.
ఈమధ్య ప్రతి ఒక్కరికీ అలవాటైపోయింది… ఏదైనా జరగ్గానే అదుగో బాబా వాంగ చెప్పింది, ఇదుగో నోస్ట్రాడామస్ అప్పుడే చెప్పాడు అని ఎడాపెడా రాసేయడం…
నిజానికి వాళ్లు ఏవేవో జోస్యాలు మార్మిక భాషలో రాసినట్టు చెబుతారు… వాటిని డీకోడ్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు… ఎవరికితోచిన బాష్యం వాళ్లు చెప్పుకోవడం, అబ్బో, వాళ్లు ముందుగానే భలే జోస్యం చెప్పారబ్బా అని రాసేసుకోవడం… నిజానికి వాళ్లు ఏం రాశారో ఎవరికీ తెలియకుండా పోతోంది రాను రాను…
Ads
చివరకు బాబా వాంగ ఫలానా గ్రహస్థితిని కూడా ముందే ఊహించింది అని రాసేస్తున్నాయి ఈమధ్య తెలుగు యూట్యూబ్ చానెళ్లు… పర్లేదు, ఖండించడానికి వాళ్లేమీ లేరు కదా ఇప్పుడు… ఏదైనా రాయొచ్చు ధైర్యంగా…
ఎటొచ్చీ పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా అదే బాటలో ఉండటం… WION వాడు హఠాత్తుగా ఓ స్టోరీ రాశాడు… ఏమిటయ్యా అంటే..? నోస్ట్రాడామస్ పాకిస్థాన్- ఇండియా అణుయుద్ధాన్ని ముందే చెప్పాడట… మరి తన స్టోరీకి ఓ ప్రామాణికత కావాలి కదా…
2019లో నోస్ట్రాడామస్ పేపర్ పేరిట ఓ అంతర్జాతీయ అధ్యయనం జరిగింది, అందులో పాకిస్థాన్ ఇండియా మధ్య అణుయుద్ధం జరిగే అవకాశముందని ఆ అధ్యయనం చెబుతోంది… అదుగో దాన్ని మేం మళ్లీ గుర్తు చేస్తున్నాం అని రాసుకొచ్చింది… ఆ అధ్యయన ఫలితాల్ని మళ్లీ పరిశీలించి, నిజమే సుమీ అని చెబుతోందట…
2019లో… రట్జర్స్ యూనివర్సిటీ, UCLA, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ రియో గ్రాండే, ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్, నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్, US నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ వంటి సంస్థల పరిశోధకుల బృందం చేసిందట ఈ అధ్యయనం… దీని ముఖ్య ఉద్దేశం… దక్షిణ ఆసియాలో అణు యుద్ధం విపత్తు, పరిణామాల గురించి ప్రపంచాన్ని హెచ్చరించడం అట…
ప్రపంచాన్ని రాబోయే ప్రమాదం గురించి హెచ్చరించడం వేరు, ఒకవేళ అణుయుద్ధం జరిగితే తలెత్తే విపరిణామాల గురించి చెప్పడం వేరు… ఖచ్చితంగా అణుయుద్ధం జరుగుతుందనే జోస్యం వేరు… తేడా ఉంది కదా… WION ఆ సున్నితమైన తేడాను విస్మరించి తెలుగు యూట్యూబ్ చానెళ్లలాగే రాసిపారేసింది…
ఆ అధ్యయనం బాపతు ప్రొఫెసర్ అలన్ రోబాక్ ఏమంటాడంటే… ‘‘ఇది ఆ రెండు దేశాల సమస్య కాదు… మొత్తం ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇది… ఎందుకంటే 100 ఇండియన్, 150 పాకిస్థానీ ఆటంబాంబులతో జరిగే యుద్ధం వల్ల 10 కోట్ల మరణాలు సంభవించవచ్చు… రేడియేషన్, అగ్నితుపాన్ల వల్ల మరో 5 నుంచి 12.5 కోట్ల మంది మరణించవచ్చు’’
అంతేకాదు… ప్రపంచంలో…
- 16 నుండి 36 మిలియన్ టన్నుల నల్ల కార్బన్ సూట్ స్ట్రాటోస్ఫియర్‌లోకి చేరి, సూర్యకాంతిని అడ్డుకోవచ్చు.
- ప్రపంచ సూర్యకాంతి 35% తగ్గి, భూమి 5°C వరకు చల్లబడవచ్చు.
- వర్షపాతం 30% తగ్గి, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతినవచ్చు.
- వృక్షసంపద 30%, సముద్ర ఉత్పాదకత 15% తగ్గవచ్చు.
- ఈ ప్రభావాలు కనీసం ఒక దశాబ్దం పాటు కొనసాగవచ్చు.
2017 UN ట్రీటీ ఆన్ ది ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్‌ను ఈ అధ్యయనం ఉద్ఘాటించింది.., కానీ భారతదేశం, పాకిస్తాన్ ఈ ఒప్పందంపై సంతకం చేయలేదు… వోకే, ఈ ఉత్పాతం దుష్పరిణామాలు నిజమే, ప్రమాదమే… కానీ నిజంగా నోస్ట్రాడామస్ జోస్యం చెప్పాడా ఇది..? లేక వీళ్లంతా ఆయన పేరిట ఓ హెచ్చరిక జారీ చేస్తున్నారా..? అవునూ, మన వేణుస్వామి ఈ యుద్ధంపై ఏమైనా జోస్యం చెప్పాడా..?
Share this Article