Nancharaiah Merugumala….. ఇస్లాం విస్తరణలో కశ్మీరీ బ్రామ్మల పాత్రపై పాత థియరీని సినిమా ఫక్కీలో విజయేంద్ర ప్రసాద్ కొద్దిగా మార్చారు… బీజేపీ అంటే బ్రాహ్మణ జాతీయ పార్టీ కాదని నిరూపించే క్రమంలో గోదావరి హిందూ సాంస్కృతిక కమ్మ కుటుంబంలో పుట్టిన కోడూరి విశ్వ విజయేంద్ర ప్రసాద్ (80)ను రాజ్యసభకు నామినేట్ చేయించింది ప్రధాని నరేంద్ర మోదీ–హోం మంత్రి అమిత్ షా ద్వయం.
భారతీయులు, పాకిస్థానీయుల మధ్య సామరస్యాన్ని, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అనే నమ్మకాన్ని బలోపేతం చేసింది విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చిన హిందీ సినిమా బజరంగీ భాయిజాన్. రాజ్యసభ ఎంపీ అయ్యాక కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాన్ ఇండియా, పాన్ అమెరికా, గ్లోబల్ సినీ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి తండ్రి గారు ఇప్పుడు తెలుగు బ్రామ్మల ఆగ్రహానికి కారకులయ్యారు.
కశ్మీర్ లో ఇస్లాం మతవ్యాప్తికి అక్కడి బ్రాహ్మణులు కారణమనే అనేక సిద్ధాంతాలు ఇప్పటికే విస్తృతంగా వ్యాప్తిలో ఉన్నాయి. మొదట బౌద్ధంలోకి మారిన హిందువులను మళ్లీ వెనక్కి వచ్చి హిందువులుగా జీవించడానికి కశ్మీరీ బ్రాహ్మణులు అనుమతివ్వలేదట. దాంతో ఈ అమాయక పూర్వ హిందువులు ఇస్లాంలోకి వెళ్లిపోయారని చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విజయేంద్ర ప్రసాద్ గారు కశ్మీరీ బ్రాహ్మణులకు సంబంధించిన పాత వివాదంలోకి మొల లోతున దిగారు.
Ads
తెలుగు బ్రాహ్మణ సమాజం ఇంకా ఆగ్రహిస్తే ఆయన మెడ లోతు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. పోనీ విజయేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా పూర్తిగా కొత్త విషయం చెప్పారా? అంటే అదీ లేదు. పాత ప్రచారాలే. బ్రాహ్మణులు ఆది దేవుడు శివుడిని పూజిస్తూ మేక, గొర్రె మాంసం తినే కశ్మీరంలో (ఒక్క మంగళవారం మటన్ తినడం పూర్తిగా నిషిద్ధం) ఇస్లాం వ్యాప్తికి ప్రత్యక్షంగా తోడ్పడ్డారనేది పాత అపవాదు.
కశ్మీర్ ప్రాంతంలో వందలాది ఏళ్ల క్రితం ముస్లింలతో సంపర్కం, ఆవు మాంసం అనే విషయాలతో కశ్మీరీ బ్రాహ్మణులు ఇస్లాం వ్యాప్తికి పరోక్షంగా సాయపడ్డారనేది కోడూరి విశ్వ విజయేంద్రుడి కొత్త థియరీ. దీంతో పాత కృష్ణా– గుంటూరు, గోదావరి జిల్లాల సద్బ్రాహ్మణులు ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఈ మాత్రానికే– గోదావరి, కృష్ణా నదుల తీరాల్లో నామినేటెడ్ ఎంపీ విజయేంద్ర ప్రసాదు గారికి బతికి ఉండగానే ఈ బ్రాహ్మణులు పిండాలు పెట్టేస్తున్నారనే పుకార్లు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఇప్పటికే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐవైఆర్ కృష్ణారావు గారు వంటి సద్బ్రాహ్మణ ఐఏఎస్ అధికారులు, ఇతర బ్రాహ్మణ బుద్ధిజీవుల శాపాలు పనిచేసి అత్యంత ఆధునిక హైటెక్ కమ్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 40 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ఫలితంగా ఏపీలో కమ్మల వెలుగు పలచనవుతోంది. కేవలం వ్యాపార, సినిమా రంగాలకే కమ్మ విశాల జనసామాన్యం పరిమితమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కొత్తగా పార్లమెంటు ఎగువసభలోకి కేవలం ‘నామినేషన్’ ద్వారా అడుగుబెట్టిన విజయేంద్ర ప్రసాద్ ఏదో నోరు జారి కశ్మీరీ బ్రాహ్మణులపై వ్యాఖ్యానించారు. కృష్ణా నదికి సమీపంలో పుట్టిన గొప్ప హేతువాది, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బాటలో కాకుండా విజయేంద్ర ప్రసాదు గారు కొత్త దారి అనుకుని, వివాదాస్పదమైన ఆ పాత మార్గంలోకి అడుగుబెట్టారు…
Share this Article