అల్లు అరవింద్ పెద్ద నిర్మాతే కావచ్చుగాక… పలువురు హీరోలున్న కుటుంబం కావచ్చుగాక… మెగా కాంపౌండ్‌లోని కీలకవ్యక్తే కావచ్చుగాక… కానీ ఒక ఓటీటీ రియాలిటీ షోకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రయారిటీ ఇచ్చి, వార్తలు రాస్తుందని ఎలా అంచనా వేశాడు..? కవర్ బరువును బట్టి కవరేజీ ఉంటుందనేది కరెక్టే కావచ్చుగాక… అల్లు అరవింద్ అయినా సరే కవర్ల పంపిణీ చేపట్టాల్సిందే… కానీ ఆ కవరేజీ వస్తుందని ఆశించడం నవ్వొచ్చే అంశం…
విషయం ఏమిటంటే… ఆహా ఓటీటీలో ఇండియన్ ఐడల్ తెలుగు షో రెండో సీజన్ వస్తోంది… ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… సగటు తెలుగు వినోద చానెల్ నిర్వహించే మ్యూజిక్ కంపిటీషన్‌లను మించి ఎన్నో రెట్లు అధిక పాపులారిటీని సాధించింది… అన్‌స్టాపబుల్ అనే రియాలిటీ షో కూడా సూపర్ సక్సెస్… ఐనా సరే, మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇవేవీ పట్టవు… అసలు టీవీ వార్తలు, రేడియో వార్తలు, ఓటీటీ వార్తల్ని వాళ్లు రాయరు… కారణాలు బోలెడు…
పేరుకు పెద్ద పత్రికల్లో సినిమా పేజీలుంటయ్… వాటికి బాధ్యులుంటరు… ఎడిటర్లు, ఎండీలు ఆ పేజీల్లో ఏ వార్తలు పెడుతున్నారో పట్టించుకోరు… వాళ్లకు ఈ టీవీ, సినిమా వినోద వార్తలు అర్థమే కావు… ఆ పేజీల్లో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లదే రాజ్యం… అసలు ఇప్పుడు సినిమాలదేముంది..? మొత్తం టీవీలు, ఓటీటీల్లోనే ఉంది వినోదం… ఐనాసరే, సినిమా పేజీలు అని పెట్టుకున్నారు కదా, అంతే ఇక… ఇతరత్రా వినోద వార్తలకు చోటే లేకుండా చేశారు… విలేకరులను పిలవగానే వచ్చేసి, గబగబా రాసేసుకుని, తెల్లారి పత్రికల్లో, టీవీల్లో వార్తలు వేసేస్తారని అల్లు అరవింద్ ఎందుకలా భ్రమపడ్డాడో తెలియదు…
Ads
మొన్న ఇండియన్ ఐడల్ ఫైనలిస్టుల పరిచయం అని ఓ మీడియా మీట్ నిర్వహించారు… అందులో ఫైనలిస్టుల్ని చూపించడమే కాదు, వాళ్లతో పాటలు కూడా పాడించారు… ఇదో పైత్యం… అసలు ఫినాలేలో ఏం పాటలు పాడబోతున్నారు అనే సస్పెన్స్ ఉంటేనే ఆ షోకు మజా… పైగా ప్రెస్ మీట్‌లో ఫైనలిస్టులతో పాటలు పాడించడం దేనికి..? విలేకరులు జడ్జ్ చేసి, మార్కులు వేస్తారా..? పోనీ, టీవీ9 వంటి ఒకటీరెండు చానెళ్లు మొక్కుబడిగా కవర్ చేసినా సరే, ఈ ప్రసారం వల్ల ఫినాలే మీద ఆసక్తి చచ్చిపోలేదా..? మరి ఏం సాధించినట్టు..?
సహజంగానే మెయిన్ స్ట్రీమ్ పత్రికలు లైట్ తీసుకున్నాయి… అసలు షూటింగ్ కంటిన్యూ అవుతుందో లేదో తెలియని చిన్న చిన్న చిత్రాలకు కొబ్బరికాయలు కొట్టిన వార్తల్ని ఫోటోలతో సహా వేస్తాయి పత్రికలు… కానీ టీవీ చానెళ్ల షోలకు దీటుగా నిలబడిన ఓటీటీ సొంత కంటెంట్, వెబ్ సీరీస్‌లకు మాత్రం కవరేజీ ఉండదు… కావాలని ప్రెస్ మీట్లు పెట్టి అభ్యర్థించినా సరే… ఈ ధోరణి తప్పుడు బాటే… ఐనా మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద తలకాయలకు ఇవన్నీ తెలిస్తే కదా…
ఫస్ట్ సీజన్ ఫినాలేకు మొదట్లో బాలయ్యను తీసుకొచ్చి, బావ చిరంజీవికి కోపమొచ్చి… తరువాత బాలయ్య షోను ప్రిక్లైమాక్స్‌గా మార్చేసి, తరువాత చిరంజీవితో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు అల్లు అరవింద్… ఈసారి ఈ బాగోతం దేనికిలే అనుకున్న అరవింద్ మొదట్లోనే బాలా గాలా అని బాలయ్యతో ఓ షో చేసేశాడు… ఫినాలేకు కూడా కొడుకు బన్నీని ముఖ్య అతిథిగా పిలుస్తున్నాడు… మధ్యలో సింగర్ హేమచంద్రతో ఏదో గొడవ కాబోలు… సెమీ ఫైనల్ ఎపిసోడ్ మధ్యలోనే హేమచంద్ర మాయమైతే కాసేపు గీతామాధురే హోస్ట్ బాధ్యతల్నీ నిర్వహించింది…
ఫినాలేలో హేమచంద్ర కనిపిస్తున్నా సరే… ప్రెస్ మీట్‌లో ఫైనలిస్టుల పరిచయానికి యాంకర్ గీత స్టేజీ ఎక్కింది… సెమీ ఫైనల్‌కు జడ్జిల మార్కులే ఆధారమట… ప్రజల వోట్లేమో ఫినాలేలో విజేతను నిర్ణయిస్తాయట… ప్రేక్షకుల వోట్లే విజేతను నిర్ణయించే పక్షంలో మరిక షోకు జడ్జీలు దేనికి..? ప్రతి వారం వోట్లనే ప్రామాణికంగా తీసుకోవచ్చుకదా… ఇలా సెకండ్ సీజన్‌ను గందరగోళానికి గురిచేస్తున్నారు… పైగా గీతామాధురి అర్ధపాండిత్యం, అర్థం కాని వివరణల తలనొప్పి సరేసరి… కానీ ఈసారి మెరికల్లాంటి సింగర్స్ పోటీదారులుగా వచ్చారు… అందుకే షో రక్తికడుతోంది… సౌజన్య దాదాపు విజేత… లాస్యప్రియ, శృతి నండూరి తక్కువేమీ కాదు… వోట్లు తేల్చాలి ఎవరు విజేతో…!!
Share this Article