————————
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. అయితే వజ్రాన్ని కొని పెట్టుకునే వారే నూటికో కోటికో ఒక్కరు. వారెవరూ వజ్రాన్ని చేతులారా కోసి పరీక్షించుకోలేరు. వజ్రాలు తయారు చేసేవారికే వజ్రాల కోత గురించి తెలిసి ఉంటుంది. ఇనుము అలా కాదు. ఇనుప శాస్త్రం సామాన్యులకు కూడా తెలిసి ఉంటుంది. సగటు జీవి ఇంటి నిండా ఇనుమే. తొక్కే సైకిల్ ఇనుము. వండే బాణలి ఇనుము. దున్నే నాగలి ఇనుము. తలుపు గడియ ఇనుము. కిటికీ ఇనుము. మంచం ఇనుము. అడుగడుగునా ఇనుమే. అణువణువునా ఇనుమే. శరీరంలో కూడా ఇనుము- ఐరన్ చాలా అవసరం. బాడీలో ఇనుము లోపిస్తే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి.
“ఇనుము విరిగెనేని యినుమారు ముమ్మారు
కాచి యతుకనేర్చు గమ్మరీడు
మనసు విరిగినేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ వినురవేమ”
Ads
ఇనుము విరిగినా, చిల్లు పడినా రిపేర్ చేసుకుని మళ్లీ హాయిగా వాడుకోవచ్చు అని వేమన ఆనాడే ఇనుము ఉపయోగాలను చక్కగా పద్యంలో చెప్పాడు. సంస్కృతంలో అయః అంటే ఇనుము. ఏదయినా గందరగోళంగా, గజిబిజిగా, అర్థం కాకుండా ఉంటే- “అయోమయం” అంటున్నాం. అంటే ఇనుపమయం- కొరుకుడు పడనిది అని పిండితార్థం.
ఇనుము ఎన్ని రకములు? ముడి ఇనుము ఎలా దొరుకును? ఇనుము ప్రయోజనములు ఎట్టివి? అన్న చర్చకు ఇది వేదిక కాదు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు- ఒక నినాదం. ఒక ఉద్యమం. ఒక ఉక్కు సంకల్పం. ఒక నెరవేరిన ఉక్కు కల. కోట్ల భవనాల పునాదుల్లో, స్తంభాల్లో ఎముకలుగా నిలిచిన ఉక్కు ఆధారం. వేల మందికి జీవనాధారం. ఒక భావోద్వేగ పునాదుల మీద నిర్మాణమయిన పెద్ద పరిశ్రమ.
ఎంతటి ఉక్కుకయినా ఎప్పుడో ఒకప్పుడు తుప్పు పట్టక పోదు. ఇప్పుడు విశాఖ ఉక్కుకు సహజంగా తుప్పు పట్టలేదు. కృత్రిమంగా ప్రయివేటు తుప్పు పట్టించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. విశాఖ ఉక్కుకు అయోమయం తుప్పు తగిలింది. ఇక ఇనుము విరగవచ్చు. తుప్పు మిగలవచ్చు. ఇనుమాఱు ముమ్మారు కాచినా నమ్మకంగా అతుక్కోక పోవచ్చు. ప్రయివేటు అయస్కాంతం ఎంతటి ప్రభుత్వ ఇనుమునయినా ఇట్టే ఆకర్షించి బుట్టలో వేసుకోవచ్చు.
సాధారణంగా ఇనుప గుగ్గిళ్లు కొరుకుడు పడవు. జీర్ణం కావు. అనారోగ్యం. అయితే ప్రయివేటు వారికి ఇనుప గుండ్లయినా కొరుకుడు పడతాయి. చక్కగా అరుగుతాయి. జీర్ణం…జీర్ణం…వాతాపి జీర్ణమవుతాయి. ఇనుప గుగ్గిళ్లు ఇక ఎంతమాత్రం నిందార్థం కాదు. స్తుతి. తెలుగులో అ ఇ ఉ చాలా ప్రధానమయిన అక్షరాలు. ఈమధ్య తెలుగు తక్కువగా వాడుతుండడం వల్ల అ ఇ ఉ లకు కొద్దిగా తుప్పు పట్టి అయోమయంగా దిక్కులు చూస్తూ ఉన్నాయి. అక్కడ విశాఖ ఇనుము ఉక్కులో కూడా ఉన్నది అవే ఇ ఉ లే. అక్షరాలకు పట్టిన తుప్పును వదిలించలేరు. అసలు ఇనుముకు పట్టబోయే తుప్పును తప్పించలేరు.
విశాఖా!
ఏదీ నిరుడు బిగించిన ఉక్కు పిడికిలి?
కావాలా ఐరన్ ట్యాబ్లెట్లు?……………… by… -పమిడికాల్వ మధుసూదన్
Share this Article