.
Nàgaràju Munnuru……. నోట్: చాలా పెద్ద పోస్టు, నాన్ సీరియస్ రీడర్స్ స్కిప్ చేయవచ్చు. == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
ప్రపంచంలో ఏ మూలకు ఏమి జరిగినా అది ప్రపంచ వాణిజ్యం మీద స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. దానిని ఇతరుల కంటే కాస్త ముందుగా (కనీసం ఒకరోజు) అంచనా వేయగలిగితే స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించవచ్చు.
Ads
ప్రపంచ వ్యాప్తంగా జరిగే సంఘటనలు పరిగణనలోకి తీసుకుని, వాటి ఫలితాలను విశ్లేషించి, భవిషత్తు పరిణామాలను అంచనా వేయగల సామర్థ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. అదెలా నేర్చుకోవాలో ఒక ఉదాహరణ ద్వారా సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇటీవల భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ లో జరిగిన సంఘటనలు, వాటి ఫలితాలు విశ్లేషించి, వాటిని స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించడానికి ఎలా ఉపయోగపడతాయి తెలుసుకుందాం.
ఏప్రిల్ 22న పహాల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అది కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకుని 26 మందిని బలితీసుకున్నారు. దీనికి ఈ ఘటనకు కారణమైన పాకిస్థాన్ తప్పకుండా మూల్యం చెల్లించాల్సి ఉంటుందనీ భారత ప్రధాని స్పష్టం చేయడంతో భారత్ వైపు నుండి బలమైన ప్రతిచర్య ఉంటుందని స్పష్టమైంది.
అది గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్, వాయుసేన దాడుల మాదిరి మోస్తరు స్థాయిలో కాకుండా ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటుందని అందరూ ఊహించిందే కాని ఎప్పుడు, ఎక్కడ, ఏరోజు అనేది తెలియదు.
మే 6న భారత్ బ్రిటన్ మధ్య ఒక మైలురాయి లాంటి వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ భారత్ పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. మే 6న సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు పడింది.
భారత్ బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) మరియు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) ఒప్పందం కుదిరింది. దీంతో భారత్ నుండి బ్రిటన్ కి చేసే ఎగుమతుల్లో 99% వస్తువులకు సున్నా టారిఫ్ వర్తిస్తుంది. అలాగే భారత్ బ్రిటన్ మీద విధిస్తున్న సుంకాలలో 90% టారిఫ్ లైన్లన్ని తగ్గుతాయి, వీటిలో 85% వరకు పూర్తిగా టారిఫ్ రహితంగా మారుతాయి. ఈ ఒప్పందాలతో రెండు దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడులు, వృద్ధి, ఉద్యోగాల కల్పన మెరుగవుతుంది.
మే 7 మధ్య రాత్రి భారత్ ఆపరేషన్ సిందూర్ మొదలు పెట్టి పాకిస్థాన్ మరియు POK లలోని 9 ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఆరోజు మార్కెట్ ముగిసే సమయానికి పాకిస్థాన్ నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాక పోవడంతో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
మే 8 సాయంత్రం నుండి పాకిస్థాన్ భారత్ మీద యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో దాడికి దిగింది. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలే కాకుండా ఆలయాలు, గురుద్వారాలు, పౌర నివాసాలు లక్ష్యంగా దాడులకు తెగబడింది.
వీటన్నింటినీ భారత్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలను బద్దలు కొట్టి ప్రతిదాడులు చేసింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో మే 8న సెన్సెక్స్ సూచీ 412, నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయాయి.
మే 9న సరిహద్దులో పగటిపూట ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా సాయంత్రం కాగానే పాకిస్థాన్ మరోసారి భారత్ మీద దుస్సాహసానికి ఒడిగట్టింది. కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు సరిహద్దు వెంబడి పలుచోట్ల వరుసగా డ్రోన్లతో దాడులకు తెగబడింది.
ఈ దాడి కోసం పాకిస్థాన్ దాదాపు 400 డ్రోన్లను ఉపయోగించగా భారత్ వాటన్నింటినీ నేల కూల్చడమే కాకుండా పాకిస్థాన్ లోని కీలకమైన సైనిక, వాయుసేన స్థావరాల మీద బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసి విమానాలు, రన్ వే లు, ఆయుధ డిపోలను ధ్వంసం చేసింది.
ముందు రోజే పాకిస్థాన్ గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన భారత్ తర్వాత రోజు పాకిస్థాన్ వాయుసేనకి చెందిన అత్యంత కీలక స్థావరాలను దాదాపు పనికిరాకుండా చేసింది. దీంతో భారత్ స్పష్టమైన పైచేయి సాధించగా భారత్ ఉపయోగించిన S-400, స్కాల్ప్ శ్రేణి క్షిపణులు, హారూప్ డ్రోన్లతో పాటు భారత్ అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, ఆకాశ్ తీర్ వంటి ఆయుధ సామర్థ్యం, యుద్ధ రంగంలో వాటి పనితనం ప్రపంచానికి చాటి చెప్పినట్లయ్యింది.
ఈ దాడిలో పాకిస్థాన్ అణ్వాయుధాలను దాచిన రెండు రహస్య కేంద్రాల మీద కూడా దాడి చేసిందని వార్తలు వచ్చాయి. (ఆఫ్ కోర్స్ భారత్ అణ్వాయుధ స్థావరాల మీద తెలిసి దాడి చేసినా కూడా బహిరంగంగా అంగీకరించదు).
దాడులు ప్రతిదాడులు కొనసాగుతూ ఉండటంతో భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం తీవ్రం కావచ్చనే భయాలు ఏర్పడడంతో మే 9న సెన్సెక్స్ సూచీ 880 పాయింట్లు, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయాయి.
మే 10న మధ్యాహ్నం అనూహ్యంగా భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కాల్పుల విరమణ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశాడు కానీ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే భారత్ చేసిన దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్థాన్ కాల్పుల విరమణ కోసం ప్రాధేయ పడటంతో భారత్ ఒప్పుకుంది.
భారత్ చేసిన దాడులతో బహుశా పాకిస్థాన్ అణ్వాయుధ కేంద్రాల వద్ద రేడియేషన్ విడుదల అవుతుంది అనే సమాచారం దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు ఒప్పుకుని ఉండవచ్చు.
మే 7 నుండి 10 వరకు భారత్ పాకిస్థాన్ మధ్య జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్ ఓడిపోవడమే కాదు కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని తెలిసింది. అదే సమయంలో భారత్ రక్షణ బలగాల సామర్థ్యం, అసమాన ధైర్యసాహసాలు, రక్షణ మేదో సంపత్తిని మరోసారి ప్రపంచానికి తెలిపింది.
అంతేకాకుండా అమెరికా F16 శత్రు దుర్భేద్యం కాదని, దానిని కూల్చగలం అని, చైనా తయారు చేసిన HQ9 గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు , క్షిపణులు ఎంత నాసిరకం అనేది, టర్కీ డ్రోన్లు పాత ఇనుప సామాన్లకి తప్ప యెందుకు పనికిరావని కూడా ప్రపంచ దేశాలకు తెలిసింది.
ఇక్కడే భారత రక్షణ రంగంలో సాధించిన ప్రగతి యుద్ధం క్షేత్రంలో వాటి అసలైన సామర్థ్యం రుజువయ్యింది. ఒక లక్ష్యాన్ని క్షిపణి 10 మీటర్ల తేడాతో చేదిస్తే అది టార్గెట్ రీచ్ అయినట్లు పరిగణిస్తారు కాని భారత్ క్షిపణులు లక్ష్యాన్ని 1-3 మీటర్ల తేడాతో చేదించాయి. దీనిని సూది మొన ఖచ్చితత్వం అనవచ్చు.
పక్కనున్న భవంతులకు, జనావాసాలకు నష్టం జరుగకుండా precision strike చేయడం, అందుకోసం భారత్ స్వంతంగా రూపొందించుకున్న శాటిలైట్ వ్యవస్థల్ని వాడుకోవడం ప్రపంచాన్ని అబ్బుర పరిచింది అనడంలో అతిశయోక్తి లేదు. దీనివల్ల ప్రపంచ ఆయుధ మార్కెట్లో భారత్ రక్షణ రంగ ఉత్పత్తుల విశ్వసనీయత పెరిగి ఆయుధ ఎగుమతులు పెరుగుతాయి.
ఇదంతా సరే, ఈ సమాచారం ఉపయోగించుకుని స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు ఎలా సంపాదించాలి చెప్పండి అంటారా? అక్కడికే వస్తున్నా…
భారత్ పాక్ స్వల్పకాలిక యుద్ధంలో భారత ఆయుధాల సామర్థ్యం ప్రపంచానికి తెలిసింది. అందువల్ల ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, ఆకాశ్ వంటి వంటి రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతాయి. ఫిలిప్పైన్స్ వద్ద ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులు ఉన్నాయి. మరో 17 దేశాలు బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కోసం ఆసక్తి తెలిపాయని సమాచారం. దీనివల్ల భారత్ లో ఆయుధాలు, రక్షణ రంగ ఉత్పత్తులు తయారు చేస్తున్న కంపెనీలకు ఆర్డర్లు పెరిగి, లాభాలు సంపాదిస్తాయి.
భారత్ లో ఆయుధాలు, రక్షణ రంగ ఉత్పత్తులు చేసే ప్రముఖ కంపెనీలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మిథాని, భారత్ ఎలక్ట్రానిక్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, మజగావ్ డాక్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, పారస్ డిఫెన్స్, అస్త్రా మైక్రో, జెన్ టెక్నాలజీస్, కల్యాణి ఫోర్జ్ ముఖ్యమైనవి. మే 8-9 తేదీలలో ఈ కంపెనీల స్టాక్ కొనుగోలు చేసినవారు సగటున 20 శాతం కంటే ఎక్కువ లాభాలు సంపాదించారు.
చాలామంది వార్తా పత్రికలు చదవడం, గంటల తరబడి టీవీల్లో న్యూస్ చూడటం వంటివి చేస్తుంటారు. ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కరలేదు. కాని వాటిని విశ్లేషించి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా లాభాలు సంపాదించడం ఏ కొద్దిమందో చేస్తారు.
Ps: ఈ సమాచారం కేవలం అధ్యయనం కోసం మాత్రమే రాయడం జరిగింది. దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించ వద్దని సూచన. అవసరం అయితే మీ పెట్టుబడి విషయాలపై నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి…
Share this Article