పాఠశాల విద్యను మించిన మధురమైన కాలం మరోటిలేదు. తెలిసీ తెలియని వయసు, చిల్లర చేస్టలు, సార్ల భయం.. అన్నిటి కలబోత.. సాధారణంగా బడుల్లో excursion నిర్వహిస్తుంటారు. ప్రతి పిల్లవాడు వెళ్ళాలనుకుంటాడు. ప్రతివాడు నూటొక్క కలలు కంటుంటాడు. నిర్వహించే సార్లకు ప్రాణాంతకం. ప్రతి పిల్లవాడు తిరిగి ఇంటికి చేరేంత వరకు వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటారు. పిల్లలు ఇంట్లో చేసిన అప్పాలు తెచ్చుకుంటారు.
కొన్ని కొందరికి పడవు. కడుపులో గడబిడ అయితే కొద్దిసేపు ఓర్చుకొని, మరీ తట్టుకోలేని సమయంలో డోర్ దగ్గరకు వచ్చి ఆపమనుడు… ఇంకా చాలా చికాకులు. ఒకసారి దేవరుప్పుల high school నుంచి విశాఖపట్నం, అరకు తదితర ప్రాంతాలకు పిల్లలను తీసుకొని పోయాం. విశాఖ చేరేసరికి సాయంత్రం అయ్యింది. టీచర్లు తలా అయిదారుగురు పిల్లలను చూసుకోవాలని చెప్పుకున్నాం.
అసలే విశాఖ కొత్త ప్రాంతం. సముద్రం.. సాయంత్రం. పిల్లలు పదిలం. సముద్రం లోపలికి వెళ్ళొద్దని గట్టిగా చెప్పాం. గంట సేపట్లో అందరూ బస్ దగ్గరకు రావాలని చెప్పాం. అసలే పిల్లలు.. డోర్ తీయగానే వనం విడిచిన కోతుల మాదిరిగా సముద్రం దగ్గరకు వెళ్తుంటే ఆపుడు వశం కాలే. సార్లకు మళ్లోసారి చెప్పాం. అనుకున్న టైమ్ అయ్యింది. హాజరు తీసుకున్నాం. సారు వచ్చిండు కానీ ఆయన ఆరుగురు పిల్లల్లో నలుగురు మిస్.
Ads
మీ పిల్లలు ఏరంటే చప్పుడు లేదు. చీకటి ఆయితుంది. ఎక్కడని ఎతుకాలి.. అందరికీ కొత్త. ఆ సారును ఇయ్యరమయ్యర మాటలు అన్నాం, లాభం లేకుండా పోయింది. ఇప్పటోలె సెల్ ఫోన్లు లేవు. బస్సు మొత్తానికి ఒక్కటే టార్చ్ లైటు. సముద్రపు అలల చప్పుడు ఎక్కువవుతుంది. మా అందరికీ కాళ్ళూ చేతులు చల్లబడ్డయి. ఆ బస్సు దగ్గరకు రాని పిల్లల్లో ఒకడు మనూరులో పెద్ద మనిషి కొడుకు. వాడు మమ్మల్ని చంపనే చంపుతాడు.
పిల్లలను మెసులకుండ తిట్టిన. వాండ్లు ఎటుకై పోయిండ్రో ఎవరన్నా చూసిండ్రా అంటే అడిగితే ఒక్కడు గంపెడు ధైర్యం తెచ్చుకొని వాళ్ళు పోయిన దిక్కు చూపిండు. ఆక్కడ సముద్రంలోకి దిగవద్దని బోర్డ్ ఉంది. ఇగ మాకు ఇవాళే ఆఖరు అనుకున్నాం. చీకటి ఎక్కువైతుంది. మనిషి దగ్గరకు వచ్చిందాక గుర్తుపట్టని చీకటి. గుండె రెండుమూడు వందల సార్లు కొట్టుకుంటుంది. ఎంత అరిచి గట్టిగా పిలిచినా సముద్రపు హోరు ముందు పక్కోడికే వినిపించడం లేదు.
భగవంతుడా అని చూస్తున్నాం. ఇంతలో ఒక పిల్లగాడు వచ్చి సార్ వాండ్లందరూ వచ్చిండ్రని చెప్పడంతో బతుకు జీవుడానుకుంట బస్ దగ్గరకు ఉరికినం. అంగీ ప్యాంటు తడిసి నెత్తిమీద నుంచి నీళ్లు కారుతున్నాయి. అంతకు ముందే పిల్లలు, మేం కోపం మీద ఉన్నామని చెప్పడంతో చేతులు కట్టుకొని చలికి వణుకుతూ నిలబడ్డారు. నేనైతే తలా నాలుగు సప్పరిచ్చిన. ఎవరికి వారు. ఇంకోడు రమ్మంటే పోయి ఈత కొట్టినం అని చెప్పిండ్రు.
అప్పటిదాక పిల్లలు ఏమయ్యారో అన్న భయం. ఇప్పుడు ఆ పెద్దమినిషి కొడుకుని కొట్టాను కదా ఇంటికి పోయినాక వాడు తండ్రికి చెప్పి ఎంత గొడవ చేయిస్తాడోనని కొత్త భయం. మా సార్లు కూడా గంతగనం కొట్టక పోనుంటువి అంటుంటే ఇంకా భయం కలిగింది. రెండు మూడు గంటలు నా దెబ్బల బాధ, దోస్తుల మధ్య ఇజ్జత పాయే అని టీవీ సీరియల్ లా ఎక్కెక్కి ఏడ్సుడు. తెల్లారేసరికి వానికి పుట్టెడు జరం. ఇహ నా చావు. వాడిని ఎంత దగ్గరకు తీసుకున్నా రావడం లేదు. మూడు రోజుల తర్వాత ఇల్లు చేరుకున్నాం.
రెండుమూడు రోజులు మా వాకిట్లో చెప్పుల సప్పుడైతే చిన్న భయం కాలే.. ఒకనాడు వాడి తండ్రి ఇద్దరినీ వెంటబెట్టుకొని బడికి రానే వచ్చాడు. నేను ఏ క్లాస్ లో ఉన్నానో అడిగి మరీ వచ్చాడు. దాదాపు చచ్చిపోయిన. మీరేనా నా కొడుకుని కొట్టింది అన్నాడు. తడారిన గొన్తుతో నేనే అన్నాను. కొడుకును పిలిపించిండు. వాడితో నన్ను కొట్టిస్తాడు అని అదే జరిగితే చచ్చిపోవల్సిందే అనుకున్నాను. కొడుకును దగ్గరకు రమ్మని నువ్వు చేసిన పని సక్కటిదని ఏడ్సి జరం తెచ్చుకొని, సార్ మీద ఉల్టా చెప్తావా. నేనే ఉంటే ఆ నీళ్ళలోకే నూకుదు అన్నడు… తప్పయింది సార్ అని చెప్పి వెళ్లిపోయిండు…
(ఇది కూడా Ramesh Sharma Vuppala వాల్ నుంచే సంగ్రహింపబడిందని గమనించ మనవి…)
Share this Article