Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మండుతున్న కిరాణం… ధరలతో మధ్యతరగతి రణం…

November 20, 2024 by M S R

.

50-60…., 140-200…..,150-250…., 200….210… ఇవి మార్కులు కాదు.. టి20 క్రికెట్ మ్యాచ్ లో బంతులు .. పరుగులు అంతకంటే కాదు..

మనం నిత్యం వాడే ఉల్లిపాయలు, వంట నూనెలు, మినప్పప్పు, కందిపప్పు ధరలు.. సామాన్య.. మధ్య తరగతి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.. మినపప్పు.. కందిపప్పు అయితే రేసు గుర్రాలు, చిరుత మాదిరి పరుగులో ముందున్నాయి.

Ads

ఎప్పుడో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆరంభ సమయంలో మొదలయిన వంటనూనెల పెరుగుదల పాలస్తీనా మీద రాకెట్ దాడితో మరింత జోరయింది. ఎక్కడో యుద్ధాలకు మన వంట నూనెలకు లంకె ఏమిటో ఈ బాదరాయణ సంబంధం ఏమిటో సామాన్యుడికి ఎంత బుర్ర చించుకున్నా అర్ధం కాదు.

అన్నా .. క్వార్టర్ మందు 99 రూపాయలు .. లీటరు పామాయిల్ 140 మేమెలా బతికేది అని ఓ దినసరి కూలీ ఆవేదనను ఎవరు అర్ధం చేసుకుంటారు. ప్రభుత్వాలకు అంత తీరిక ఎక్కడ ఉంది. సరే ఆ సంగతి అలా ఉంచితే ఉల్లి బస్తాలు.. బస్తాలు.. కర్నూలు, బళ్ళారి మార్కెట్లలో పేరుకుంటున్నాయి.

రైతులేమో గిట్టుబాటు ధర కోసం .. కొనేవారి కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తున్నారు.. మనకేమో కిలో రూ.50 పై మాటే పలుకుతోంది.. అదేమంటే కార్తీకం మాసం, శుభకార్యాల సందడి అని కాకమ్మకబుర్లు చెబుతారు.

అనేక ఆటుపోట్లను ఎదుర్కొని పంటలు సాగు చేస్తున్న రైతుకు రూపాయిలో మూడో వంతు దక్కడం గగనమవుతోందని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ అధ్యయన పత్రం కూడా వెలువరించింది. మధ్యవర్తులకే 67 శాతం వెళ్తోందని కూడా ఆ నిపుణులు తేల్చారు.

ఇక్కడ ఇంకో సంగతి చెప్పుకోవాలి. ఒక్కో కొబ్బరి బొండాం తోటకు వచ్చి రూ.8 కి కొంటారు. వేసవి కాలమైతే రూ. 10 వస్తే అదృష్టమే అని 150 కొబ్బరి చెట్లున్న గోదావరి జిల్లా రైతు నాతో చెప్పారు. మరి మనం తాగేది రూ. 40..50 ..

ఈ వ్యాపారులు ఇంకో చిట్కా పాటిస్తారు. ఇలియానా నడుము కన్నా సన్నగా ఉన్న సీసాలో పోసి ఇస్తామంటారు (ఇవి డిజైన్ చేసిన వాణ్ని మెచ్చుకోవాలి) ఇవి రూ.50-70.. రూ.100-120 వరకు ఉంటాయి. మనం కూడా బొండాలు మోసుకెళ్లాలి. పడేయాలి.. అని సీసాలకే మొగ్గు చూపుతాం. రెండు బొండాలకు సీసా నిండిపోతుంది. మూడోది పడితే అదృష్టమే.

ఇక వంట నూనెల విషయానికి వస్తే పేరున్న రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రా.) రూ.164 ఉంటే ఈ కామర్స్ సైట్లల్లో రూ. 142 చూపిస్తోంది. మన గల్లీలో ఉండే కిరాణా దుకాణంలో ఒక రూపాయి అటు ఇటుగా ఇస్తాడు. అబ్బా రూ. పాతిక తగ్గిందనుకుంటాం.

మరి ఈ గరిష్ట చిల్లర ధర మతలబు ఏంటి. అలాగే విమ్ లిక్విడ్ రూ. 2 లీటర్ల పౌచ్ ఎమ్మార్పీ రూ.439 ఉంది. అది దుకాణంలో రూ.390 కి ఇచ్చాడు . అదే ఈ కామర్స్ సైట్ లో రూ. 304 చూపిస్తోంది. సర్ఫ్ 4 లీటర్ల ద్రావణం రూ. 504 కి ఈ కామర్స్ లో వచ్చింది. దాని ఎమ్మార్పీ రూ. 607 ఉంది.

