.
భూమికి చంద్రుడు మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలో మీటర్ల దూరంలో ఉన్నా… చాలా దగ్గరివాడు. భూలోకవాసులందరికీ చంద్రుడు మామ- చందమామ.
దేవదానవులు అమృతం కోసం వాసుకి మహా సర్పాన్ని తాడుగా చుట్టి… మంథర పర్వతాన్ని చిలికినప్పుడు… అమృతం కంటే ముందు లక్ష్మీ దేవి… ఆమెతో పాటు చంద్రుడు వచ్చారు. అమ్మ సోదరుడు కాబట్టి అలా మనకు చంద్రుడు మేనమామ అయి… జగతికి చందమామ అయ్యాడు.
Ads
- “చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యో అజాయత
ముఖా దింద్రశ్చాగ్నిశ్చ ప్రాణా ద్వాయు రజాయత”
అని అంటుంది పురుష సూక్తం. మనసుకు చంద్రుడు అధిపతి. కంటికి సూర్యుడు అధిపతి. విరాట్ పురుషుడి మనస్సు నుండి చంద్రుడు, కళ్ల నుండి సూర్యుడు, ప్రాణం నుండి ప్రాణవాయువు పుట్టాయట.
అందుకే అమావాస్యకు, పౌర్ణమికి మనసు సముద్రంలా ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. కొంచెం మానసిక సమస్యలున్నవారిలో ఈ సమస్య మరీ కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది.
ప్రేయసీ ప్రియులకు వెన్నెల మరింత మనోరంజకం.
పిండి వెన్నెల, పండు వెన్నెల, వెండి వెన్నెల కవులకు వర్ణనీయ వస్తువు.
వెన్నెల భోజనం- మూన్ లైట్ డిన్నర్ ఒక భోగం.
చకోర పక్షులు వెన్నెలను మాత్రమే తిని బతుకుతూ ఉంటాయి. వెన్నెల లేని రాత్రుళ్ళలో నిరాహార దీక్షలు చేస్తూ నిండు పున్నమి కోసం నిరీక్షిస్తూ ఉంటాయి. ఆ నిరీక్షణే- “చకోర పక్షుల్లా ఎదురు చూడడం” అన్న సామెత అయ్యింది.
“భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాశాః శిరోద్యౌర్ముఖమపి …”
అంటుంది విష్ణు సహస్రనామం. విష్ణువు ఒక కన్ను చంద్రుడు; మరొక కన్ను సూర్యుడు. “సృష్టి అగ్నిసోమాత్మకం” అంది వేదం. అంటే వేడి- చలువల కలయికలతోనే సృష్టి ఏర్పడింది.
సూర్యుడి వెలుగు, వెచ్చదనంతో కిరణజన్య సంయోగ క్రియగా చెట్ల ఆకులు పత్రహరితం పచ్చదనాన్ని తయారు చేసుకున్నట్లే…
చంద్రుడి వెన్నెల కిరణాల చల్లదనం ధాన్యానికి ఔషధ గుణాలను అద్దుతుంది. పంట బాగా పండాలంటే సూర్యుడెంత ముఖ్యమో…చంద్రుడూ అంతే ముఖ్యం.
మనసు నెమ్మది కావడానికి వెన్నెల టానిక్.
మనసు మరులుగొనడానికి వెన్నెల ఉత్ప్రేరకం.
జగతి చల్లబడి హాయి నిండడానికి,
రేయి పండడానికి వెన్నెల అవసరం.
అలాంటి చంద్రుడిపై శాశ్వతంగా ఇల్లు కట్టుకుని కాపురాలుండే రోజులొస్తున్నాయని చైనా శాస్త్రవేత్తలు ఆశ కలిగిస్తున్నారు. తాజాగా చంద్రధూళి, ఆక్సిజన్ కలుపుతూ నీటిని సృష్టించే ప్రయోగం చైనాలో విజయంతమయ్యింది.
చంద్రుడిపై స్థిరనివాసం కలను నిజం చేయడంలో ఇది తొలిమెట్టు అని చైనా శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుడిపై సుదీర్ఘకాలం ఉండి… అంతరిక్ష పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు భూమిపై నుండి నీటిని పంపాలంటే లీటరుకు 19 లక్షల ఖర్చు. పైగా విపరీతమైన సాంకేతిక శ్రమ.
అదే చంద్రుడి మీద లభ్యమయ్యే టైటానియం ఐరన్ ఆక్సయిడ్ ధాతువు, కార్బన్ డై ఆక్సయిడ్ కలిపి నీటిని సృష్టిస్తే అయిన ఖర్చు నామమాత్రం. ప్రస్తుతానికి ఈ ప్రయోగంలో భాగంగా ల్యాబ్ లో చాలా తక్కువ పరిమాణంలో నీటిని, ఆక్సిజన్ ను సృష్టించారు. పెద్ద ఎత్తున తయారుచేయడానికి ఇంకా సమయం పడుతుంది.
ఇదే కనుక సఫలమైతే… కోకాపేట ఎకరా వంద కోట్ల ఆకాశహర్మ్యాలను ఎడమకాలితో తన్ని… బకరాలకు వదిలి… చందమామపై గేటెడ్ కమ్యూనిటీలో విల్లా కొనుక్కోవచ్చు! చందమామపై హైరైజ్ టవర్లో అపార్ట్ మెంట్ కొనుక్కుని… బాల్కనీ వెన్నెల్లో బట్టలారేసుకోవచ్చు!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article