Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లు అర్జున్ తొలి సినిమా ఇది… ఇక్కడే పడింది అసలైన పునాది…

August 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ..... ఎంత ఎదిగిపోయావయ్యా ! ఈ పాటవిజేత సినిమాలో చిరంజీవి ధరించిన చినబాబు పాత్ర మీద ఉంటుంది . కానీ చిరంజీవికే ఈ పాట బాగా వర్తిస్తుంది . ఢిష్యూ ఢిష్యూం సినిమాలలోనే కాదు ; శుభలేఖ , స్వయంకృషి , ఆపద్భాంధవుడు వంటి ఉదాత్త కుటుంబ కధా చిత్రాలలో కూడా గొప్పగా నటించే ఎత్తుకు ఎదిగిపోయాడని ఈ విజేత సినిమా మరోసారి రుజువు చేసింది .

1985 అక్టోబరులో వచ్చిన ఈ సినిమా 1981 లో బెంగాలీలో వచ్చిన సాహెబ్ సినిమాకు రీమేక్ . ఈ సినిమాకు ఏ పేరయితే బాగుంటుంది అని జ్యోతిచిత్ర మేగజైన్లో పాఠకుల అభిప్రాయ సేకరణ చేసారు . ఈ విజేత అనే పేరుని సెలెక్ట్ చేసుకున్నారు . ఈ పేరుని సజెస్ట్ చేసిన నిడదవోలు వాస్తవ్యురాలు బత్తుల నాగమణి , మంగళగిరి వాస్తవ్యులు ఉడతా రాధాకృష్ణ మూర్తి పేర్లను టైటిల్సులో కూడా వేసారు .

Ads

గీతా ఆర్ట్స్ బేనరుపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ మూడు నాలుగేళ్ళ వయసులో నటించాడు . బాల నటుడిగా అర్జున్ కి ఇది మొదటి సినిమా . అల్లు రామలింగయ్య కూడా నటించాడు . వారి కుటుంబ చిత్రం .

విజేత

సాధారణంగా ఫుట్ బాల్లో ఆట రానివాడిని గోల్ కీపరుగా పెట్టుకుంటారు . భావం ఏంటంటే ఊరక నిలబడటమే అతని పని అని . కానీ , ఆటను గెలిపించేది చాలాసార్లు గోల్ కీపరే . ఈ చిన్న బిట్ చుట్టూ ఉంటుంది ఈ సినిమా కధ .

ఓ నలుగురు అన్నదమ్ములు , ఇద్దరు అక్కాచెల్లెళ్ళు , ఇంటి పెద్దాయన ఉండే కుటుంబంలో ఆఖరి కొడుకు చిన్నబాబు ఫుట్ బాల్లో గోల్ కీపర్ . చదువు మీద శ్రధ్ధ ఉండనివాడు . ఇంట్లో ముగ్గురు అన్నలకి , ఇద్దరు వదినలకు చులకన . ఒక్క పెద్ద వదిన మాత్రం స్వంత కొడుకులాగా చూసుకుంటుంది .

ఇద్దరు అన్నలు ఫుల్ భార్యాభయస్తులు . చెల్లెలు పెళ్ళి కోసం ఇంటిని అమ్మేసి ఆ డబ్బుతో పెళ్ళి చేసి మిగిలిన డబ్బుని , తండ్రి పోషణను ముగ్గురూ సమానంగా పంచుకుందామని కుట్ర చేస్తుంటారు . ఆ సమయంలో తన కిడ్నీని ఓ ధనవంతుడి కొడుక్కి దానం చేసి ఆ డబ్బుతో చెల్లెలు పెళ్ళి జరిపిస్తాడు హీరో . కుటుంబ సభ్యులు అందరూ కృతజ్ఞత చూపటంతో సినిమా ముగుస్తుంది .

నటన పరంగా చిరంజీవి , శారద , సోమయాజులు అగ్ర వరుసలో నిలబడతారు . ముఖ్యంగా చిరంజీవి , శారద . వారిద్దరి మధ్య అనుబంధం తల్లీకొడుకుల అనుబంధంలాగా చాలా బాగా చూపారు . తర్వాత గ్లామర్ని పిండారపోసింది భానుప్రియ . చాలా చలాకీగా , అందంగా నటించింది . ఆ తర్వాత కనిపించేది కాసేపే అయినా సత్యనారాయణ నటన బాగుంటుంది .

