ఓ వార్త… రేపు కాంగ్రెస్‌లోకి రాములమ్మ అనేది శీర్షిక… రాములమ్మ అంటే విజయశాంతి… రాజకీయ వార్తలు రాసేటప్పుడు అసలు పేర్లు రాస్తేనే వార్తకు ప్రాధాన్యం, సరైన తీరు అనిపించుకుంటుంది… సరే, నిజంగానే ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్తుందా..? కొట్టిపారేయలేం… అయ్యో, వద్దు మేడమ్, ప్లీజ్ అని ఆమెను కట్టిపడేసేవాళ్లు కూడా ఎవరూ లేరు… అనగా, అడిగేవాళ్లు కూడా లేరు… ఎందుకంటే..?
ఆమె రాజకీయ ప్రస్థానం ఎక్కడో మొదలైంది… ఎటెటో మలుపులు తిరిగింది… చివరకు కాంగ్రెస్ గూటిలోకి చేరుకుంటోంది… అన్ని నదులకూ చివరి మజిలీ కాంగ్రెస్ సముద్రమే కదా… ఎలా వచ్చినా, ఎవరొచ్చినా అది అక్కున చేర్చుకుంటుంది, ఒడిలోకి తీసుకుంటుంది… విశాల సముద్రం… ఎలాగూ బీజేపీ నుంచి అందరూ వలసబాట పట్టారు…
మొదటి నుంచీ పరిషత్, బీజేపీ యూత్ వింగ్‌ల నుంచి ఎదిగిన లీడర్లే ఎగిరిపోతున్నారు… ఇక వచ్చీపోయే వలస కేరక్టర్ల గురించి చెప్పుకోవడం దేనికి..? అది బీజేపీ దురవస్థ… వచ్చినవాళ్లను కాపాడుకోలేదు, కొత్తవారిని రప్పించుకోలేదు… అన్ని చోట్ల కాదు, తెలంగాణ బీజేపీ దురవస్థ ఇది… సరే, కేసీయార్ కోసం, ఏవో రాజకీయ రహస్య ప్రయోజనాల కోణంలో తెలంగాణ బీజేపీని చేజేతులా హైకమాండ్ దెబ్బతీస్తోందనే ప్రచారం ఉంది… కేసీయార్‌ను నమ్ముకుంటే చివరకు ఏమవుతుందో బీజేపీకి ఇంకా పూర్తిగా అవగతం కానట్టుంది… పిక్చర్ బహుత్ బాకీ హై…
Ads
విజయశాంతి విషయానికొస్తే… ఆమె నిజంగా బీజేపీలో ఉందా..? ఆమెకే సందేహం ఉండొచ్చు… సాధారణ తెలంగాణ ప్రజానీకానికి మాత్రం తెలియదు, లేదా గుర్తులేదు… అప్పట్లో బీజేపీలో ఉన్నప్పుడే బళ్లారిలో సోనియాగాంధీ మీద ఆమెను పోటీపెడతారు అన్నప్పుడు మాత్రమే కాస్త హల్‌చల్… అంతే, ఆ తరువాత ఎప్పుడూ విజయశాంతి రాజకీయ ప్రయాణం పెద్ద ఇంప్రెసివ్‌గా ఏమీ లేదు…
ఆమెతో బీజేపీకి వచ్చిన ప్రయోజనం కూడా ఏమీ లేదు… ఆమె చురుకైన రాజకీయ నాయకురాలు కాదు… దూకుడు లేదు… సరిగ్గా మాట్లాడలేదు… తను ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాదు… జానారెడ్డి, కేకేశవరావులు చాలా నయం… మరి కాంగ్రెస్‌కు ఏమొస్తుంది… లిటరల్‌గా చెప్పాలంటే ఆమెతో కాంగ్రెస్‌కు ప్రయోజనం ఏమీ లేదు… వస్తే కండువా కప్పి చేర్చుకుని, సరే, అలా నామ్‌కేవాస్తే అలా ఉండు అని చెప్పడమే…
ఆమెకు ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ ఏమీ లేదు… ఓ వెటరన్ సినిమా తార… అంతే… సో, ప్రచారానికి కూడా పెద్దగా ఉపయోగకరం కాదు… ఐనా ప్రచారంలో ఆమె చెప్పేది జనానికి అర్థం కావాలి కదా… ఏదో ప్రస్తుతం బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు అనే ట్రెండ్ నడుస్తోంది కదా… గొర్రెదాటు తత్వం, తనూ ఆ బాటే పట్టింది… వివేకా, రాజగోపాలరెడ్డి ఎట్సెట్రా వెళ్లిపోయారు, కొండా వంటి వాళ్ల నిర్ణయం తెలియదు… చేరాల్సిన పొంగులేటి, జూపల్లి తదితరులు బీజేపీలో సిట్యుయేషన్ చూసి కాంగ్రెస్‌కే జై అన్నారు…
ఈమె కూడా మూణ్నాలుగు రోజుల నుంచి ఏవో అయోమయం ట్వీట్లు కొడుతోంది… అఫ్‌కోర్స్, అవెవరికీ అర్థం కావు… కానీ ఈమె కూడా వలస బాటలోనే ఉందనే సందేహాలను కలిగించాయి అవి… వెళ్తే వెళ్లొచ్చు… బీజేపీకి ఏం నష్టం..? అందరూ వెళ్లిపోయినా సరే, ఆ కిషన్‌రెడ్డి, ఆ లక్ష్మణ్ ఖచ్చితంగా ఉంటారు… కేసీయార్‌తో సంధానకర్తలుగా కూడా వ్యవహరించగలరు… ఎవరికీ నచ్చకపోయినా సరే పవన్ కల్యాణ్ ఎదుట చేతులు కట్టుకుని నిలబడగలరు… ఏమో, రాజాసింగ్, బండి సంజయ్ వెళ్లిపోయినా సరే, జానేదేవ్… తెలంగాణ బీజేపీకి డోకా లేదు, అసలు ఆశలంటూ మిగిలితే కదా… అప్పట్లో తెలుగుదేశం కోసం, ఇప్పుడు బీఆర్ఎస్ కోసం… గొప్ప త్యాగశీలి తెలంగాణ బీజేపీ పార్టీ…!!
Share this Article