.
బొట్టు పెట్టి ప్రసాదం పంచితే తమన్నా సినిమా ఆడుతుందా..? బీహార్‌లో మాత్రం కథ వేరుగా ఉంది!
సినిమా విడుదలైంది… థియేటర్ల దగ్గర బొట్లు పెడుతున్నారు. ప్రసాదాలు పంచుతున్నారు. కొందరు చెప్పులు బయటే విడిచి థియేటర్లోకి వెళ్తున్నారు. ఇంకొందరు సినిమా చూస్తున్నంతసేపూ దాన్ని సినిమా కంటే ఒక ఆధ్యాత్మిక అనుభవంలా ఫీలవుతున్నారు. చూస్తుంటే కొత్త ప్రమోషన్ ట్రెండ్ ఏదో పుట్టుకొచ్చిందేమో అనిపిస్తుంది. కానీ ఇది నిజంగా సినిమా ఆడించే మార్కెటింగ్ మంత్రమేనా?
Ads
Vvaan విషయంలో ఇప్పుడు కనిపిస్తున్న ఈ దృశ్యాలు అంతకు ముందు హనుమాన్ అంశ్ విషయంలోనూ కనిపించాయి. భక్తి, విశ్వాసం, ప్రసాదం, దేవుడి పేరు… వీటన్నింటినీ సినిమా ప్రచారంతో కలపడం కొత్తేమీ కాదు. దక్షిణాదిలో అయితే ఇలాంటి ఎత్తుగడలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. భక్తిరస సినిమాలకు చిన్న విగ్రహాలు, హుండీలు, తీర్థప్రసాదాలు… సెంటిమెంట్ సినిమాలైతే ప్రేక్షకుల చేతుల్లో కర్చీఫులు… సినిమా ఏ భావోద్వేగాన్ని టార్గెట్ చేస్తుందో దానికి తగ్గట్టు థియేటర్ బయటే ఒక వాతావరణం సృష్టించడం మన దగ్గర ఎప్పటినుంచో ఉంది.
కానీ ఒక చిన్న లాజిక్ ఇక్కడ మర్చిపోతే కష్టం. బొట్టు పెట్టినంత మాత్రాన ప్రేక్షకుడు సినిమా చూడడు. ప్రసాదం ఇచ్చినంత మాత్రాన టికెట్ కొని రెండున్నర గంటలు కూర్చోడు. సినిమాలో దమ్ముంటే ఆ ప్రచారం అదనంగా పనిచేస్తుంది. సినిమాలో దమ్ము లేకపోతే ప్రసాదం తిన్న ప్రేక్షకుడు బయటకొచ్చి… ప్రసాదం బాగుంది, సినిమా బాలేదంటాడు!

అయితే Vvaan విషయంలో కథ కొంచెం ఆసక్తికరంగా ఉంది. ఇది సాధారణ హారర్ సినిమా కాదు. బీహార్ జానపద విశ్వాసాలు, ఛఠ్ పూజ, వాన్దేవి, ప్రకృతి, గ్రామీణ నమ్మకాలు, కుటుంబ అనుబంధం, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కలిసిన ఫోక్లోర్ ఫాంటసీ థ్రిల్లర్.
సిద్ధార్థ్ మల్హోత్రా పోషించిన రిషి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి. దేవుడి నమ్మకాల కంటే తన లాజిక్‌నే నమ్ముతాడు. కానీ అతను తన మూలాలకు, పూర్వీకుల ప్రాంతానికి వెళ్లిన తర్వాత అక్కడి నమ్మకాలు, అడవి, వాన్దేవి చుట్టూ ఉన్న రహస్యాలు అతని జీవితంలోకి వస్తాయి. ఇక్కడే Vvaanకు అసలు బలం వస్తుంది.
- అది బీహార్‌ను బ్యాక్‌డ్రాప్‌గా పెట్టుకున్న సినిమా కాదు. బీహార్ సంస్కృతినే కథలో ఒక పాత్రగా మార్చుకున్న సినిమా. ఛఠ్ పూజను సినిమాలో కేవలం రెండు పాటల మధ్య చూపించే సన్నివేశంగా కాకుండా కథలోని భావోద్వేగంతో కలిపారు. దివంగత గాయని శారదా సిన్హా స్వరాన్ని ఉపయోగించడం కూడా బీహార్ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించింది. అందుకే అక్కడ సినిమా పోస్టర్ చూసినంత మాత్రాన వచ్చే కనెక్షన్ కాదు… “ఇది మన పండుగ, మన ఊరు, మన నమ్మకం” అనే ఫీలింగ్ ఏర్పడింది.
