———————–
అమెరికాలో అయితే ప్రతి ఇంట్లో పెద్ద తుపాకులు, చిన్న పిస్టల్స్ ఉంటాయి. పిల్లలుకూడా సరదాగా తుపాకులతో ఆడుకుంటూ ప్రాణాలను తీసిపారేస్తూ ఉంటారు. అమెరికాలో బొమ్మ తుపాకులు అసలు ఉండనే ఉండవు- అడుగడుగునా అసలు సిసలు తుపాకులే అని మనం తెగ ఇదయిపోతుంటాం. ఆయుధాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేనికి ఉపయోగిస్తున్నారు? అన్నదే ప్రధానం. డాక్టరు చేతిలో కత్తి రోగి ఛాతీని నిలువునా కోస్తే- వైద్యం. అదే మనం కోస్తే అక్షరాలా హత్య. తుపాకి పోలీసులు, సైన్యం చేతిలో ఉంటే శాంతి భద్రతల పరిరక్షణలో భాగం. మన చేతిలో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం.
Ads
ఆదిలాబాద్ లో అదే జరిగింది. ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గర పిస్టల్ ఉంది. ఒక చిన్న గొడవ చినికి చినికి గాలివాన అయ్యింది. అంతే తుపాకీ బయటికి వచ్చింది. అదృష్టం కొద్దీ ఈరోజుల్లో మన నెత్తిమీదే హిరోషిమాను మించిన అణుబాంబు చెప్పి మరీ పేలుతున్నా సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించే ఆరాటం, నేర్పు అలవాటయ్యింది కాబట్టి ఔత్సాహికులు ఎవరో ఈ ఆదిలాబాద్ కాల్పులను తాపీగా షూట్ చేసి వెంటనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. లేకపోతే నా కాల్పులను వక్రీకరించారు అని ఆ ఆసామి చెప్పుకునేవాడు.
యాభై ఏళ్ల కిందట ఒక సాహితీ సంకలనానికి ప్రఖ్యాత కథారచయిత మధురాంతకం రాజారామ్ కథా శిల్పం గురించి రాశారు. కథ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్నది అందులో విషయం. కథలో వర్ణనలు ఎంతవరకు ఉండాలి? అన్న సందర్భంలో ఫలానా ఆయన కూర్చున్నాడు. ఆయన వెనుక గోడమీద తుపాకీ వేలాడుతోంది- అని వర్ణిస్తే… కథ అయిపోయేలోపు ఆ తుపాకీని వాడాలట. లేకపోతే పాఠకుడికి ఆ తుపాకీ గురించి సమాచారం ఎందుకు? అనవసరంగా ఈ తుపాకి ఎప్పుడు పేలుతుందో అని పాఠకుడు భయపడి చస్తూ చదువుతూ ఉంటాడు కదా? అన్నది మధురాంతకం ప్రశ్న.
మధురాంతకం ఎప్పుడో రాసిన కథా శిల్ప శాస్త్రం ఈ ఆదిలాబాద్ ఆసామి చదివి ఉండకపోవచ్చు. కథలో అయినా, నిజంగా అయినా తుపాకీ అంటూ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వాడాల్సిందే.
ప్రజా ప్రతినిధులను రక్షించడానికి ప్రభుత్వం గన్ మెన్లను ఏర్పాటు చేస్తుంది. గన్ మెన్ కంటే గన్నే ఉండడం భద్రమనుకుంటూ ఉంటారు కొందరు. తూటా ఎప్పుడయినా ప్రాణం తీస్తుందేకానీ ప్రాణం పోయలేదు.
“ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా?
ఆయువు పోస్తుందా ఆయుధమేధైనా?
రాకాసుల మూకల్లె మార్చదా పిడివాదం?
రాబందుల రెక్కల సడి ఏ జీవన వేదం?
సాధించేదేముంది ఈ వ్యర్థ విరోధం?
ఏ సస్యం పండించదు మరు భూముల సేద్యం!
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం..
ఈ పూటే ఇంకదు అందాం!
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం!”
ఇటీవలి కంచె సినిమాలో సరిహద్దులను చెరిపి గొంతెత్తిన సిరివెన్నెల గీతమిది.
వినేదెవరు?
విని అర్థం చేసుకునేదెవరు?
అర్థం చేసుకుని ఆయుధాన్ని పక్కన పెట్టేదెవరు?
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article