మెగా క్యాంపులో సాయి ధరమ్ తేజ కాస్త డిఫరెంట్… మిగతా మెగా హీరోలకు భిన్నంగా ఉంటాడు… యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్లు వెనకబడిపోయాడు… విరూపాక్ష సినిమాలో కూడా డల్‌గా కనిపిస్తాడు ఎందుకో… గతంలో కూడా తను జాతీయవాద దృక్పథం కలిగిన హీరో పాత్రలు పోషించాడు… నటనలో మేటి అని చెప్పలేం గానీ, ఇంకా డెవలప్ కావాలి గానీ… మరీ విసుగు ప్రదర్శించేంత నాసిరకం నటుడు మాత్రం కాదు…
అయితే ఒకటీరెండు అంశాల్లో ఈ విరూపాక్షుడిని మెచ్చుకోవచ్చు… మెగా హీరోలు ఏ కథను తీసుకొచ్చినా సరే, చివరకు దేవుళ్ల పురాణాలను తీసుకొచ్చినా సరే… మితిమీరిన హీరోయిజం, బిల్డప్పులను ఆశ్రయిస్తారు… ఒరిజినల్ కథను కొనుక్కొచ్చుకున్నా సరే, తమ బిల్డప్పులకు అనుగుణంగా ఎడాపెడా మార్పులు చేయిస్తారు… ఇందులో విరూపాక్షుడు స్ట్రెయిట్… మరీ అతి హీరోయిజం జాడలు తక్కువ… అది ఒక రిలీఫ్… కాగా ఇలాంటి భేతాళ, భూత, క్షుద్ర శక్తుల కథలను సాధారణంగా మన మెయిన్ స్ట్రీమ్ హీరోలు అంగీకరించరు…
మనవాళ్లకు ఎంతసేపూ మాఫియా, పగ, ప్రతీకారాలు, మిషన్ గన్నులు, సూపర్ మ్యాన్ ఫైట్లు కావాలి… కానీ విరూపాక్షలో హీరో, దర్శకుడు కథకు స్టికాన్ అయిపోయారు… ఓవర్ షో ఏమీ లేకపోవడం మరో రిలీఫ్… ఇప్పుడు ఈ క్షుద్ర శక్తులు గట్రా ఏమున్నాయోయ్ అని ప్రేక్షకుడు పెదవి విరిచే ప్రమాదం ఉందని గమనించి… కథను ఏదో 1979, 1991 కాలానికి వెనక్కి తీసుకుపోయారు… అది ఇంకో రిలీఫ్… థ్రిల్లర్, సస్పెన్స్ కథ కదా, మిగతావి జొప్పిస్తే, ప్రయారిటీ ఇస్తే అసలు కథ నీరసపడిపోతుందని అనుకున్నట్టున్నాడు దర్శకుడు… చివరకు లవ్ ట్రాక్‌ను కూడా పైపైన తేల్చేశాడు… అది మరీ రిలీఫ్…
Ads
రుద్రవనం ఊరు… క్షుద్ర శక్తుల సందేహంతో ఓ జంటను చంపేస్తారు… వాళ్లు శాపం పెడతారు… తరువాత అనుకోకుండా కథలోకి హీరో వస్తాడు… ఊళ్లో వరుసగా మరణాలు సంభవిస్తుంటాయి… హీరో సమస్యను సాల్వ్ చేస్తాడు… హీరో కదా, చేయాలి మరి… అలా అలా ఏదో ఏదో రాసుకుంటూ పోయాడు దర్శకుడు కథను… కథను ప్రజెంట్ చేసిన విధానం పెద్ద మెప్పించేలా ఉండదు, అలాగని పూర్తిగా కొట్టిపారేసే రకం కూడా కాదు… చల్తా…
సాయిధరమ్‌తేజ మెరుగైన నటుడిగా కనిపించాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి… కొన్ని సీన్లలో తేలిపోయాడు… మొదట్లో అల్లాటప్పాగా కనిపించిన హీరోయిన సంయుక్త మేనన్ మాత్రం చివరలో మెప్పించింది… పర్లేదు, కాస్త మెరిట్ ఉంది ఆమెలో… ఈ సినిమాలో పెద్దగా చెప్పుకునేది ఏమీలేదు… ఒక్కటి తప్ప..! అదే సంగీతం… పాటల్ని వదిలేయండి… నేపథ్య సంగీతంతో అజనీష్ లోకనాథ్ మెప్పిస్తాడు… తను కాంతార ఫేమ్…
వీఎఫ్ఎక్స్‌ను పరిమితంగా వాడుకున్నారు, అదొక రిలీఫ్… ఈ మ్యూజిక్ బీజీఎం సరిగ్గా లేకపోతే సినిమా మరింత నాసిరకంగా ఉండేది… ప్రస్తుతం తెలుగు సినిమా కథ కాకులతో లింకై నడుస్తోంది… బలగం అదే కదా… విరూపాక్షలో కూడా… జై వాయసం… జైజై వాయసం… అన్నట్టు, ఇదీ పాన్ ఇండియా సినిమాయేనట… సాయి ధరమ్ తేజ పాన్ ఇండియా స్టార్ అన్నమాట… వావ్…!! ఇప్పటికీ ఓ డౌట్, నిజంగా దీనికి సుకుమారేనా స్క్రిప్టు..?!
Share this Article