జగన్ ప్రధానికి లేఖ రాశాడట… వెంటనే కృష్ణా ప్రాజెక్టుల మీద సీఐఎస్ఎఫ్ భద్రత ఏర్పాటు చేయాలన్నాడట… తెలంగాణ మీద కస్సుబుస్సు అంటున్నాడట… తెలంగాణలో ఏపీవాళ్లు ఉన్నారని సంశయిస్తున్నాడు గానీ లేకపోతేనా..? పోలీస్ పహారాలు, గరంగరం, ఉద్రిక్తత… ఇలా నీళ్లు-నిప్పులు అంటూ మీడియా, పొలిటిషియన్స్ డిబేట్లలో దంచికొడుతున్నారు… కాస్త వేరే కోణంలోకి వెళ్దాం… అప్పుడెప్పుడో చంద్రబాబుకూ కేసీయార్‌కూ పడలేదు… రాజకీయంగా డిష్యూం డిష్యూం… అప్పట్లో సేమ్ ఇదే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఓసారి… తూకిత్తా అంటే తూకిత్తా అనుకున్నారు… తరువాత చంద్రబాబు తెలంగాణను అనివార్యంగా వదిలేసి అమరావతికి వెళ్లిపోయాక మళ్లీ ‘‘కృష్ణాజలాల మంటలు’’ ఏమీ కనిపించలేదు… మళ్లీ ఇప్పుడే కనిపిస్తున్నయ్… ఎందుకు..? జగన్-కేసీయార్ నడుమ మంచి సంబంధాలే ఉన్నయ్… తెర మీద ఏమేం మాట్లాడుకున్నా, నిజానికి ఉభయ శ్రేయోభిలాషులే… మరెందుకు ఈ లొల్లి..? ఇన్నాళ్లూ కళ్లుమూసుకుని తెలంగాణ రాయలసీమ లిఫ్టు మీద, ఆర్డీఎస్ కాల్వ మీద, పోతిరెడ్డిపాడు పొక్క మీద మాట్లాడని కేసీయార్ సర్కారు ఇప్పుడే హఠాత్తుగా గొంతు పెంచిందేం..? అంటే మనకు బయటికి అర్థం కాని ఏదో రాజకీయ ప్రయోజనమో, తాత్కాలికంగా జనం దృష్టిని అటువైపు మళ్లించి, ఎమోషన్స్ పెంచడమో అయిఉండాలి… అంతేనా..?!
నిజానికి వాటర్ ఇష్యూస్ లేవా..? ఎందుకు లేవు..? ఉన్నయ్..! నీళ్లు తక్కువ… అవసరాలు ఎక్కువ… ఇప్పుడైతే అసలు ఇన్‌ఫ్లోలు స్టార్ట్ గాకుండానే పవర్ జనరేట్ చేస్తున్నారు మీరు, దాంతో వాటర్ లెవల్ పెరగదు, మా సీమ ప్రాజెక్టులకు నీళ్లు ఎలా తీసుకుపోవాలి, కరెంటు కావాలంటే వేరే మార్గాల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు కానీ నీళ్లను ఉత్పత్తి చేయగలమా అనేది ఏపీ వాదన… నిజం… కానీ నీళ్లున్నప్పుడే కదా కరెంటు ఉత్పత్తి చేసుకునేది, చీపెస్ట్ గ్రీన్ పవర్ అది, నా హక్కు ప్రకారం నేను జనరేట్ చేసుకుంటున్నా, మధ్యలో నీ లొల్లి ఏందివయా అనేది తెలంగాణ దృక్కోణం… అదీ నిజమే… ఇదేకాదు, వాటాల వాడకం, కొత్త ప్రాజెక్టులు, నీటి లభ్యతను బట్టి వాడకంలో మార్పులు వంటి అనేకాంశాలు ఎప్పుడూ ఏదో ఓ సమస్యను క్రియేట్ చేస్తూనే ఉంటయ్… (రాష్ట్ర విభజనవేళ ఈ ప్రాజెక్టుల పంపకమే అత్యంత గందరగోళం…) ఏపీ, తెలంగాణ నడుమ ఈ వివాదాలకు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణే ఒక మంచి పరిష్కారం… అది జగన్-కేసీయార్ నడుమ లేకుండా పోలేదు, మరీ పోలీసుల పహారా, కేంద్ర బలగాల కోసం ఏపీ అభ్యర్థన దాకా పోవడం ఏమిటి..?
