అంతే అయి ఉంటుంది… బహుశా ఇదే నిజమై ఉంటుంది… నమస్తే తెలంగాణ రాశాక తిరుగేముంది..? నిజం లేకపోతే అక్షరం కూడా రాయదు… అది రాసిందంటే పాత చారిత్రిక శిలాశాసనమే… రాజులు అంటే తండ్రుల్లాంటివాళ్లు… అందుకే రామయ్య తండ్రీ, ఓ రామయ్య తండ్రీ, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రీ అని పూజిస్తూ, గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఇన్ని వేల ఏళ్లుగా ప్రజలు తరిస్తూనే ఉన్నారు… అయితేనేం..? ఇప్పుడు లెక్కలు వేరు కదా… తెలుగు గడ్డ ఇది… రామన్న, జగనన్న, చంద్రన్న… మరి శేఖరన్న ఎందుకు కాలేదు..? కావొద్దు… ఆయన బాపు… మొత్తం తెలంగాణ సమాజానికే కొత్త బాపు… ఆ బాపు కొడుకు కాబట్టే రామన్న… సో, దేవుడైనా సరే అన్నగా అనిపించుకుని సర్దుకుపోవాల్సిందే… అది సరే, దేవుళ్లను మన ప్రాంతీయతలకు అనుగుణంగా ఓన్ చేసుకోవడం కొత్త ట్రెండ్… మరి అప్పట్లో కూడా ఇవే రాష్ట్రాలు, ఇవే జిల్లాలున్నాయా అని పిచ్చి ప్రశ్న వేసుకోవద్దు మనం, అజ్ఞానులం అయిపోతాం…
ఆంజనేయుడు తిరుమల కొండల్లోనే పుట్టాడు… అది ఫిక్స్, అది ఫైనల్… అంతే… హంపి, కిష్కింధ ఎట్సెట్రా ట్రాష్… మన తెలుగువాడు… అంతే… మరి రామాయణ కాలానికే తెలుగు పుట్టిందా..? తెలుగువాడు అనొచ్చా..? అదుగో మళ్లీ పిచ్చి ప్రశ్నలు, తిక్క సందేహాలు… మరి ఆంజనేయుడు ఆంధ్రా అయితే… మరి మన తెలంగాణ..? ఇది రాముడి కర్మభూమి… తెలంగాణ రాముడు… అంతే… ఇదీ ఫిక్స్… కర్మభూమా..? అంటే ఏమిటి అని ఇంకో చొప్పదంటు ప్రశ్న వేయకండి… కర్మ అంటే యుద్ధాలు చేయాలా..? పాలించాలా..? ఇక్కడ పర్ణశాల కట్టాడు, గోదాట్లో స్నానాలు చేశాడు, అమ్మవారితో విహరించాడు… సంకల్పం చెప్పుకున్నాడు… పద్నాలుగేళ్లలో అధికశాతం ఇక్కడే ఉన్నాడు… సో, లోకల్… నమస్తే తెలంగాణ చెప్పాక డౌటేముంది..? రాముడు తెలంగాణ లోకల్… అంతే… పైగా రామన్న… ఎవరెవరో తాజాగా రాజన్నరాజ్యం అని కలలు కంటున్నారు గానీ… ఇది ఇప్పటికే రామన్న రాజ్యం…
Ads
అవునూ, రాముడు తెలంగాణకు ఎలా వచ్చాడు..? అరె, ఇది మరో పిచ్చి ప్రశ్న… భద్రాచలం వద్ద పర్ణశాల కట్టాడు, ఇక్కడే ఉన్నాడు, శూర్పణఖ ముక్కూచెవులూ కోశాడు, రావణుడు సీతను ఇక్కడి నుంచే ఎత్తుకుపోయాడు… ఓహోహో, స్థలపురాణమా..? అయితేనేం… నమ్మకమే దేవుడు, స్థల పురాణాన్ని నమ్మితే సరి, అదే ఫైనల్, అదే హిస్టరీ… అసలు రావణుడు గనుక సీతను ఎత్తుకుపోకుండా ఉంటే రాముడికి ఈ దుర్గమ దండకారణ్యం దాటి దక్షిణాదికి వచ్చే అవసరమేమిటి..? సరే, వచ్చాడు… ఇప్పటి హంపీ వైపు నుంచి, మహారాష్ట్ర మీదుగా దండకారణ్యంలోకి ప్రవేశించాడనీ, అక్కడే కిష్కింధలో సుగ్రీవుడితో స్నేహం చేసి, వానరుల్ని సీత జాడల అన్వేషణకు పంపించాడు అని దేశమంతా నమ్ముతుంది… అక్కడి నుంచి లంకకు వెళ్లడం, లంక నుంచి నేరుగా పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్లాడని విశ్వసిస్తుంది… పోనీలే, మన తెలంగాణ రాముడే, మనదే ఆయన కర్మభూమి అని తీర్మానించేస్తే మనకు ఆనందం… లేకపోతే జగదానంద కారకా బదులుగా జగనానంద కారకా అని కొత్త పాటలు పుట్టుకొచ్చే అవకాశాలూ కలవు… సో, జై తెలంగాణ రామన్నా… జైజై…
Share this Article