కల్కి సినిమాలో బుజ్జి అనే ఫ్యూచరిస్టిక్ కారుకు నటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది కదా… పర్లేదు, బాగానే కుదిరింది… అది చూస్తుంటే దర్శకుడు వంశీ ఏదో తన ఆర్టికల్‌లో రాసిన ఈ వాక్యాలు చకచకా గుర్తొచ్చాయి… డబ్బింగ్ ప్రాధాన్యం మీద సింపుల్‌గానైనా బాగా రాశాడు ఆయన… (అప్పుడెప్పుడో సితార, మంచుపల్లకీలు తీసిన తొలిరోజుల్లో తన జ్ఞాపకాలు)…
‘‘చాలామంది డైరెక్టర్లు బిజీగా ఉండడంవల్లేమో ఈ డబ్బింగ్ పని అసిస్టెంట్లకి అప్పగించేస్తున్నారు. కానీ ఇక్కడ సినిమాని ఎంత ఇంప్రొవైజ్ చెయ్యొచ్చో అనుభవం మీద తెల్సుకున్న నాకు చాలా ఇష్టమైన పనీ డబ్బింగ్ చెప్పించడం. జ్ఞాపకం చేసుకుంటే మన్మధలీల సినిమాలో కమలహాసన్‍కి ఎంత బాగా డబ్బింగ్ చెప్పారా మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తిగారూ!
అసలు ఎస్పీ బాలుగారు వేరే భాషల్లో పెద్ద పెద్ద హీరోలు సరే సీతాకోకచిలకలో కార్తిక్‍లాంటి కుర్ర హీరోలక్కూడా ఎంత గొప్ప జీవం పోసేరూ! వీళ్ళందరికంటే ముందు శివాజీ గణేశన్‍కి డబ్బింగ్ చెప్పిన కొంగర జగ్గయ్య గారు! అసలాయన డబ్బింగ్ చెపుతున్నప్పుడు చూడ్డానికే చాలా బాగుండేదంట.
Ads
అదెలాగంటే తక్కినోళ్ళలాగ స్క్రిప్ట్ మీద కనిపించే తన క్యారెక్టర్‍కి మట్టుకే డబ్బింగ్ చెప్పడం గాకుండా మిగతా క్యారెక్టర్లకి చెప్పేవాళ్ళు కూడా తన చుట్టూ ఉండాలనే వారంటాయన. అసలప్పుడే అసలు థ్రిల్లు అని వాదించే ఆయన చెప్పింది సబబే అనిపించింది.
ఇప్పుడు వెనక్కొస్తే డైరెక్టర్లే కాదు, కో డైరెక్టర్లూ, అసిస్టెంట్లు కూడా డబ్బింగులు బాగా చెప్పించగలరూ అని చెప్పడానికి మంచి ఉదాహరణ ఆనాడు ప్రసాద్ స్టూడియో టాప్ ధియేటర్లో శంకరాభరణం సినిమాకి నండూరి విజయ్ డబ్బింగ్ చెప్పించిన పద్ధతి అలాంటిలాంటిది కాదు.
సరే, చెప్పుకుంటూ పోతే, చాలా ఉన్న చరిత్ర పక్కన పెట్టేసి ఈ లేడీస్ టైలర్ డబ్బింగ్ విషయానికొస్తే మెయిన్ హీరోయిన్ అర్చనకి డబ్బింగ్ జానకి చెల్లెలు లక్ష్మి, వై.విజయకి విజయబాల, దీపకి గౌరీప్రియ, కర్ణకి స్వామి, ఆ వైజాగు జి.ఎన్.మూర్తికి తారాకృష్ణ. వీళ్ళంతా డబ్బింగ్‍లో ఎక్స్‌పర్ట్స్… ప్రతిరోజూ పొద్దుట మొదలయ్యే ఆ డబ్బింగ్ కార్యక్రమం ఒక పండగే నాకు…’’
ఆ రోజుల్లో డబ్బింగ్ అంటే కేవలం సినిమాల్లో కొందరికే… డబ్బింగ్‌ను కూడా ఓ కళగా సాధన చేసి చెప్పేవారు… కానీ ఇప్పుడు డబ్బింగ్ అనేదే ఓ ప్రొఫెషన్… వాయిస్ ఓవర్ అనేది టీవీ షోలు, యూట్యూబ్ వీడియోల దగ్గర నుంచి వెబ్ సీరీస్, సినిమాలు, టీవీ సీరియళ్లు, ఓటీటీల్లో సినిమాల పలుభాషల వెర్షన్లు… అబ్బో, ఇప్పుడు నిజంగానే డబ్బింగ్ అనేది ఓ సీరియస్ వృత్తి…
ఎక్కడో చదివినట్టు గుర్తు… సింగర్ సునీత పాడటంకన్నా డబ్బింగులోనే చాలా బిజీ ఆర్టిస్టు అట చాన్నాళ్లు… దాదాపు 500 సినిమాలకు డబ్బింగ్ చెప్పిందట… వావ్… డబ్బింగ్ అంటే ఏదో నాలుగు మాటలు మాట్లాడటం కాదు… అది ఒక ఆర్ట్ అని ఎందుకు చెప్పుకోవాలంటే..? పదాలు పలకడంలో స్పష్టత ముఖ్యం, అన్నింటికీ మించి సీన్‌ను బట్టి, కేరక్టర్‌ను బట్టి, నటీనటులను బట్టి, సందర్భాన్ని బట్టి… పలికే పదాల్లో ఉద్వేగాల్ని పలికించాలి… వాళ్లే నిజమైన డబ్బింగ్ ఆర్టిస్టులు, హార్టిస్టులు..! ఎస్, బీజీఎం బాగుంటే ఒక సీన్ ఎలివేట్ ఎలా అవుతుందో, సరైన వాయిస్ ఓవర్ కూడా అంతే..!!
Share this Article