ఎవ్వడూ ఏమీ మాట్లాడడు ఇప్పుడు… బలగం సినిమాలో పిట్ట ముట్టుడు అంశం మీద చాలామంది నోళ్లు పారేసుకున్నారు… ఆ సినిమా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తోందని తెగ కన్నీళ్లు కార్చేశారు… మరి ఇప్పుడు విరూపాక్ష మాటేమిటి..? మొత్తం క్షుద్ర శక్తులు, పూజలు, మంత్రాలు ఎట్సెట్రా… బలగం సినిమాను చీల్చి చెండాడిన కలాలు ఇప్పుడు విరూపాక్షుడిని ఏమంటాయో చూడాల్సి ఉంది… బలగం సినిమాకు ఒక న్యాయం, విరూపాక్షకు మరో న్యాయం ఉండకూడదు కదా…
బలగం తెలంగాణ పల్లెకు చెందిన ఓ మట్టివాసన కథ… తెలంగాణ నిర్మాత, తెలంగాణ దర్శకుడు, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ పాట, తెలంగాణ మాట… సో, రెచ్చిపోయారు… మరి విరూపాక్ష అలా కాదు కదా… సో, ఇప్పటివరకూ అలాంటి రివ్యూ మీడియాలో లేదు, సోషల్ మీడియాలో లేదు… కళ్లకు పట్టిన ప్రాంతీయ పక్షవాతం అన్నమాట… ఎందుకీ ద్వంద్వ నీతి… ఈరోజుకూ అలా ఆధిపత్య భావనలు కొనసాగుతున్నాయి గనుకా..? సరే, ఈ వివక్షను పక్కన పెడితే… మిత్రుడు Murthy Kanakala ఫేస్ బుక్ వాల్ మీద రాసిన ఓ సమీక్ష శాస్త్రీయకోణంలో, చాలా ఆసక్తికరంగా ఉంది… ఒక్కసారి అది యథాతథంగా చదవండి…
సినిమా మొత్తం 1991 లో ఓ మారుమూల పల్లెలో జరిగే కధ. మంచి థ్రిల్లర్. BGM అయితే సూపర్బ్. మ్యూజిక్ చాలా సేపు హాంట్ చేయక మానదు. సినిమాటోగ్రాఫీ చాలా బావుంది. సాయి ధరమ్ తేజ్ కన్నా హీరోయిన్ సంయుక్త మీనన్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.
Ads
ఇక సినిమాలో చూసిన అంశాలు లో చాలా వరకూ మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండి, వాటి మీదే ఆధారపడి సినిమా కధ నడిచింది. ఇది సుకుమార్ “రచన”… తూర్పు గోదావరి జిల్లా పల్లెటూర్లలో ఉండే దెయ్యం ఈ కధలో “లాక్ డౌన్” ఇంట్లోనే ఉండిపోయిన రచయితను ఆవహించి, తనకి నచ్చినట్టు “కిచిడి” చేయించి, మనకు వడ్డించింది. అయితే ఈ మూఢనమ్మకాలు అన్నీ “జబ్బులు” అని నమ్మే ‘భూత’ (వర్తమాన, భవిష్యత్తు కూడా ) “వైద్యున్ని” కనుక ఈ కధలో దూరిన రుగ్మతల్ని నా స్టెతస్కోప్ తో వినిపిస్తా. వీలుంటే వినండి.
#Spoilers Ahead
1. బర్ద్ ఫ్లూ/ ఏవియన్ ఫ్లూ : పక్షులకు సోకిన ఈ వైరస్, అసలు వైరస్ అన్నిటికి మెగాస్టార్. ఇది ముఖ్యంగా పక్షుల నుండి మనుషులకు, జంతువులకు సోకి వంటి నిండా దద్దుర్లు, జ్వరం, కళ్ళు ఎరుపెక్కడం, గొంతు నొప్పి, మాట మారడం, అయోమయం, కొన్నిసార్లు ఫిట్స్ వంటి లక్షణాలు చూపిస్తాయి. H1N1 తో మొదలై అనేకసార్లు రూపాంతరం చెంది, ఇప్పుడు లేటెస్ట్ గా H3N2 అనే వెర్షన్ “అందుబాటు”లో ఉంది. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, మొదట ఈ ఊరిలో మనిషికి ఈ “వింత” రోగం సోకిన రైతు రాత్రి సమయంలో కాకి చేత దాడి చేయబడతాడు. ఊరు మొత్తం సోకేలా చేస్తాడు (కరోనాలాగా). “ఐ” కాంటాక్ట్ ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుంది. (ఈ మధ్యన ఈ కళ్ళ కలక కేసులు చాలా చూస్తునాను opd లో. H3N2 వైరస్ కమ్యూనిటీలో ఉంది, జాగర్త వహించండి. కరోనా నిబంధనలు పాటించండి)
2. లాక్ డౌన్ : వైరస్ సోకిన ఊరు నుండి ఎవ్వరు బయటకి పోకూడదు. లోపలికి రాకూడదు. లాక్ డౌన్. దీనికి పోయి పొలిమేర మొత్తం నువ్వులు జల్లాల్సిన అవసరసం లేదు. బై ద వే నువ్వులు నూనెకు, చెక్కకు తప్ప మారేందుకు పనికిరాదు. వైరస్ కు అంతకన్నా పనికిరాదు.
