వ్యూహం అనే సినిమా జగన్ రాజకీయ ప్రచారం కోసం ఉద్దేశించింది… అది జగన్ బయోపిక్ కాదు… జస్గ్, జైలుపాలైన స్థితి నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేవరకు సాగిన ప్రస్థానాన్ని కొద్దిసేపట్లో ఎఫెక్టివ్‌గా జనానికి చెప్పడం..! ఉద్దేశం అదే… కానీ ఏం జరిగింది..?
అసలు వైఎస్సార్సీపీ అనుకూల సైట్లు, యూట్యూబ్ చానెళ్లు కూడా ఈ సినిమాను ఎలా పొగడాలో తెలియక, జుత్తు పీక్కుని నెగెటివ్ రేటింగ్స్ ఇచ్చి, పెదవి విరిచాయి… అంటే వైసీపీ క్యాంపు, సానుభూతిపరులను కూడా రాంగోపాలవర్మ మెప్పించలేకపోయాడని అర్థమవుతూనే ఉంది కదా…
నిజానికి ఆర్జీవీలోని దర్శకుడు పారిపోయి చాన్నాళ్లయింది… ఆమధ్య తీసిన పొలిటికల్ చిత్రాలూ న్యూసెన్స్ వాల్యూ తప్ప సెన్సిబుల్ ఏమీ కావు… కీలకమైన ఎన్నికలకు ముందు తను అధికారం కోసం చేసిన పోరాటం, అనుభవించిన పెయిన్, స్ట్రెస్, బలమైన శక్తులతో చేసిన పోరాటం, ఘర్షణ గురించి ఓ సినిమా తీయడానికి ఆర్జీవీకి జగన్ ఎలా పర్మిషన్ ఇచ్చాడనేదే పెద్ద క్వశ్చన్ మార్క్…
Ads
సినిమాలో ఏముంది..? జగన్ సాగించిన అధికార ప్రస్థానం ఉంది… అవును, పదీపన్నెండేళ్లుగా జగన్ జీవితం ప్రజలకు తెలియందేముంది..? అంతే, అదే ముఖ్యమైన పాయింట్… వర్మ ఏదైనా కొత్త విషయాన్ని కాస్త క్రియేటివ్‌గా, ఎమోషనల్ టచెస్ ఇస్తూ, జగన్‌ను ఫోకస్ చేసి ఉండాల్సింది… అలాంటి ప్రయత్నాలు చేసే స్థితిలో వర్మ లేడు ఇప్పుడు… నిజానికి పాత సంగతులన్నీ గుదిగుచ్చి, ఓ కనెక్టింగ్ స్క్రిప్టు సాక్షి టీవీలోనో, సాక్షి పత్రికలోనో ఎవరైనా సీనియర్‌కు అప్పగిస్తే ఇంకా చాలా చాలా బాగా చేసి ఇచ్చేవాడు…
అంతెందుకు, సాక్షి టీవీలోని టెక్నికల్ టీంలో ఓ సీనియర్ వీడియో ఎడిటర్‌కు స్క్రిప్టు గనుక ఇచ్చి ఉంటే మరింత మంచి ఔట్‌పుట్ ఇచ్చి ఉండేవాడు… జగన్ కుటుంబానికి సన్నిహితుడు, సినిమా ఇండస్ట్రీలోనే ఉన్న మాజీ సాక్షి ప్రతినిధి ప్రియదర్శిని రామ్‌కు గనుక ఇలాంటి సినిమా బాధ్యత ఇచ్చి ఉన్నా బాగుండేది…
పొలిటికల్ ప్రాపగాండా సహజం, అన్ని పార్టీలూ చేసేదే… కానీ హుందాగా ఉండాలి, బలమైన కమ్యూనికేషన్ మార్గమైన సినిమాకు వచ్చేసరికి ఆ ప్రజెంటేషన్‌లో పంచ్ ఉండాలి, జనానికి కనెక్టయ్యేలా ఉండాలి… ప్చ్, వర్మ మరోసారి తనలోని డొల్లతనాన్ని బహిర్గతం చేసుకున్నాడు… మొన్నామధ్య వచ్చిన యాత్ర-2 బెటర్ అనిపిస్తుంది…