ముగ్గురు అన్నలుగా రంగనాధ్ , నూతన్ ప్రసాద్ , గిరిబాబు , ముగ్గురు వదినలుగా శారద , కె విజయ , శ్రీలక్ష్మి , అక్కగా శుభ , చెల్లెలుగా సంయుక్త నటించారు . జంధ్యాల పదునైన సంభాషణలను వ్రాసారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలు శ్రావ్యంగా ఉంటాయి . సినిమా ఐకానిక్ సాంగ్ ఎంత ఎదిగి పోయావయ్యా . మిగిలిన పాటలన్నీ చిరంజీవి , భానుప్రియల మీద డ్యూయెట్లు .

vijetha

నా మీద నీ గాలి సల సల సోకిందమ్మా పాట ఈరోజు చూసినా చిరంజీవి ఫ్యాన్స్‌కు భలే కిక్కు.., అప్పట్లో భానుప్రియ ఓ మెరుపుతీగ, చిరంజీవి మూమెంట్స్‌కు తగిన జోడీ… ఖైదీ తరహా నృత్యరీతులతో కంపోజ్ చేసిన ‘నా మీద’ అనే ఈ పాటలో అసలు మేల్ వాయిస్ ఉండదు… ఓన్లీ జానకి వాయిస్…

చిక్కు చిక్కు చినదానికి , సిక్స్ వో క్లాక్ పాటలు చిరంజీవి మోడల్ డ్యూయెట్లు . జీవితమే ఒక పయనం యవ్వనమే ఒక పవనం పాట చిత్రీకరణ బస్ డ్రైవర్ , కండక్టర్లుగా వినూత్నంగా , వెరైటీగా ఉంటుంది . పాటల్ని బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మలు పాడారు . చక్రవర్తి బేక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉంటుంది ,

నిజానికి ఈ సినిమాలో పాటలే హైలైట్ అనుకోవాలి… భానుప్రియ, చిరంజీవిల కెమిస్ట్రీ అదుర్స్… ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డుని కూడా చిరంజీవికి తెచ్చింది ఈ సినిమా . 25 కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమా కోదండరామిరెడ్డి , చిరంజీవిలది సక్సెస్ కాంబినేషన్ అని మరోసారి రుజువు చేసింది .

vijetha

ప్రతీ సీనుని ప్రేక్షకుడు మరచిపోలేని విధంగా తీర్చిదిద్దాడు కోదండరామిరెడ్డి . హేట్సాఫ్ . తరచూ టివిలో వస్తూ ఉండే ఈ సినిమాని నేను ఎన్ని సార్లు చూసానో ! టివిలో వచ్చిన ప్రతిసారీ కాసేపయినా చూస్తూ ఉంటా . నాకు బాగా నచ్చిన సినిమా .

చక్కని కుటుంబ కధా చిత్రం . చిరంజీవి చిత్రం . బహుశా చూడనివారు ఎవరూ ఉండరు . ఒకరూ అరా ఉంటే చూసేయండి . చూడతగ్గ సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమాకబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టీపీసీసీ..! బండి సంజయ్ మీద అసందర్భ వ్యాఖ్యలతో పార్టీకే నష్టం..!!
  • ‘‘ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీకి వస్తా… నాకు ధైర్యం ఉంది…’’
  • సీన్ ఛేంజ్..! నాడు ఎంట్రీపై నిరసన… నేడు సీఎం హోదాలో ఘన స్వాగతం…
  • నో తుర్కియే, నో అజర్‌బైజాన్… ఇప్పుడిదే ట్రెండ్… ఎందుకంటే..?!
  • కంగాళీ వెన్నెల..! బాపు చేతులెత్తేశాడు… కెమెరా వీఎస్ఆర్ స్వామి ఫ్లాప్…!!
  • తెలంగాణ ప్రజల చెవుల్లో కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్యాబేజీ పూలు..!!
  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions