ఎన్టీయార్ అన్నది పేరు కాదు, ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక… ఇది ఎన్టీయార్ కొడుకు బాలయ్య ఉవాచ… హెల్త్ యూనివర్శిటీకి ఆయన పేరు తీసేస్తే, ఆ పెద్ద మనిషిని అవమానిస్తే అది కోట్ల మందిని అవమానించినట్టే…. ఇది జగన్ చెల్లె షర్మిల ఉవాచ… ప్రపంచం ఆరాధించే పేరు ఎన్టీయార్… ఇది ఎన్టీయార్ అల్లుడు చంద్రబాబు ఉవాచ… నిజంగా జగన్ నిర్ణయం తిక్కతిక్కగా ఉందని చీదరించుకున్న తటస్థులు కూడా ఇదుగో, ఈ ఎన్టీయార్ అత్యాంతి తీవ్ర వ్యక్తిపూజ, భజనలు చూసి చిరాకెత్తిపోతున్నారు…
పోనీ, అటువైపు క్యాంపేమైనా సరిగ్గా ఉందా… లెక్కకుమిక్కిలి పథకాలకు వైఎస్ పేరు తగిలించేస్తున్నారు… ప్రతి దానికీ వైఎస్, వైఎస్… తనను మించిన తెలుగు జాతి పురుషుడు ఇంకెవరూ లేనట్టుగా… ఒక ఎన్టీయార్, ఒక వైఎస్ఆర్… వీళ్లిద్దరే తెలుగు జాతికి యుగపురుషులు, జాతిపురుషులు… వీళ్లకుముందు అసలు తెలుగు జాతికి ఓ చరిత్ర లేదు, ఉనికి లేదు… అనవసరంగా బాలయ్య శాతకర్ణి సినిమా తీసి, అప్పుడెప్పుడో తెలుగు శకం ప్రారంభమైందని చిత్రీకరించాడు గానీ… ఎన్టీయార్ పుట్టుకతోనే తెలుగు శకం ఆరంభమైందని నిర్ధారిస్తే అయిపోయేది…
ఒక ఎన్టీయార్‌కు ఒక చంద్రన్న… ఒక వైఎస్ఆర్‌కు ఒక జగనన్న… వాళ్ల పేరిట కూడా పథకాలు… మరి వాళ్లే కదా, ఆ జాతి పురుషులకు నిఖార్సైన వారసులు… వీళ్లకన్నా ముందు ఎవరివైనా తెలుగువాళ్లు పేరిట చరిత్రలు లిఖించి ఉంటే దయచేసి ఇగ్నోర్ చేయగలరు… ప్రస్తుత వివాదం, వాదోపవాదం నేపథ్యంలో… వాళ్లిద్దరే తెలుగుదనానికి మూలపురుషులు అని తేల్చిపారేస్తున్నారు… కాదంటే మర్యాదలు దక్కే పరిస్థితి లేదు మరి…
Ads
ఈ సెటైర్ కొంత హార్ష్‌గా అనిపించినా సరే… మరీ అంతగా వ్యక్తిపూజ అవసరమా..? జగన్ ఏదో కోపం మనసులో పెట్టుకుని, ఎన్టీయార్ పేరుకు కత్తెర పెట్టాడు… తనకంటూ ఓ కారణం ఉంటుంది… నిజానికి కరెక్టు నిర్ణయం కాదు, హుందాగా లేదు… ఇక దొరికింది కదానుకుని తెలుగుదేశం క్యాంపు రచ్చరచ్చ చేస్తోంది… చేస్తే చేశారు, ఎవరి పొలిటికల్ తాపత్రయం వాళ్లది…
కానీ మరీ వాళ్లిద్దరు తప్ప అంతకుముందు తెలుగు జాతే లేదన్నట్టుగా సాగే వ్యాఖ్యానాలు చిరాకెత్తిస్తున్నాయి… నన్నయ, పోతన, శ్రీనాథుడు, కృష్ణదేవరాయలు, కాకతీయులు… ఎట్సెట్రా చరిత్రల్ని ఇక తిరగరాసుకుంటే సరిపోతుందేమో..!!
బాలయ్య వ్యాఖ్యలయితే మరీ అబ్సర్డ్… తెలుగుజాతి వెన్నెముక అట, ఎన్టీయారే అనే పేరే నాగరికత అట… ఓ సంస్కృతి అట… కనీసం తనకైనా అర్థమవుతోందా తనేం చెబుతున్నాడో… బండ్ల పాల్ బాలయ్య…!! వెన్నుపోటు వేళ, చెప్పులేసిన వేళ, కుర్చీ దింపేసిన వేళ, చివరకు ఒంటరి ముసలి బతుకులో తిండి పెట్టేవాడు లేనివేళ… ఈ వెన్నెముకను, ఈ నాగరికతను చూడలేకపోయాయా ఈ కళ్లు..?! ఇదే వైఎస్ఆర్ దయతో తను హత్య కేసు నుంచి బయటపడ్డ ఆ రోజులూ, ఆ ఎపిసోడ్లు కూడా మరిచిపోయినట్టున్నాడు…
నిజానికి అందరూ జూనియర్ ఎన్టీయార్‌ను తిట్టిపోస్తున్నారు… నీలో అసలు ఎన్టీయార్ రక్తమే ఉందా… జగన్‌ను చూసి భయపడుతున్నావాా..? ఏమిటి ఆ దిక్కుమాలిన ప్రకటన..? అందులో పంచ్ ఉందా అనేది తనపై విమర్శ… ఎస్, తనిప్పుడు రాజకీయ వివాదాల్లోకి రాదలుచుకోలేదు… సింపుల్‌గా… ఆ పేరు పెట్టడం వల్ల వైఎస్ఆర్ స్థాయిని పెంచేది లేదు, ఎన్టీయార్ స్థాయిని తగ్గించేది లేదు అంటూ.., ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులే అంటూ… ఇప్పుడు నాకెందుకొచ్చిన తీట అన్నట్టుగా ఉంది ఆ ప్రకటన…
కాస్త షర్మిల నయం… జగన్ చెల్లె అయినా సరే, ఎన్టీయార్ పేరును తీసేయడం కరెక్టు కాదని ఖండితంగా చెప్పేసింది… అది ఆయన్ని అవమానించినట్టేననీ అభిప్రాయపడింది… డొంకతిరుగుడు ఏమీ లేదు… సూటిగా చెప్పింది… అతిగా విశేషణాలు ఏమీ లేకుండా ప్లెయిన్‌గా ఖండించింది…
తెలుగుతల్లి కన్నీరు కారుస్తోందనే బొడ్డు రాఘవేంద్రరావు మాటలు, దీటైన టీవీ5 వ్యాఖ్యానాలు గట్రా పట్టించుకోవాల్సిన పనిలేదు… కానీ ఏ వ్యక్తి పూజయినా అతిగా సాగితే అది వెగటు పుట్టిస్తుంది… అసలు తెలుగు జాతిలో ఇంకెవరూ స్మరణీయులు లేనట్టుగా రోజూ వాళ్ల జపమే సాగుతోంది ఇప్పుడు… ఇద్దరు నాయకులు, రెండు కులాలు, రెండు క్యాంపుల నడుమ తిట్లు, బూతులు, కొట్లాటలు, కేసులు, దాడులు, పేరు మార్పిళ్లు… ఇదేనా రాజకీయం..? జస్ట్, ఇదంతా తెలుగు ప్రజల దురదృష్టం…!!
Share this Article