.
విజయశాంతి..! హఠాత్తుగా వార్తల్లోకి వచ్చింది… మండలిలో మాట్లాడింది, తన పార్టీనే తప్పుపట్టింది… అప్పుడు స్ఫురణకు వచ్చింది, అవును కదా, ఈమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంది కదా అని..! ఆమె ఉద్యమకారులకు న్యాయం, సాయం అని మాట్లాడుతుంటే… ఇంతకీ ఆమె ఏ పార్టీలో ఉందబ్బా అని కాసేపు సందేహాలు తలెత్తిన మాట కూడా నిజమే… (తల్లి తెలంగాణ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మళ్లీ కాంగ్రెస్… పార్టీలు మారుతూ ఉంటుంది కదా…)
నిజానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఆమె కంట్రిబ్యూషన్ ఎంత..? ఏమిటి..? ఏ కార్యక్రమంలోనైనా పాల్గొన్నదా..? ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా కనిపించిందా..? పార్టీకి ఆమెతో ఫాయిదా ఎంత..? అనే ప్రశ్నల్ని వదిలేస్తే… ఆమెకు ఉద్యమకారులు- తెలంగాణ అమరులకు నడుమ తేడా తెలియనట్టు అనిపించింది… ఆమె విమర్శో, సూచనో, విజ్ఞప్తో గానీ… ఏమంటున్నదంటే..?
Ads
‘‘అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైనే అయిపోయింది… ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తాం..? ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రాణాలకు తెగించి, కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ఇకనైనా… ఉద్యమకారులే లేకపోతే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులు ఉండేవాళ్లా..?
ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం, అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 25 వేల పెన్షన్ ఇస్తామన్నాం, ఏమైంది..? ఉద్యమకారులకు గుర్తింపు, పునరావాసం మరిచిపోయామా..? గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, ఇప్పుడేమో కమిటీ అంటున్నారు, అదీ కాలయాపన కాదా..?’’
ఇన్నేళ్లు తెలుగు సినిమాల్లో పనిచేసింది, ఆ తెలుగు కూడా సరిగ్గా పలకడం లేదు, ఆమె ఏం చెబుతుందో అర్థం చేసుకోవడానికి రెండుమూడుసార్లు వీడియో రీవైండ్ చేసుకుని చూడాల్సి వచ్చింది…
నిజంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమిటని ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు రిలీజ్ చేసిన యూత్ డిక్లరేషన్ వీడియో చూశాను… రేవంత్ రెడ్డి చెప్పింది ఏమిటంటే..? ‘తెలంగాణ అమరులకు పెన్షన్, ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం…, ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు’’
ఉద్యమకారులందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లకు అయిదేసి లక్షల సాయం, పెన్షన్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అని కాదు… కాదు… అసలు ఉద్యమకారుడంటే ఎవరు.,.? ఎవరు సర్టిఫై చేయాలి..? సకలజనుల సమ్మెలో జనమంతా తెలంగాణ కోసం ఉద్యమించినవాళ్లే కదా… కేసు నమోదై ఉండాలా..? మీడియాలో ఫోటో సహా పేర్లు నమోదై ఉండాలా..? ప్రజలు తామే తీసుకున్న ఫోటోలు ‘‘ఈ అర్హత’’లకు ఆధారాలుగా అంగీకరిస్తారా..? ఇదొక చిక్కుముడి…
మరొకటి అమరుల సంగతి… నిజంగా తెలంగాణ కోరుతూ ఆత్మార్పణ చేసుకున్నట్టుగా ఎవరు ధ్రువీకరించాలి..? ఇది మరో ప్రశ్న… ఈ వివరాలు, జాబితా ఇప్పటికీ సమగ్రంగా క్రోడీకరించలేదు… పాత ప్రభుత్వం కూడా ఆ పనిచేయలేదు… పే-ద్ద స్మారకభవనం కట్టింది తప్ప ఈ జాబితా ఖరారు చేసిందా..?
విజయశాంతి, ఏయ్, ఇంత లేటా.? ఇంకెప్పుడు..? అనడగ్గానే తెల్లారే జాబితాలు, జీవోలు, అర్హత ప్రామాణికాలు ఖరారైపోవు… అందుకే ఓ కమిటీ…! ఆ కమిటీ కూడా వేస్ట్ అంటుందామె… కాంగ్రెస్ పార్టీకి ఆమె ఖచ్చితంగా ఓ లయబులిటీ..!! అంటే… ఆస్తి కాదు, పెద్ద అప్పు..!!
Share this Article