అందుకే థియేటర్లో ప్రసాదం పంచడం కూడా బయటివారికి చూస్తే మార్కెటింగ్‌లా కనిపించినా, అక్కడి ప్రేక్షకుడికి అది పూర్తిగా పరాయి అనుభవం కాదు. ఇదే సమయంలో మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. బీహార్ ప్రేక్షకుడు కేవలం బీహార్‌లో ఉండడు.
దేశంలోని దాదాపు ప్రతి పెద్ద నగరంలో బీహార్ నుంచి వెళ్లిన కుటుంబాలు ఉన్నాయి. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, సూరత్… ఎక్కడ చూసినా బీహారీ కమ్యూనిటీ ఉంటుంది. విదేశాల్లోనూ ఉంది. తమ ప్రాంతపు పండుగలు, పాటలు, దేవతలు, ఆచారాలు తెరపై కనిపిస్తే అది ఒక రకమైన నాస్టాల్జియా. ఓ కనెక్షన్. పండుగ సమయంలో స్వగ్రామానికి వెళ్లలేని వ్యక్తికి తెరపై కనిపించే అదే వాతావరణం కూడా భావోద్వేగాన్ని రేపుతుంది.
Vvaanకు బీహార్‌లో వచ్చిన స్పందనను అర్థం చేసుకోవాలంటే ఈ సాంస్కృతిక కనెక్షన్ కూడా చూడాలి. అందుకే ఈ సినిమా రివ్యూలు అంత గొప్పగా లేకపోయినా బాక్సాఫీస్‌లో మాత్రం వేరే కథ కనిపించింది. సెప్టెంబర్ 25న విడుదలైన Vvaan తొలి రోజే సుమారు ₹8 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు సాధించింది. తొలి వారంలో ₹50 కోట్ల ఇండియా నెట్ మార్క్‌కు చేరువైంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం బీహార్ మార్కెట్ ఈ సినిమాకు ప్రత్యేకమైన బలాన్ని ఇచ్చింది.
అంటే రివ్యూ ఒకటి చెబితే… ప్రేక్షకుడి ఎమోషన్ మరోటి చెప్పింది. ఇదే ఫార్ములా హనుమాన్ అంశ్ విషయంలోనూ మనం చూశాం. అక్కడ హనుమంతుడి మీద భక్తి, ఆధ్యాత్మికత, పురాణ విశ్వాసం ప్రధాన భావోద్వేగ హుక్‌గా మారాయి. సినిమా గురించి మాట్లాడేటప్పుడు కథ, విజువల్స్, హీరో కంటే ముందుగా “హనుమంతుడి సినిమా” అనే గుర్తింపు ప్రేక్షకుడి దగ్గరకు వెళ్లింది. థియేటర్లలో ఆధ్యాత్మిక వాతావరణం సృష్టించడం, ప్రసాదాలు పంచడం లాంటి చర్యలు ఆ భావోద్వేగాన్ని మరింత పెంచాయి.
కానీ ఇక్కడే అసలు పాయింట్. ప్రచారం భావోద్వేగాన్ని పెంచగలదు… భావోద్వేగాన్ని సృష్టించలేదు. ప్రేక్షకుడికి సినిమాలో ఏదో ఒకటి నిజంగా తగలాలి. అది భక్తి కావచ్చు. స్వగ్రామం కావచ్చు. బాల్య జ్ఞాపకం కావచ్చు. కుటుంబ అనుబంధం కావచ్చు. ఒక ప్రాంతపు సంస్కృతి కావచ్చు. ఒక హీరో మీద నమ్మకం కావచ్చు.
అది సినిమాలో లేకపోతే బయట ఎన్ని బొట్లు పెట్టినా ప్రయోజనం లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా కాలంలో మరో మార్పు వచ్చింది. ప్రేక్షకుడు ప్రమోషన్‌ను కూడా పరిశీలిస్తున్నాడు. “ఇంత ప్రసాదం పంచుతున్నారు… సినిమాలో ఏముందో చూద్దాం” అని మొదటి షోకు వెళ్లవచ్చు. కానీ బయటకు వచ్చాక మౌత్ టాక్ నిర్ణయిస్తుంది… ఈ సినిమాకూ అంతే. ప్రేక్షకుడి నమ్మకాన్ని సినిమా తాకింది. మార్కెటింగ్ ఆ నమ్మకానికి మైక్ పట్టింది…
Share this Article