వీరశేఖర్‌రెడ్డి, మదన్‌మోహన్‌రెడ్డి, మాలతిరెడ్డి, ఇంద్రబాబు, శ్రవణ్ కల్యాణ్, కాశయ్య తదితర పాత్రల పేర్లు వింటుంటే, వాళ్ల వేషభాషలు చూస్తుంటే చిన్న పిల్లాడయినా చెబుతాడు ఆ ఒరిజినల్ పాత్రలేమిటో… కాకపోతే లీగల్ ఇష్యూస్ రాకుండా పాత్రల పేర్లు మార్చారు, తప్పదు… కానీ మరీ లోకేష్, పవన్ కల్యాణ్ పాత్రలను వెకిలి చేసిన తీరు వర్మ దిగువ అభిరుచిని పట్టి ఇచ్చింది… ప్రత్యర్థి క్యాంపు పన్నే బలమైన వ్యూహాల్ని, ప్రత్యర్థుల్ని బలంగా చూపిస్తూనే జగన్ వారిని కౌంటర్ చేసిన తీరు ఎఫెక్టివ్‌గా తీసి ఉంటే సినిమా బాగా పేలి ఉండేది… హుందాగానూ ఉండేది… జగన్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యేది…
గేదెలతో పవన్ కల్యాణ్ చెప్పుకుని ఏడవడం, లోకేష్- చంద్రబాబు కలిసి ఏడవడం ఏమిటో… మరీ లోకేష్‌ను ఓ తిండిపోతుగా చూపించడం బాలేదు… పార్టీ సోషల్ మీడియా వింగ్ రకరకాల మీమ్స్, జోక్స్‌తో ప్రత్యర్థులను గేలిచేయడం వరకూ పెద్దగా తప్పుపట్టలేమేమో, అన్ని పార్టీలూ అదే బాటలో నడుస్తున్నాయి కాబట్టి… కానీ సినిమాకు వచ్చేసరికి ఆ ధోరణి సరికాదు… జగన్, భారతిరెడ్డిల నడుమ ఓ సుదీర్ఘ సంభాషణ, తరువాత ఆమె కన్నీళ్లు, ఆనందబాష్పాలని చెప్పడం వంటివి కూడా వర్మ సరిగ్గా తీయలేక, నవ్వు పుట్టించాడు…
షర్మిల పాత్రను లైట్ తీసుకోవడం కూడా సరికాదు… నిజాల్ని దాచేస్తే అది చరిత్ర ఎలా అవుతుంది..? నిజానికి వర్మకు జగన్ అధికార ప్రస్థానం ఎలా తీయాలో తెలియదు… జగన్ అధికార ప్రయాణంలో అసలైన ట్విస్టులు, ఢిల్లీ పన్నిన వ్యూహాలు కూడా తెలియవు… అందుకే చెప్పిన ఈ కథలోనూ గాఢత లేదు, లోతు లేదు…
తనకు ఏమాత్రమైన తెలివి ఉంటే, తెలిసి ఉంటే, హఠాత్తుగా తెలంగాణ మలిదశ ఉద్యమం ఎందుకు మొదలైందో… కిరణ్‌కుమార్‌రెడ్డినే రోశయ్యకు బదులుగా ఎందుకు ఎంచుకున్నారో, ఓడిపోయి అజ్ఞాతంలో ఉన్న కేసీయార్ అంత బలంగా తెర మీదకు ఎందుకు వచ్చాడో, చిదంబరం అకస్మాత్తుగా తెలంగాణ ప్రకటన ఎందుకు చేశాడో కూడా సినిమా కథలో భాగమయ్యేవి.., కేవలం ప్రత్యర్థులను వెకిలిచేయడమే పొలిటికల్ ప్రాపగాండా అనుకుంటే ఓసారి బలంగా నిట్టూర్చడం తప్ప ఇంకేమీ చేయలేరు ఎవరూ… చివరక జగన్ అభిమానులు, సానుభూతిపరులు కూడా..!!
చివరగా… వర్మ పొలిటికల్ చిత్రాల్లో ఓ ప్రతిభ మాత్రం కనిపిస్తుంది… నిజమైన పాత్రధారుల్ని పోలిన నటుల ఎంపిక, వాళ్ల భాష, వేషభాషలు, మేనరిజమ్స్ అచ్చంగా దింపేస్తాడు… పేర్లు అక్కర్లేదు, చూడగానే అర్థమైపోతుంది మనకు వాళ్లు ఎవరో… ఈ సినిమాలో కూడా అంతే… ప్రత్యేకించి జగన్ పాత్రధారి ఎవరో గానీ బాగా చేశాడు… జగన్ పాత్రలోకి దూరిపోయాడు…! ఏతావాతా చివరాఖరికి తేలిందేమిటయ్యా అంటే… రాజధాని ఫైల్స్ కావచ్చు, వ్యూహం కావచ్చు… పొలిటికల్ ప్రాపగాండా సినిమాలు మనవాళ్లకు తీయరావు..!!
Share this Article