.
మనం చాలాసార్లు ఇడ్లీ విశిష్టత గురించి ముచ్చటించుకున్నాం కదా… అనుకోకుండా ఓ రీల్ తారసపడింది… పూణెలో ఓ స్ట్రీట్ వెండార్… ఇడ్లీలను నూనెలో (అదీ ఇంజన్ ఆయిల్‌లా కనిపిస్తోంది) గోలించి, వాటిని ముక్కలు చేసి, వాటిపై సాంబార్ వంటి ద్రావకాన్ని ఏదో పోసి, పైగా దానిపైనే చట్నీ వేసి ఇస్తున్నాడు…
మస్తు పాపులర్ అట… ఫుల్లు గిరాకీ అట… సరే, జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి… మా యాసీన్ అయితే సాంబార్, చట్నీ ఏదీ లేకుండా రా ఇడ్లీ తింటాడు అపురూపంగా ఆస్వాదిస్తూ… మెత్తటి వేడి ఇడ్లీని అలా తింటేనే దాని అసలు రుచిని, తాజాదనాన్ని, లాలిత్యాన్ని గౌరవించినట్టు అనీ అంటాడు… కొందరు సాంబారులో కసాపిసా పిసికేసి జుర్రుకుంటారు, ఏ చట్నీస్ బ్యాచో అయితే ఐదారు చట్నీలతో లాగిస్తారు…
Ads
చెన్నైలో ఒకాయన 2547 రకాల ఇడ్లీలు రకరకాల రంగలు, ముడి పదార్థాలు, డిజైన్లు, సైజులతో రికార్డు నెలకొల్పాడు… అందులో ఎన్ని తినబుల్ అనేది దయచేసి అడగొద్దు, అవి రికార్డుల కోసం మాత్రమే…
ఈమధ్య స్ట్రీట్ వెండార్స్ తవ్వ ఇడ్లీ అని చేస్తున్నారు.., ఏమీ లేదు… దోసెల వెడల్పాటి పెనంపైనే నాలుగు ఇడ్లీల ముక్కలు వేసి, ఏదో కెచప్ పోసి, కాస్త మసాలా చల్లి, అడిగితే నాలుగు ఉల్లిపాయ ముక్కలు కూడా తగిలించి, వాటిని కాసేపు కిందా మీదా పడేసి ఇస్తున్నారు… దానికి ఇడ్లీ అనే పేరు తీసేసి, మరేదైనా పెట్టడం సమంజసం…
పెళ్లిళ్లలో ఇప్పుడు చాట్ కంపల్సరీ అయిపోయింది కదా… అక్కడా ఈ తవ్వ ఇడ్లీని పెట్టేస్తున్నారు… నో సాంబార్, నో చట్నీస్… అసలు పొడి దట్టించి, నెయ్యి పోసి, ఏ ఆధరువూ లేకుండా ఇడ్లీని తింటే అదొక ఆనందం… కొందరైతే నిమ్మ, ఉసిరి ఊరగాయ ప్లస్ నెయ్యి కాంబినేషన్‌తో ఇళ్లల్లో తింటారు, హోటళ్లలో కుదరదు కదా…
నిజానికి మరీ ఇంత సుదీర్ఘ ఉపోద్ఘాతానికి అసలు కారణం శశిధరూర్… ఆమధ్య ఎవరో ఇడ్లీ మీద ఏదో నెగెటివ్ సోషల్ కామెంట్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఇడ్లీ ప్రియులు విరుచుకుపడ్డ వార్త మనం చెప్పుకున్నాం కదా… అలాగే మరొకాయన ఓ ట్వీట్ పెట్టాడు ఇడ్లీ మీద… ఆవిరిలో ఉడికించిన నిరాశ (రిగ్రెట్)…
దాన్ని మన ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ శశిధరూర్ చూశాడు… తను భోజన ప్రియుడు, సౌత్ ఇండియన్… అసలు ఇడ్లీని ప్రేమించని దక్షిణ భారతీయుడు ఎవరుంటారు..? వెంటనే తను రిప్లయ్ పెట్టాడు… తన స్టయిల్ తెలుసు కదా… తనదైన పదజాలంతో ఆయన ఇడ్లీని సమర్థిస్తూ చేసిన పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది…
‘పూర్ ఫెలో, తనకు సరైన ఇడ్లీ దొరికి ఉండదు, అందుకే ఆ టేస్ట్ తెలిసి ఉండదు… అరె, ఇడ్లీ అంటేనే గొప్పది అని అర్థం… అదొక మేఘం, అదొక లాలిత్యం, అంతెందుకు, మానవ నాగరికత పరిపూర్ణత చిహ్నం, ఒక సంపూర్ణమైన స్వప్నం’ అంటూ సాంబార్ బటన్ ఇడ్లీ తింటున్నంత పరవశంతో ట్వీటాడు…
అంతేకాదండోయ్… అది ఓ బీథోవెన్ సింఫనీ, రవీంద్రనాథ్ ఠాగూర్ సంగీతం, హుస్సేన్ పెయింటింగ్, సచిన్ టెండూల్కర్ సెంచరీ… అలాంటిదే ఇడ్లీ… దాన్ని రిగ్రెట్ అన్నాడంటే దాని రుచిని, ఆత్మను అర్థం చేసుకోకపోవడమే అని వివరించాడు… ఎఐ సాయంతో ఓ ఫోటో కూడా తగిలించాడు, తనే ఇడ్లీ వండుతున్నట్టు…
శశి థరూర్ పోస్ట్ ట్రెండింగ్‌లో పడగానే, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది… థరూర్ కవితాత్మకమైన పోస్ట్‌ను అభినందిస్తూ, స్విగ్గీ ఏకంగా ఆయన నివాసానికి వేడివేడి ఇడ్లీలను పంపించి సర్‌ప్రైజ్ చేసింది… స్విగ్గీ తమ డెలివరీ సిబ్బందితో కలిసి థరూర్ ఇడ్లీ ప్యాకెట్లు పట్టుకున్న ఫోటోను పంచుకుంది…
“శ్రీ థరూర్ జీకి ఈ ప్రాంతంలోని అత్యుత్తమ ఇడ్లీలను అందించే అవకాశం లభించడం మాకు అత్యంత సంతోషకరమైన విషయం..,” అని హిందీలో పోస్ట్ చేసింది… అది కూడా వైరలైంది..!!
Share this Article