Ads
అంతటి కావేరి వంటి జలదావానలం విషయంలోనే కేంద్రం ఏమీ చేయలేకపోయింది… చేయలేదు కూడా… ఏదో ఒక రాష్ట్రానికి అనుకూలంగా సైడ్ తీసుకోలేదు… సుప్రీం కూడా ట్రిబ్యునల్ తీర్పులే ఫైనల్ అంటుంది… కానీ నీళ్లు సరిపడా లేనప్పుడు, ఎప్పుడు, ఎంత నీరు, ఎవరు, ఎలా వాడుకోవాలో ఎవరు నిర్దేశించాలి..? ఇప్పుడు తెలంగాణ-ఏపీ నడుమ కూడా ఇదే కదా పంచాయితీ… సీఐఎస్ఎఫ్ బలగాల్ని పెడతారు సరే, వాళ్లేదో భద్రత కల్పిస్తారు సరే కానీ కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు..? దీనికి కృష్ణా బోర్డు ఒకటి ఉంది… అసలు దాని అధికార పరిధి ఏమిటో ఎవరికీ తెలియదు… సాక్షాత్తూ ప్రధాని, ఇద్దరు ముఖ్యమంత్రుల్ని కూర్చోబెట్టి మాట్లాడినా ఇలాంటి జలవివాదాలు ఎప్పుడూ తెగవు… నీళ్ల పంచాయితీలే అలాంటివి… కృష్ణా బోర్డు సీమ లిఫ్టు ఆపేయాల్సిందే అని చెబితే ఏపీ సర్కారు వింటుందా..? వినకపోతే బోర్డు ఏం చేయగలదు..? సో, దీనికి ఒక అత్యుత్తమ పరిష్కారం… రివర్ బేసిన్ అథారిటీలు… మోడీ ప్రభుత్వానికి జలవివాద పరిష్కారాలపై ఏ సోయీ లేదు కాబట్టి ఈ దిశలో ప్రయత్నాలూ లేవు… అప్పుడెప్పుడో ఉమ్మడి ట్రిబ్యునళ్లూ ఇంకేదో అన్నారు గానీ ఇంచు కూడా కదల్లేదు ఆ కొత్త ప్రతిపాదనలు…
రివర్ బేసిన్ అథారిటీలు అంటే… ఆ నదీ పరీవాహక ప్రాంతం మొత్తానికి అథారిటీ, దానికి ట్రిబ్యునల్‌కు ఉన్న జుడిషియల్ పవర్స్ ఇవ్వాలి, ఆయా రాష్ట్రాల అధికార్లు ఉండకూడదు… అంతర్రాష్ట్ర జలవిభాగాల్లో పనిచేసి, ఈ వివాదాల తీరు తెలిసిన చీఫ్ ఇంజనీర్లు ఉండాలి… తులసితీర్థం పోసినట్టు ఓ రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఓ రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, డేటా విశ్లేషకులు, సొంత పర్యవేక్షకులు గట్రా ఉండాలి… ఆ రివర్ బేసిన్‌లో కొత్త ప్రాజెక్టుల దగ్గర నుంచి, వరద నియంత్రణ, నీటివాడకం తీరు దాకా అన్ని అంశాల్లో అది చెప్పిందే ఫైనల్… వాటి పైన సుప్రీంకోర్టు, పార్లమెంటు అంతే… రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాల్సిందే, లేకపోతే కోర్టు ధిక్కారంగా పరిగణించాలి… కానీ నీరు వంటి అత్యంత కీలకమైన సబ్జెక్టును ఏ పార్టీ కూడా వదులుకోదు కదా, అందుకే ఇలాంటి ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరూ ఆలోచించరు… ఇదంతా పెద్ద తంతు, సాధ్యాసాధ్యాలు పెద్ద చిక్కుముడి, తక్షణం ఏం చేయాలీ అంటారా..? ఏం చేయాలో ఇద్దరు సీఎంలకూ తెలుసు… నీళ్లలో నిప్పు కదా, ఊరకే పుట్టదు, వాళ్లే ఆర్పేస్తారు..!! ఆఫ్టరాల్… క్షిపణులు, జెట్ ఫైటర్లు మొహరించి మరీ చైనా, ఇండియా సరిహద్దుల్లో నెలల తరబడీ ముఖాముఖి నిలబడి, తరువాత ఎవరి జాగాలకు వాళ్లు వెళ్లిపోయారు…!
Share this Article