఫున ఈసారి చాన్స్ దక్కడం డౌట్ఫుల్… అలాగే సురేష్ ప్రభు సంగతి వేచిచూడాలిక..!!
Share this Article