ఇటీవలకాలంలో అమెజాన్ లో కిరాణా సరుకులు ఆర్డర్ ఇస్తే అదే రోజు ప్యాకింగ్ లేకుండా ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు. అలా ఎలా అని అడిగితే పక్కన మోర్ లోంచి తెచ్చి ఇస్తున్నామని చెప్పాడు. ఎందుకంటే పోటీ పెరిగింది, రోజుకో బుట్ట, తట్ట, పేరుతో యాప్ లు పుట్టుకొస్తున్నాయి కదా అందుకట.

పైగా ఈ కామర్స్ సైట్లు కూడా స్వంత బ్రాండ్లు, ప్యాకింగులతో సరుకులకు కొత్త హంగులు అద్దుతున్నాయి. సరుకుల ధరలు కూడా గ్రాము వంతున పేర్కొంటున్నాయి.

ఇక స్థానికంగా మేడ్చల్, కార్ఖానా, నరసరావుపేట, నంద్యాల, అమలాపురం వంటి ప్రాంతాల్లో రకరకాల పేర్లతో తయారయ్యే దీపాల నూనె ఒక లీటరు రూ. 216 ఎమ్మార్పీ ఉంది. ఇది మన పరపతిని బట్టి రూ.120 నుంచి 140 వరకు దొరుకుతుంది.

విచిత్రంగా ఈ నూనెలు రంగుసోడాల మాదిరి రంగులు ఉంటాయి. ఏ రెండు రకాలు ఒకే రకంగా ఉండవు. వీటికి కూడా ఇజ్రాయెల్ యుద్ధం నిబంధన వర్తిస్తుందట.

ఈ సీసా మీద contains rice bran oil (తవుడు నూనె) అని పేర్కొనడం విశేషం. గతంలో దేపారాధనకు నువ్వుల నూనె వాడేవారు. కొందరు ఆముదం కూడా.. కానీ వాటి ధరలు ఇప్పుడు కొండెక్కి కూచున్నాయి.

కేంద్రంలో ఆహార వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఒకటి ఉంటుందని తెల్సు కానీ దాని విధులేంటో.. అది మర్చిపోయి చాలాకాలమైంది. మన పెద్దాయన ప్రపంచ పటం దగ్గర పెట్టుకుని ఉన్న 196 దేశాల్లో ఇంకా ఏమేమి చుట్టి రావలసి ఉంది. లేదా చాలాకాలంగా వెళ్లని దేశమేదయినా ఉందా అనే పనిలో తలమునకలై ఉంటారు. ఆయన అటు వెళ్ళగానే 48 ఏళ్లలో తొలిసారి.. 33 ఏళ్లలో మెదటసారి అక్కడ అడుగుపెట్టిన.. అని పతాక శీర్షికలు వస్తాయి.

సాధారణ ఎన్నికలకు ముందు గ్యాస్ బండ రూ.200 తగ్గగానే జనం పండగ చేసుకున్నారు. అదే ఊపులో పెట్రోలు ధరలు కూడా తగ్గుతాయని ప్రచారం చేశారు. ఏ ఫలితం కనపడలేదు. అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి పెట్రోలు మీద జీఎస్టీ తగ్గించాలని, ఆ వాటా రాష్ట్రాలకు ఇవ్వాలన్న డిమాండు అలాగే ఉంది.

గత జీఎస్టీ మండలి సమావేశంలో దీని మీద చర్చ జరిగిందని ఆర్ధిక మంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఓ సభ్యుడు పొరపాటున నోరు జారాడు. వెంటనే ఖండన కూడా వచ్చింది.. లేదు.. వచ్చే సమావేశంలో చూస్తాం అని..

మూడు నెలలకోసారి జరిగే ఈ మండలి సమావేశాలు ఏంటో విహార యాత్రల మాదిరిగా ఒకసారి కాశ్మీర్ లో జరిగితే, ఇంకోసారి కన్యా కుమారిలో జరుగుతాయి ఆ మర్నాడు 20 శాతం పెరిగిన జిఎస్టి ఆదాయం అని వస్తుంది. ప్రభుత్వానికి ఈ లెక్కలు చూసుకోవడంతోనే సరిపోతోంది.

గతంలో ఎర్ర అన్నలు కాస్తో కూస్తో ధరలు పెరిగినప్పుడు జెండాలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చేవారు. ఇప్పుడు ఉన్న ఆ నలుగురూ ప్రభుత్వాలతో పనులు చేయించుకోవడంలో నిమగ్నమై ఉన్నారు.
వినియోగదార్ల మండళ్లనేవి ఉండేవి .. అపుడప్పుడూ గొంతెత్తేవి. ఇప్పుడు అవి కూడా నిద్రావస్థలో ఉన్నాయి. అయినా జనం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు.. ఏదో నిర్లిప్తత ఆవహించి, అన్నీ అలవాటై నిస్సత్తువగా జోగుతున్నారు..!!   ( By  హరగోపాలరాజు వునికిలి )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions