హిమంత్ విశ్వశర్మ…తెలుసు కదా… అస్సోం ముఖ్యమంత్రి… ఒకప్పుడు కాంగ్రెసే… ఓసారి రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చర్చించడానికి రాహుల్ నివాసానికి వెళ్తే… పెంపుడు కుక్కలకు బిస్కెట్లు విసురుతూ… హిమంత్ టీంను పట్టించుకోకుండా… అవమానకరంగా వ్యవహరించాడు… సీన్ కట్ చేస్తే… హిమంత్ ఇప్పుడు ముఖ్యమంత్రి… కాంగ్రెస్ దారుణమైన పరాజయం… ఇప్పట్లో కాంగ్రెస్ అక్కడ బాగుపడే సీన్ లేదు… ఓసారి జగన్‌ను ఢిల్లీకి పిలిచి సోనియా అవమానకరంగా మాట్లాడింది, ఏమైంది..? ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి… ఏపీలో కాంగ్రస్ పత్తాజాడా లేకుండా పోయింది… కాంగ్రెస్‌లో విలీనం కోసం కేసీయార్ ఢిల్లీలో ఉన్నాడు, సోనియాను కూడా కలిసి వచ్చాడు, ఏమైంది..? సీన్ కట్ చేస్తే, నో విలీనం, కేసీయార్ ముఖ్యమంత్రి ఇప్పుడు… తెలంగాణ ఇచ్చి కూడా కాంగ్రెస్ ఈరోజుకూ చచ్చిబతుకుతూనే ఉంది… మమతకూ పార్టీలో అవమానం… ఏమైంది..? సీన్ కట్ చేస్తే మమత ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ అయిపూజాడా లేదు అక్కడ…
ఏతావాతా అర్థమయ్యేది ఏమిటి..? బలమైన నేతల్ని దూరం చేసుకోవడంలో, నష్టపోవడంలో కాంగ్రెస్ చరిత్ర చిన్నదేమీ కాదు… రాష్ట్రాల నుంచి పార్టీ వ్యవహారాల గురించి మాట్లాడటానికి వచ్చే నేతల పట్ల కాంగ్రెస్ పెద్దల వ్యవహారశైలి ఎప్పుడూ ఇంతేనా..? మిత్రులతో ఒకరకంగా, తమ మీద ఆధారపడిన వారిపట్ల ఒకరకంగా, సొంత నాయకుల పట్ల రకరకాలుగా… కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించే తీరు ఎప్పుడూ ఓ మిస్టరీ… సజావుగా సాగుతున్న మహారాష్ట్ర సంకీర్ణ సర్కారులో తనే పుల్లలు పెట్టడం స్టార్ట్ చేసింది, ముఖ్యమంత్రి ఠాక్రేను కెలుకుతోంది… జనం చెప్పులతో కొడతారురా బాబూ అంటూ ఠాక్రే కస్సముంటున్నా వినడం లేదు… ఆ ప్రభుత్వం తమ మద్దతు మీద ఆధారపడి ఉందనే అలుసు… అదే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పట్ల అలా వ్యవహరించమనండి… జాడించి కొడతాడు… కాంగ్రెస్ గెలిచిన ఆ 18 సీట్లూ డీఎంకే పొత్తు పుణ్యమే… అందుకే ఢిల్లీకి వెళ్లగానే సోనియా అపాయింట్మెంట్ ఇచ్చేస్తుంది… కానీ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సోనియాను, రాహుల్‌ను కలవడానికి నాలుగు రోజులు ఢిల్లీలో పడిగాపులు గాసి, విఫలుడై, వాపస్ వెళ్లిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
(file photo)
Ads
ఫాఫం, తను వచ్చింది జార్ఖండ్ కేబినెట్ మార్పులు, కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీ చర్చించడానికి..! తనేమీ కాంగ్రెస్ సభ్యుడు కాదు… కాకపోతే కాంగ్రెస్‌తో కలిసి సర్కారు ఏర్పాటు చేశాడు, కలిసి ఎన్నికల్లో పోటీచేశాడు… ఆ పొత్తు ధర్మంగా కాంగ్రెస్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకున్నాడు… ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి రామేశ్వర్ పరిస్థితి కూడా అంతే, ఢిల్లీలో ఉండీ ఉండీ వాపస్ వెళ్లిపోయాడు… నిజానికి సోరెన్‌దే తప్పు… తను కన్నుగీటితే చాలు, బీజేపీ చటుక్కున సోరెన్ ఇంటి దగ్గర వాలిపోయి సర్కారుకు సై అంటుంది… అసలు జేఎంఎం నుంచే ఓ సెక్షన్‌ను చీలిస్తే ఎలా ఉంటుందో బీజేపీ ఆల్రెడీ ఆలోచిస్తోంది… బీజేపీ బూచిని చూపించి, కాంగ్రెస్ సీనియర్ నేతల్నే తన ఇంటికి రప్పించుకుంటే సోరెన్ రేంజ్ వేరే ఉండేది… తను వంగేకొద్దీ వీపు మీద ఎక్కి, కాంగ్రెస్ ఇంకా స్వారీ చేస్తుందని సోరెన్‌కు ఇంకా తెలియనట్టుంది… మహారాష్ట్ర, జార్ఖండ్ మాత్రమే కాదు, ప్రస్తుతం పంజాబ్‌లో ఓ లొల్లి, రాజస్థాన్‌లో ఇంకో లొల్లి, సీనియర్ల లేఖల లొల్లి… వీటికితోడు కాంగ్రెస్‌ను పక్కన పెట్టేసి, ప్రాంతీయ పార్టీలతో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు పవార్ ఏర్పాట్లు… ఈ స్థితిలోనూ ఇంకా కళ్లు తెరవని కాంగ్రెస్… మొత్తానికి కాంగ్రెస్ కథ మెల్లిగా కంచికే చేరుతున్నట్టుంది…!!
Share this Article