Psy Vishesh …….. సెలెబ్రిటీలు బ్రతికుండగానే చంపేస్తున్న సోషల్ మీడియా వాడకందారులు ఇవ్వాళ కోట శ్రీనివాసరావు గారిని చంపేశారు. పాపం ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Episode 1- Greed: సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలన్న అత్యాశతో ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి, భర్తతో విడిపోయి, బాస్ పక్కకు చేరిన రేఖ అనే యువతి కథ. జీవితంలో జరిగే ప్రతీ సంఘటననూ సోషల్ మీడియాలో ఎక్కిస్తూ, సోషల్ మీడియా కోసమే బ్రతికేస్తూ, సోషల్ మీడియా సెలబ్రిటీ కావాలని డబ్బు తగలేసి, ఈఎంఐలు కట్టలేకపోతుంది. ఆ విషయమై భర్తతో గొడవపడి, విడిపోయి… చివరకు తనపై కన్నేసిన బాస్ వశమవుతుంది.
Episode 2- Rage: అనాలోచితంగా చేసే వాట్సప్ ఫార్వర్డ్ లు కృష్ణమూర్తి అనే రిటైర్డ్ ఉద్యోగి జీవితాన్ని ఎలా నాశనం చేసిందనే కథ. అందరూ తనలానే నిక్కచ్చిగా ఉండాలని కోరుకునే కృష్ణమూర్తి తప్పు చేసిన ఓ కుర్రాడిపై చేయిచేసుకుంటాడు. పగబట్టిన ఆ కుర్రాడు కృష్ణమూర్తి గురించి ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది వైరల్ అవుతుంది. దానివల్ల కృష్ణమూర్తిపై దాడి జరుగుతుంది. ఫలితంగా అతను మానసికంగా కుంగిపోయి సైకియాట్రిస్ట్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Ads
అందుకే సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ ఫార్వర్డ్ చేసేముందు రెండు వేల ఏళ్ల కిందట అరిస్టాటిల్ అడిగిన మూడు టెస్ట్ లు పాసవుతుందో లేదో చూసుకోండి.
1. Is it true?
2. Is it good?
3 .Is it useful?
ఆ పోస్ట్ ఈ మూడు టెస్టులూ పాసయితే షేర్ చేయండి, పాస్ కాలేదంటే వదిలేయండి. తప్పుడు పోస్టులు మాత్రం ఫార్వర్డ్ చేయకండి.
Episode 3- Betrayal: మన ఫోన్ నుంచి ఒక్క రాంగ్ పోస్ట్ వెళ్తే చాలు… అది జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పే కథ. సోషల్ మీడియా పరిచయాలతో, ఆన్ లైన్ చాట్ లతో ప్రేమలో పడి, అదే నిజమనుకుని మోసపోయిన విద్య… తన ప్రియుడు వరుణ్ కీ, తన క్లోజ్ ఫ్రెండ్ ప్రియకూ సంబంధం ఉందని అనుమానపడి… ఒక తీవ్రవాద సంస్థను సపోర్ట్ చేస్తున్నట్లుగా ప్రియ మొబైల్ నుంచి మెసేజ్ పెడుతుంది. దాంతో పోలీసులు ప్రియను అరెస్టు చేస్తారు. తండ్రికి అవమానం జరుగుతుంది. అతను కోప్పడతాడు, ప్రియ ఆత్మహత్యాయత్నం చేస్తుంది, చివరకు ఊరు వదిలి వెళ్లిపోవాల్సి వస్తుంది. అందుకే మీ ఫోన్ ఎవ్వరికీ ఇవ్వకండి.
Episode 4: L-st: సోషల్ మీడియాలో అమ్మాయి కనిపిస్తే చాలు పులిహోర కలిపే పులిరాజాల కథ ఇది. పెళ్లయి బిడ్డ ఉన్న రాఘవన్ అనే వ్యక్తి డేటింగ్ సైట్ లో ఓ అమ్మాయికి గాలమేస్తాడు. చివరకు ఓ ముఠా చేతిలో కిడ్నాప్ కు గురవుతాడు. అతని కుటుంబం పది లక్షలు సమర్పించుకోవాల్సి వస్తుంది.
Episode 5: Vengeance: ఫోన్లో అడ్డమైన ఫొటోలు, వీడియోలు పెట్టుకుంటే, అలాంటి ఫోన్ హ్యాక్ అయితే కొంప కొల్లేరవుతుందని చెప్పే కథ. సంజయ్ అనే ఫిల్మ్ స్టార్ ఫోన్ ను హ్యాక్ చేసి, అందులోని ఫొటోలను అతన్ని బ్లాక్ మెయిల్ చేసి, అతను చేసిన తప్పులన్నీ ఒప్పించి ప్రతీకారం తీసుకుంటాడు ఓ అజాత వ్యక్తి. సంజయ్ కెరీర్ మొత్తం నాశనమై పోతుంది. తప్పు చేయడమే తప్పయితే, దాన్ని మళ్లీ ఫోన్ లో రికార్డు చేయడం మరింత పెద్ద తప్పని అర్థమయ్యేలా చెప్తుందీ ఎపిసోడ్. అందుకే జరంత జాగ్రత్తగా ఉండండి… మీ మొబైల్ ఫోన్ ను జరంత జాగ్రత్తగా వాడండి ఫ్రెండ్స్.
Share this Article