3. చెవిలో గుయ్ మనే శబ్దం : కర్ణభేరి రంధ్రం పడి, దానికి సరైన సమయంలో ఆపరేషన్ చేయించుకోకపొతే రెండు చెవుల్లో అలానే శబ్దం వస్తుంది. అది ముదిరి బ్రెయిన్ బేస్ కి ఇన్ఫెక్షన్ చేరితే కొన్ని సందర్భాలలో చెవిలో సూది పెట్టి పొడుచేసుకోవాలనే ఆలోచనలు కూడా రావొచ్చు (మెనింజైటిస్). బ్యాక్టీరియా/ నిర్లక్యం… ఇన్ఫెక్షన్, చేతబడి కన్నా భయంకరమైన కిల్లర్.
4. పశువులకు కూడా బర్ద్ ఫ్లూ సోకుతుంది. “మెస్టైటిస్” అనే జబ్బుతో రొమ్ములో నుండి పాల బదులు రక్తం కూడా వస్తాది.
5. ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో తాళం పెట్టడంతో ఫిట్స్ తగ్గవు. వీలైతే నాలుక కొరుక్కోకుండా గుడ్డ ఏమైనా పంటి మధ్యలో ఉంచితే నాలుక కొరుక్కోకుండా ఉంటారు.
6. చేతబడులు చేయడం వలన ముగ్గు, నిమ్మకాయలు వేస్ట్ తప్ప ఒరిగేది ఏమి లేదు. అసలే ఎండలు మండిపోతున్నాయి నిమ్మరసం తీసుకుని తాగితే అటువంటి “పాడు ఆలోచనలు” రావు. ఇక ఒక మనిషి జుట్టు, బట్ట ఉంటే, ఎలాగైనా ఆ మనిషిని కంట్రోల్ లో తెచ్చుకోవచ్చు అనేది భ్రమ. కావాలంటే నామీద చేసి చూడండి. నా జుట్టు, బట్ట ముక్క ఇస్తాను. అక్కర్లేదు నా జట్టు తెగ రాలిపోతుంది, కావాల్సినంత ఏరుకొండి.
7. ఇక చివరగా మాస్ హిస్టీరియా : ఒక కుటుంబం మొత్తం ఒక మానసిక వికలాంగుడి మాట నమ్మి ఉరి వేసుకున్నారు. మరో ఫామిలీ మొత్తం చనిపోయాక బ్రతికిస్తా అని సొంత పిల్లలనే తల పగలకొట్టి చంపారు. 2023 వచ్చినా రాతి యుగం నాటి భయాలు పోలేదు. సైన్స్ మీద నమ్మకం లేదు. మరణం మీద గౌరవం లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చనిపోవచ్చు అనే విషయం యుగాల నుండి తలకి ఎక్కలేదు. డాక్టర్ / పూజారి / తాంత్రికుడు / దేవుడు ఇలా ఎవ్వరూ మరణాన్ని ఆపలేరు. మరణించిన వారిని వెనక్కి తేలేరు. ఇది అందరికీ తెలిసినా నమ్మడానికి ఇష్టం లేని ” మాస్ హిస్టీరియా” మనది.
సినిమాలో కమల్ కామరాజు పాత్ర నుండి హిస్టీరియా మొత్తం ఊరికి పాకింది. చివరకు హీరోయిన్ ని చంపాల్సిన అవసరం లేదు. రిహేబిలిటేషన్ సెంటలో ఓ ఆరు నెలలు వైద్యం తీసుకుంటే చాలు. నమ్మలేం మనం. మనకి చెట్టుకి కట్టి చంపేయడమే కావాలి. కుటుంబంలో ఒక్క వ్యక్తికి సూసైడ్/ డిప్రషన్ / మేనియా ఉన్నా మిగతా వారందరు చాలా జాగర్త పడాలి. వారికి వైద్యం ఇస్తూనే ఆ వ్యాధి మనకి కూడా సోకిందా లేదా అని నిరంతరం సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకోవాలి. మనకి కూడా సోకే అవకాశం 30-40 % ఉంది. కరోనా కన్నా దీని స్ప్రెడ్ చాలా ఎక్కువ. జాగర్త వహించండి. ఎట్లీస్ట్ మన జబ్బు మన పిల్లలకి సోకకుండా ఉంటుంది. మన “పిచ్చి” కి పిల్లలు బలవకుండా ఉంటారు…
Share this Article