Nancharaiah Merugumala………. కె.విశ్వనాథ్ గారిని సినీలోకం మరిచిపోయినా సువర్ణభూమి, రామరాజ్ కాటన్, జీఆర్టీ కంపెనీలు మరిచిపోలేవు! ఆయన కళాతపస్వి మాత్రమే కాదు కర్మయోగి కూడా… గురువారం శివైక్యం పొందిన సినీ దర్శకుడు కాశీనాథుని విశ్వనాథ్ గారు మంచి చలనచిత్రాల సృష్టికర్తగా, తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డగా, కళాతపస్విగా ఎన్నాళ్లు తెలుగునాట ప్రజలకు గుర్తుంటారో చెప్పడం కష్టం. కానీ రేపల్లెలో పుట్టిన కాశీనాథుని వారు ఏడు పదులు నిండిన తర్వాత వ్యాపార ప్రకటనల రంగంలో చేసిన కృషి మాత్రం ఎక్కువ కాలం నిలిచిపోతుంది.
ఆర్థిక అవసరాల కోసమో లేక అదనపు ఆదాయం సంపాదనకో తెలియదు గాని విశ్వనాథ్ గారు నిజంగా ఈ రంగంలోకి దిగడం చూడచక్కని దృశ్యమే. సువర్ణభూమి డెవలపర్స్ అనే ఇళ్ల స్థలాలు అమ్ముకునే రియల్ ఎస్టేట్ కంపెనీకి నెల్లూరు జిల్లాకు చెందిన తోటి శైవ బ్రాహ్మణుడు, సినీ గాయకుడు ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యంతో కలిసి బ్రాండ్ అంబాసిడర్ గా (అదే ఈనాడు భాషలో చెప్పాలంటే ప్రచారకర్తగా) పనిచేశారు విశ్వనాథ్ గారు. అంతేకాదు, రాజమండ్రి సమీప పట్టణం రాజానగరం దగ్గర ఇదే సువర్ణభూమి కంపెనీ వారి వెంచర్ ‘శ్రీరామరక్ష’లో ప్లాట్ల అమ్మకాలు వేగంగా జరగడానికి ఆయన తన శక్తికొలదీ తోడ్పడ్డారు.
పత్రికలు, టీవీ చానళ్లలో వచ్చే ఈ కంపెనీ వ్యాపార ప్రకటనల్లో కనపడడమే గాక 2016 ప్రాంతంలో నెలకు రెండుసార్లు రాజానగరం పోయి శ్రీరామ రక్ష సైటులో విశ్వనాథ్ గారు పొద్దున్నే నడిచేవారట. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేసే కళా తపస్వి ఇలా రాజానగరం పోయి సువర్ణభూమి వెంచర్ నేలపై నడవడమే గాక అక్కడ స్థలాలు కొందామనుకునే వారితో కూడా మాట్లాడి వారి అనుమానాలు తీర్చే ప్రయత్నం చేసేవారు. దర్శకుడుగా ఆయన నిర్మాతల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చిన రీతిలోనే తాను ప్రచారకర్తగా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున అంత గట్టిగా పనిచేయడం నిజంగా హర్షణీయం. ఆయన కళాతపస్వి మాత్రమే కాదు కర్మయోగి కూడా అనిపిస్తోంది.
Ads
రామరాజ్ కాటన్ పేరు ఉన్నంత కాలం విశ్వనాథ్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది!
……………………………………………………………………………………….
సువర్ణభూమి తర్వాత విశ్వనాథ్ చివరి సంవత్సరాల్లో తాను బ్రాండ్ అంబాసడర్ గా సాయపడిన నూలు గుడ్డల కంపెనీ రామరాజ్ కాటన్. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ ప్రధానంగా తెల్ల బట్టలు– అవి కూడా ముందే కుట్టినవి అమ్మకంలో ముందున్న కంపెనీ. తెలుగునాట ఈ కంపెనీ తన ఫ్రాంచైజీ బ్రాంచీలు పెట్టిన చోటల్లా షాపు పారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథి విశ్వనాథ్ గారే. కొన్ని సంవత్సరాల క్రితం మంచి చలికాలంలో కూడా హైదరాబాద్ ఏఎస్ రావు నగర్‌లో రామరాజ్ కాటన్ షాపు ఓపెనింగుకు సూర్యోదయానికి ముందే శ్రమ అనుకోకుండా 86 ఏళ్ల వయసులో వెళ్లారు విశ్వనాథ్.
ఈ రెండు కంపెనీలేగాక మరో తమిళ బంగారు, వెండి నగల కంపెనీ జీఆర్టీ జూయెలర్స్ కు కూడా ఆయన బ్రాండ్ అంబాసిడరే. ఇలా తెలుగు, తమిళ తేడా లేకుండా తనను కోరిన కంపెనీల అమ్మకాలు పెరడానికి దోహదం చేశారు సినీ కళాతపస్వి. దేశంలో 85 ఏళ్లు దాటిన తర్వాత కూడా వాణిజ్య కంపెనీలకు ప్రచారకర్తగా పనిచేయడం ద్వారా విశ్వనాథ్ గారు తెలుగు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. సువర్ణభూమి వెంచర్లలో స్థలాలు కొనాలంటూ విశ్వనాథ్ గారు ఈ కంపెనీ యాడ్స్ లో కనిపించి కోరడంతో ఈ కంపెనీకి మంచి ప్రయోజనమే సిద్ధించింది.
ఎస్సీబీ, విశ్వనాథ్ గారి కులాలను బట్టి అనేక మంది అమాయక బ్రాహ్మణులు సువర్ణభూమిని తమ కంపెనీ అనుకుని వందలాది ప్లాట్లు కొన్నారని పొద్దునే నా రాజమండ్రి మిత్రుడొకరు చెప్పారు. వాస్తవానికి సువర్ణభూమి డెవలపర్స్ యజమానులు నెల్లూరు రెడ్లో గుంటూరు కమ్మలో అని ఎవరో చెప్పినట్టు గుర్తు. ఏదేమైనా తెలుగు సినిమా దర్శకుల్లో గొప్ప వ్యక్తి ఆయన. మరణించే వరకూ ఇతర రంగాల్లో సైతం పనిచేస్తూ ఆదాయం ఆర్జించిన కర్మయోగి కాశీనాథుని విశ్వనాథ్ గారు. అంతేకాదు, గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన–అనే పాట కూడా నేను ఈ కాశీనాథుని వారిని గుర్తుపెట్టుకోవడానికి మరో కారణం…
Share this Article