.
ఒక దశ వస్తుంది… ఎనలేని కీర్తి, ఆదరణ, డబ్బు, సంపద, అన్ని వైభోగాలు, సుఖాల అనంతరం కొందరి ఆసక్తి, ప్రయాణం ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది…
క్రికెట్‌లో చాలామంది ప్లేయర్లకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు… వాళ్లందరూ విరాట్ కోహ్లీని అభిమానిస్తారు… చివరకు విదేశాల్లో, మన ప్లేయర్లను ద్వేషించే పాకిస్థాన్‌లో కూడా కోహ్లీ ఫ్యాన్స్… క్రికెట్‌కు సంబంధించి ఇంత ఫాలోయింగ్, ఫ్యాన్స్ ఉన్న ప్లేయర్ మరొకరు లేరేమో… ప్రత్యేకించి చేజింగులో తన దూకుడు, రికార్డులు కారణమేమో…
Ads
తను టీ20ల నుంచి కొన్నాళ్ల క్రితం… నిన్న టెస్ట్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు… వన్‌డే కెరీర్ కూడా కొన్నాళ్లే… బహుశా వచ్చే వరల్డ్ కప్ వరకు మాత్రమేనేమో… ఇప్పుడిక తన దృష్టి క్రికెట్ రికార్డుల మీద లేదు… మారుతున్నాడు…
ప్రఖ్యాత బాలీవుడ్ తార, తన భార్య అనుష్క శర్మ ప్రభావం కోహ్లీ మీద బాగా ఉంది… తాజాగా కోహ్లీ, అనుష్క కలిసి ఉత్తరప్రదేశ్, బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లారు… ఈ ఫోటో అదే…
తను బృందావనంలోని నీమ్ కరోలి బాబా ఆశ్రమంలో కూడా కనిపించాడు… బృందావనంలోని ప్రేమానంద మహారాజ్ ఆశ్రమానికి పలుసార్లు వెళ్లాడు… టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించగానే మళ్లీ వెళ్లాడు… తన జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అనంతరం అక్కడ ప్రత్యక్షమవుతాడు… ఆ యోగి మీద తనకున్న నమ్మకం అది…
ఇవే కాదు, కొన్నాళ్లుగా తను పలు ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించాడు… ఈ సందర్శనలు, బోధనలు, ఆశీస్సులతో క్రికెట్ మైదానంలో కూడా కోహ్లీ ధోరణిలో మార్పు కనిపించసాగింది… పాత దూకుడు స్థానంలో బ్యాలెన్స్‌డ్ బిహేవియర్ కనిపిస్తోందని అంటారు విశ్లేషకులు…
కోహ్లీ, అనుష్కలు తరచూ వెళ్లే ఆధ్యాత్మిక కేంద్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయం… తన జీవితం ఇన్నేళ్లూ క్రికెట్ క్రికెట్ క్రికెట్… ఎప్పుడైతే అనుష్క తన జీవితంలోకి వచ్చిందో తన వ్యక్తిగత వృద్ధి, కుటుంబం, వ్యక్తిగత శ్రేయస్సు వంటి అంశాలపై ధ్యాస పెరిగింది తనకు…
అనుష్క శర్మ తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఇండియన్ మిలిటరీ ఆఫీసర్… పెద్దన్నయ్య కరణేష్ మర్చంట్ నేవీలో పనిచేస్తాడు… తమది ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి కలిగిన కుటుంబం… ఆ ప్రభావం అనుష్క మీద కూడా ఉంది… అది తన భర్తకూ సంక్రమించింది…
కోహ్లీ కృష్ణ దాస్ కీర్తన సెషన్లకు హాజరవుతుంటాడు తరచూ.., పిల్లలు పుట్టాక మరీ తన సెలబ్రిటీ జీవితాన్ని ఆధ్యాత్మిక భక్తితో మిళితం చేసుకుంటూ కనిపిస్తున్నాడు… తనకు నమ్మకాలు కూడా ఎక్కువే… కోహ్లీ తరచూ సిఫారసు చేసే పుస్తకం… ఒక యోగి ఆత్మకథ… ప్రైవసీ కోసం, పిల్లల కోసం లండన్‌కు మకాం మారుస్తాడనే వార్తలు కనిపించాయి ఈమధ్య..!
Share this Article