.
ఎవరూ పెద్దగా విశ్లేషణలకు పోవడం లేదు గానీ… ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది…
1) జనమంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాలు వెనక్కి తగ్గకతప్పదని చెప్పే తాజా ఉదాహరణ ఇది…
Ads
2) ఆ ఫ్యాక్టరీ వల్ల నాలుగైదు గ్రామాలు సఫరవుతాయి… అన్ని ఊళ్లూ ఏకమయ్యాయి… ఆడా మగా పిల్లా పీచూ అందరమూ కలిసి బైఠాయించారు…
3) పోలీసులపైకి రాళ్లు విసరడం, ఆర్డీవో సహా అధికారులను గంటల తరబడీ నిర్బంధించడాన్ని మనం సమర్థించలేం గానీ… ప్రజల్లో రగులుతున్న కోపానికి అది ఓ సూచిక…
(లగచర్లలో కలెక్టర్‌పై దాడి, దిలావర్‌పూర్‌లో ఆర్డీవో నిర్బంధం, పోలీసులపై దాడి వంటి సంఘటనలు సొసైటీలో నిర్బంధ భూసేకరణ, కాలుష్య కారక పరిశ్రమల పట్ల జనంలో పెరుగుతున్న అసహన తీవ్రతను సూచిస్తున్నాయి… కరెక్టు కాదు, కానీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్తే చూసీ చూసీ జనం ఎలా తిరగబడతారో ఇది తెలియజేస్తుంది…)
4) లగచర్లలో అంతగా జనవ్యతిరేకతను అణిచేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వం దిలావర్‌పూర్‌లో ఎందుకు తగ్గింది..? లగచర్ల అల్లర్ల వెనుక ప్రతిపక్షం ఎగదోస్తున్నదనే భావన కావచ్చు… అది ప్రభుత్వ భూసేకరణ పట్ల వ్యతిరేకత కాబట్టి… కఠినంగా వ్యవహరించి ఉంటుంది… అదీ కరెక్టు కాదు, పరిహారం విషయంలో చర్చించి, నచ్చజెప్పి ఉండాల్సింది…
కానీ ఈ ఇథనాల్ కథ వేరు… అది ప్రైవేటు ఫ్యాక్టరీ… భూసేకరణ కాదు, అది తమ గ్రామాలకు అరిష్ట కాలుష్య కారకమని జనం వ్యతిరేకత… లగచర్ల వేరు… ఈ ఇథనాల్ బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని కుటుంబానిది అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి… తన అల్లుడు, తన కొడుకు భాగస్వాములుగా ఉన్న పీఎంకే డిస్టిలేషన్స్ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ అట…
ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ కోసం… అదీ బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి సంబంధించిన ఫ్యాక్టరీ కోసం ప్రజావ్యతిరేకతను తను ఎందుకు ఫేస్ చేయాలనే భావనతో ప్రభుత్వం కూడా లైట్ తీసుకుని, తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే స్పష్టమైన ప్రకటన చేసి ఉంటుంది…
తరలిస్తే, వేరే గ్రామాల్లో కూడా ఇవే పునరావృతమవుతాయి కదా… సో, రద్దు చేయడమే పరిష్కారమేమో… లేదా జనావాసాలకు దూరంగా, అన్నిరకాల కాలుష్య నివారణ జాగ్రత్త చర్యల పరిమితులు పెట్టి అనుమతించడం బెటరేమో…
ఐతే, తమ కుటుంబానికి ఆ ఫ్యాక్టరీతో సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఖండించాడు… సరే, ఆ వివాదాలు, విమర్శలు, ఖండనల మాటెలా ఉన్నా, నిజానిజాల మాటెలా ఉన్నా, జనంలో కనిపించిన మూకుమ్మడి చైతన్యం ఖచ్చితంగా విశేషమే… ఆ తిరుగుబాటు వెనుక ఎవరున్నారు అని కాదు ప్రధానం… తమ ప్రయోజనాల రక్షణకు పల్లెలు తిరగబడి విజయం సాధించడమే అసలు విశేషం..!!
Share this Article