హర్ ఘర్ తిరంగా… ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది… 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆజాదీ అమృత మహోత్సవ్ ఘనంగా, సంబరంగా నిర్వహించుకుంటున్నాం… సోషల్ మీడియాలో డీపీలు మార్చుకుంటున్నాం… ఓ మూమెంట్ కనిపిస్తోంది… కానీ మనం ఇన్ని దశాబ్దాలుగా జాతిపితగా గౌరవిస్తున్న గాంధీ అసలు ఈ త్రివర్ణ పతాకాన్నే ఇష్టపడలేదా..? ఎగురవేయడానికి కూడా సమ్మతించలేదా..? దివైర్ అనే వెబ్‌సైట్‌లో కనిపించిన ఓ ఆర్టికల్ ఆసక్తిని, ఆలోచనల్ని రేపింది…
జర్మనీలో గొట్టింగెన్ యూనివర్శిటీ ఉంది… అందులో మోడరన్ ఇండియన్ స్టడీస్ సెంటర్ ఉండేది… అందులో శ్రీరూపా రాయ్ ఓ ప్రొఫెసర్… ఓ విభాగానికి హెడ్… “A Symbol of Freedom”: The Indian Flag and the Transformations of Nationalism, 1906-2002 అని ఓ స్టడీ పేపర్ నుంచి ఈ కంటెంట్ తీసుకున్నారు… అంతేతప్ప, దివైర్ సొంత ఆర్టికల్ కాదు…
ఆర్టికల్ కూడా ఇంటలెక్చువల్ డిబేట్ పేపర్‌లాగా… ఓ స్టడీ మెటీరియల్‌లాగా ఉంది… మన భాషలోనే సరళంగా చెప్పుకుందాం… నిజానికి జాతీయ ఉద్యమం కోసం ఓ జెండా ఉంటే బాగుంటుందని మచిలీపట్నానికి చెందిన పింగళి వెంకయ్య పలుసార్లు గాంధీని కలిసి పలు డిజైన్లను చూపించాడు… అప్పట్లో తను కాలేజీ విద్యార్థి… కానీ గాంధీకి నచ్చలేదు… ఆయన లాలా హన్సరాజ్‌కు బాధ్యత అప్పగించాడు… ఆయనేమో చక్రం గుర్తు ఉంటే బాగుంటుందన్నాడు… గాంధీకేమో చరఖా కావాలి… ఇదంతా 1921 ప్రాంతంలో…
Ads
ఎరుపు, ఆకుపచ్చ రంగులతో ఓ జెండా డిజైన్ తీసుకురావాలని గాంధీ బెజవాడ కాంగ్రెస్ సెషన్ సందర్భంగా వెంకయ్యను అడిగాడు… కేవలం 3 గంటల వ్యవధిలో వెంకయ్య ఇవ్వలేకపోయాడు… ఆ సెషన్‌లో దాన్ని ఆమోదించలేకపోయారు అలా… ఇదీ గాంధీకి ఒకరకంగా మంచిదే అనిపించింది… ముస్లింల కోసం ఆకుపచ్చ రంగు, హిందువుల కోసం ఎరుపు రంగు పెడతాం సరే, మరి ఇతర మతాలకు..? ఈ ప్రశ్నతో గాంధీ ఇతర అన్ని మతాల కోసం తెలుపును జతచేయాలని ఆలోచించారు…
ఆయన ఉద్దేశం ఏమిటంటే… ఈ రంగులు భిన్నత్వంలో ఏకత్వాన్ని, భిన్న మతాల ఐక్యతను ప్రతిబింబించాలని…! కానీ ఓ జెండా ఆ దేశంలోని మతాల్ని ఎందుకు సూచించాలి..? ముస్లింలు, హిందువులు సరే, మరి మిగతా మతాల మాటేమిటి..? సిక్కులు ఈ వాదననే లేవనెత్తారు… జెండాలో నలుపురంగు పెట్టాలన్నారు… గాంధీకి అదిష్టం లేదు… సిక్కులకూ, హిందువులకూ నడుమ వైరం లేదు కదా… ముస్లింలతోనూ అంతే కదా… ప్రత్యేకంగా ఆ రంగు ఎందుకు అంటాడు తను… అంటే వైరంతో కొట్టుకునే మతాలకే జెండాలో ప్రాతినిధ్యం కావాలా..? తద్వారా ఐక్యత, శాంతి సమకూరతాయా..? ఓ జెండాకు ఇన్ని రాజకీయ కారణాలు, ప్రయోజనాలు అవసరమా..? ఇవన్నీ అప్పట్లోనే శేషప్రశ్నలు…
సరే, 1929 నాటికి మూడు రంగులను ఖరారు చేసి, అవి స్వచ్ఛత, శాంతి, త్యాగాలకు ప్రతీకలు అని వివరణ ఇచ్చేశారు… తరువాత నెహ్రూ కూడా పార్టీ జెండా ఎలా ఉన్నా… జాతీయ జెండాలో మాత్రం ధర్మచక్రం ఉండాలనే కోరుకున్నాడు… దానికి రెండు కారణాలు… 1) రెండు వైపులా చరఖాను స్పష్టంగా ముద్రించలేం… 2) చక్రం ప్రగతికి చిహ్నం… జనవరి 26, 1947… అంటే విముక్తి ప్రకటనకు 8 నెలల ముందు ‘‘పూర్ణ స్వరాజ్ ప్రకటనను పునరుద్ఘాటించే ఓ సమావేశం’’ జరిగింది… అందులో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి గాంధీ నిరాకరించాడు… ఇలా నిరాకరించిన 12 నెలలకు ఆయన హత్యకు గురయ్యాడు…
… ఇదీ ఆ వార్త… నిజానికి పార్టీ జెండా వేరు, జాతీయ జెండా వేరు… జాతీయ జెండాను స్వాతంత్య్రానంతరం మనం అధికారికంగా ప్రకటించుకున్నాం… అది అందరిదీ, ఈ దేశానిది… ఇన్నేళ్లుగా జాతి యావత్తూ దాన్ని ఆమోదించింది, ఆవిష్కరించింది, ఇప్పుడూ అదే గౌరవాన్ని ప్రకటిస్తున్నది… కానీ ఒక పార్టీ జెండా వేరు, అది కాంగ్రెస్‌కు మాత్రమే పరిమితం… కాంగ్రెస్ జెండా రూపకల్పన నుంచి జాతీయ జెండా రూపకల్పన దాకా అనేక దశలు, అభ్యంతరాలు, సూచనలు, మలుపులు… ఏదైతేనేం… అశోకుడి ధర్మచక్రంతో కూడిన జెండా ఓ విశిష్టం… 75 ఏళ్లుగా… సగర్వంగా… ఈ దేశ సార్వభౌమత్వ ప్రతీకగా, సమున్నతంగా ఎగురుతూనే ఉంది… జెండా ఊంఛా రహే హమారా…!! (కథనం, ఇల్లస్ట్రేషన్ దివైర్ సౌజన్యం…)
Share this Article