నో డౌట్… ఆహా ఓటీటీలో వచ్చే రియాలిటీ షోలలో సూపర్ క్లిక్కయింది బాలయ్య అన్‌స్టాపబుల్ షో… తరువాత ఆ రేంజ్ ప్రజాదరణ పొందింది ఇండియన్ ఐడల్ తెలుగు మ్యూజిక్ కంపిటీషన్ షో… నిజానికి శ్రీరాంచంద్ర హోస్ట్ చేసిన ఫస్ట్ సీజన్ బాగా హిట్టయింది… ఆ సీజన్‌లో కనిపించిన నిత్యా మేనన్, శ్రీరామచంద్రలను డిలిట్ కొట్టేసి, కొత్తగా గీతమాధురి, హేమచంద్రలను యాడ్ చేశారు…
మేల్ శ్రీముఖిలా హేమచంద్ర హైపిచ్ లేదా హెడ్ వాయిస్ అరుపులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి తప్ప మిగతా హోస్టింగ్ బాగానే ఉంది… ఎందుకోగానీ ఇప్పటికీ గీతమాధురికన్నా నిత్యాయే బెటర్ చాయిస్ అనిపిస్తుంది… కానీ థమన్ ఎందుకో గీతమాధురిని సెలక్ట్ చేసినట్టున్నాడు… నిత్యమేనన్ మొహం మీద వైరాగ్యం దేనికో మరి… గీతను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందో కూడా ఏదో వివరణ ఇచ్చినట్టున్నాడు ఎక్కడో…
Ads
సరే, ఏ రాయయితేనేం… టీం కుదిరింది… సెకండ్ సీజన్‌లో ఫస్ట్ సీజన్‌కన్నా స్వరముత్యాలు దొరికాయి… రక్తికడుతోంది షో… ఏక్‌సేఏక్ పాడుతున్నారు కంటెస్టెంట్లు… ఫస్ట్ సీజన్‌లో కూడా వాగ్దేవి, వైష్ణవి అదరగొట్టినా సరే… సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి టఫ్ కంపిటీషన్ కనిపిస్తోంది… ప్రత్యేకించి అమెరికా నుంచి ఈ పోటీల కోసమే వచ్చిన డాక్టర్ నండూరి శృతి… పెళ్లయి, తల్లయినా మంచి స్వరమాధుర్యంతో, సాధనతో ప్రతి పాటనూ మెప్పిస్తున్న భాగవతుల సౌజన్య… తక్కువ వయస్సులోనే ఇరగ్గొడుతున్న కార్తికేయ… ఛాలెంజింగ్ పర్‌ఫార్మర్ సాకేత్… సిద్దిపేట అమ్మాయి లాస్యప్రియ… చిన్న వయస్సులోనే తన స్వరజ్ఞానంతో మెప్పిస్తున్న అయాన్ ప్రణతి… ఈ ఆరుగురూ ప్రస్తుతానికి టాప్‌లో ఉన్నట్టున్నారు…
ఇక్కడ చెప్పుకోవల్సింది ఏమిటంటే… ఇతర మ్యూజిక్ కంపిటీషన్ షోలతో పోలిస్తే… ఈ ఇండియన్ ఐడల్ బాగుంటోంది… థమన్, కార్తీక్ కూడా పర్‌ఫార్మెన్స్‌లో తప్పులుంటే నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు, సవరిస్తున్నారు… అదేకదా మరి జడ్జిలు చేయాల్సింది… అయితే… గీతమాధురి తీర్పులను పక్కన పెడితే… థమన్, కార్తిక్ నిర్ణయాలు, తీర్పులు సరిపోవా..? ఇంకా ప్రేక్షకుల వోట్లు దేనికి..? అది అనవసర తంతు కాదా..?
ఒక మ్యూజిక్ కంపిటీషన్ షోను కూడా చివరకు బిగ్‌బాస్ తరహా ప్రహసనంగా మార్చడం దేనికి..? ఈ వోట్ల ప్రయాస, ప్రహసనం షో పట్ల పాపులారిటీని ఏమీ పెంచదు… ఆ వోట్ల సంఖ్యతో ఆహా ఓటీటీకి ఒరిగేది కూడా ఏమీలేదు… పైగా జడ్జిలు అక్కడే కామెంట్స్ పాస్ చేశాక, ఆ ప్రభావం ఖచ్చితంగా కంటెస్టెంట్లకు పడే వోట్లపై పడుతుంది… కాకపోతే ఇక్కడ జరిగే నష్టం ఏమిటంటే… కంటెస్టెంట్లకు పాటలు ఇవ్వడం, సాధన చేయించడం, ఒక్కో ఎపిసోడ్‌కు ఒక విశేషాన్ని సమకూర్చడం… కంటెస్టెంట్లు దానికి తగినట్టు సంగతులు, నోట్స్ చూసుకోవడం కోసం వారిని ఎటూ పోనివ్వడం లేదు…
వాటిని విడిచిపెట్టి ఇక కంటెస్టెంట్లు వోట్ల వేటలో, బిగ్‌బాస్ తరహాలో సోషల్ మీడియా ప్రమోషన్ సంస్థలకు డబ్బులిచ్చి, వోట్లను వేయించుకోవడం మీదే దృష్టి పెట్టాలా..? నాన్సెన్స్, అబ్సర్డ్… ఏవో అలవోకగా పాడే పాటల్ని గాకుండా ఒక్కో ఎపిసోడ్‌కు ఒక్కో థీమ్ ఇస్తున్నారు… ఉదాహరణకు కోటి వస్తే తన పాటలు, చంద్రబోస్ వస్తే తన పాటలు పాడిస్తున్నారు… ఆ మొహమాటాలు, వ్యక్తి భజనలు, మర్యాదలు అవసరం లేకుండా జడ్జిలకిష్టమైన, క్లిష్టమైన పాటల్ని ఇచ్చి, వాళ్ల ప్రతిభను పరీక్షించడం బెటర్ కాదా..? ప్రోగ్రామ్ మరింత రక్తి కట్టేది…
ఐనా ఏముందిలెండి… ఎవరెలా పాడినా చివరకు థమన్ ఏ పేరు పక్కన టిక్ కొడితే వాళ్లే కదా విజేతలు… ఈమాత్రం దానికి ఈ వోటింగు ప్రయాస దేనికి అల్లు అరవింద్ భాయ్…? ఈ వోటింగు పద్ధతి, ప్రహసనం, నాటకం హిందీ ఇండియన్ ఐడల్ షోలో కూడా ఉంది కాబట్టి తెలుగులోనూ ఆ వాతలు అవసరమా చెప్పు…!!
Share this Article