.
Kandukuri Ramesh Babu
……. #వివి #సందర్భం…. చరిత్రలో ఒక ద్రోహ కాల్ : చర్చ జరగాలి….
గతంలో వరవరరావు గారు ‘ఫెలో ట్రావెలర్’ అన్న కలం పేరుతో వ్యాసాలు రాసినట్టు గుర్తు. దాన్ని బట్టి ఇది మల్లోజుల గారిపై వివి గారి నిశితమైన విమర్శ అనే భావించాలి. దీన్ని వారి వ్యక్తిగత అభిప్రాయం అనే అనుకోనక్కరలేదు, చాలామంది ఇది పార్టీ అభిప్రాయమని భావించే అవకాశాన్ని కాదనలేం.
Ads
“రెనగేడ్ వేణుగోపాల్ విద్రోహాన్ని అమాయకమైన కోడి ఈకతో కూడ పోల్చలేం. విప్లవ ప్రతీఘాతక సాయుధ ఆత్మహత్యను దేనితోనూ పోల్చడానికి లేదు” అంటూ జరిగిన పరిణామాలపై ఆగ్రహంతో వివి గారు సూటిగా ఇలా వివరిస్తారు….
- “ఒక చిగురిస్తున్న మొలకగా బస్తర్‌లోకి మొదటి ఏడు దళాలతో ప్రవేశించిన మల్లోజుల వేణుగోపాల్ నవయవ్వనం నుంచి 63 ఏళ్ల నాటికి సోను, అభయ్‌గా దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ అభివక్తగా ఒక మహా వృక్షమయ్యాడని భావించాం.కానీ ఈ చెట్టు చెదలు పట్టి, చెదలు అడివంత ఎట్ల పాకుతూ ఇంత నష్టానికి, ఇంత వెన్నుపోటుకు దారి తీసిందీ విప్లవోద్యమ చరిత్రలో ఒక ద్రోహ కాల్‌గా నిలిచిపోతుంది.”
మల్లోజుల దిగజారినందుకు మాత్రమే కాదు, ఆయన ప్రతిఘాత విప్లవ ద్రోహిగా మారినందుకు తీవ్రంగా తప్పు పట్టవలసిన పరిస్థితిని వివి గారు ఈ వ్యాసంలో వివరించారు.
కాగా, వివి గారు అన్నట్టు ఇది ద్రోహమే అయితే ఎందుకిలా అయింది! ఇందుకు ఎవరు బాధ్యత వహించాలి? ఇంతకాలం సుదీర్ఘ ఉద్యమంలో నిలబడ్డ అగ్ర నాయకుడు నిర్బంధానికి పిరికిపందలా పారిపోయి ఇలా చేశారని భావించాలా?
మల్లోజుల గారు 22 పేజీల లేఖలో ప్రస్తావించిన అంశాలను వివి గారు ఇక్కడ పెద్దగా చర్చించలేదు గాని సారాంశంలో ఆయన పార్టీకి చేసిన అన్యాయాన్ని చారిత్రక తప్పిదాన్ని నొక్కి చెప్పారు.
అడవంత చెదలు ఎలా పాకింది? ఇది నిజమే అనుకోవాలా? అసలు ఆయన ఎందుకిలా అయ్యారు దానికి ఎవరు బాధ్యత వహించాలి? సైదాంతిక విభేదాలు రాజ్యం సృష్టే అనుకోవాలా?
ఆజాద్ మరణం తర్వాత అడవి నుంచి మైదానానికి అనుసంధానంగా నిలిచారని చెప్పే మల్లోజులను తనంతట తాను లేఖలు విడుదల చేసేదాకా ఎందుకు పార్టీ ఇంత దాకా బాధ్యతలోనే ఉంచింది? వారి భార్య లొంగిపోయిన నాటి నుంచి ప్రభుత్వంతో టచ్ లో ఉన్నారనే విమర్శ కూడా బయట ఉన్నది. మరి పార్టీ ఇంటలిజెన్స్ ఏమి పనిచేయలేదా? ఎటువంటి అవగాహనతో ఉన్నది?
ఎన్నో ప్రశ్నలు. పౌర సమాజం ఈ గందరగోళ పరిస్థితిలో ఎటువంటి అంచనాకు రావాలి?
వివి గారి ఖండనను బేషరతుగా నమ్మాలా? మల్లోజుల మునుముందు తెలిపే విషయాలను విని బేరీజు వేసుకోవాలా?
తీవ్ర నిర్బంధ మధ్య ప్రాణాల్ని నిలుపుకోవడానికి, కేడర్ను, పార్టీని నిలుపుకోవడానికి మాత్రమే కాక అసలు సైద్ధాంతికంగానే పార్టీ మారవలసి ఉందన్న విషయాలు నిజం కాదా? ఎవరు చర్చించాలి?
పబ్లిక్ డొమైన్లో మల్లోజులను ద్రోహి అని చెప్పేసి ఊరుకోకుండా, ఆగ్రహావేశాలకు లోను కాకుండా స్థిమితంగా చర్చించే మెకానిజం అవసరం కాదా ఇప్పుడు?
చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న ప్రభుత్వం ఒకవైపు, తాత్కాలిక సాయుధ పోరాట విరమణ ప్రతిపాదించిన మల్లోజుల ఇంకొక వైపు, మావోయిస్టు పార్టీ యధాతధంగా ఇలాగే ముందుకు పోతుందని, తామందరి ముక్తకంఠం ఇదేనంటూ వర్గ పోరాటానికి ఉన్నత రూపంగా సాయుధ పోరాటాన్ని ఎత్తిపడుతున్న వివి గారు మరొకవైపు.
ప్రభుత్వం మావోయిస్టు పార్టీని పూర్తిగా మట్టు పెట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న కీలక దశలో ఈ మూడు మార్గాలను ప్రజలు ఎక్కువ మంది అబ్జర్వ్ చేయడం ఈ సంకట స్థితిలో… నిజానికి విషాద గడియలో మొత్తంగా మంచి విషయం. దశాబ్దాలుగా అన్నీ దగ్గరగా చూస్తున్న ప్రజలు మరింత నిశితంగా ఈ విషయాలని అర్థం చేసుకునే అవకాశం లభిస్తున్నందుకు కూడా ఒకింత సంతోషం.
పార్టీని పూర్తిగా మట్టు పెడదామని ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని శక్తులు కేంద్రీకరించిన సమయంలో మల్లోజుల ‘లొంగుబాటు’ ( రేపు మాపు మరికొందరి లొంగుబాట్లు ఉంటే అవి కూడా కలిసి ) లేదా తాను వ్యక్తిగతంగా పేర్కొన్న ‘సాయుధ పోరాట విరమణ’ తాత్కాలికంగానే కాదు, చాలా కాలం పాటు సమాజంపై ప్రభావం చూపడం మాత్రం ఖాయం.
చర్చ జరగాలి. కానీ, నిర్బంధ సమయంలోనే పాలు నీళ్లు వేరైనట్టు మంచి చెడు స్పష్టం కావడం కష్టమేమో? చూడాలి. ద్రోహులు బయటపడాలి. నికార్సైన నక్సలైట్లు ఎట్టి పరిస్థితుల్లోనైనా బతకాలి. వివి గారు వ్యాసంలో మొదట్లో ఆర్కే తదితరులను కీర్తించినట్లు అమరత్వం ఒకటే అన్నిటికీ పరిష్కారం కాదు.
. వసంతమేఘంలోని ఆ సంపాదకీయం… ఈ లింకులో….
సాయుధ ప్రతిఘాతుకం- ఉల్కాపతనం… ఫెలో ట్రావెలర్
Share this Article