Nallamothu Sridhar Rao “మహిళలూ మీరు సిగిరెట్ తాగితే మగవాళ్లతో సమానంగా స్వేచ్ఛ పొందినట్లే” – ఒక యాడ్ మనుషుల్ని ఎంత కండిషనింగ్ చేస్తుందంటే –
ఇది 1911లో జరిగిన ఓ సంఘటన. Lucky Strike అనే ఓ సిగిరెట్ కంపెనీ తన సేల్స్ పెంచుకోవాలని ప్రపంచంలోనే మొట్టమొదటి ఓ PR వ్యక్తిని సంప్రదించింది.
మహిళలకు సిగిరెట్స్ అలవాటు చేస్తే.. పరోక్షంగా అమ్మకాలు పెరుగుతాయన్న ఐడియా అతనికి వచ్చింది.
Ads
అప్పటిదాకా సిగిరెట్ తాగడం అంటే తప్పుడు అలవాటుగా మహిళలు భావించేవారు, కొద్దిశాతం మందికి అలవాటు ఉన్నా, బహిరంగ ప్రదేశాల్లో సిగిరెట్ తాగితే చులకనగా చూస్తారనే భయం ఉండేది.
“ఎలాగైనా దీన్ని మార్చాలి.. ఎలా?” అని అతను వ్యూహరచన చేశాడు.
ఆ Lucky Strike సిగిరెట్స్ ఆకుపచ్చని రంగులో ఉంటాయి. మొదట ఆ రంగుని పాపులర్ చేయాలి. అందుకే ఆ సంవత్సరం ఫ్యాషన్ సీజన్‌లో “గ్రీన్ బాల్ క్యాంపెయిన్” అనే థీమ్‌తో ఫ్యాషన్ షోలు నడిచేలా ప్రభావితం చేశారు. ఇప్పుడు ఆ సిగిరెట్స్ ఉన్న కలర్ అందరి మనస్సుల్లో ముద్రించుకుపోయింది.
Green Gala అని బాగా పేరున్న వాళ్లని పిలిచి ఓ భారీ పార్టీ నిర్వహించారు. అది మీడియాలో చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అందరూ దాని గురించి చర్చించడం మొదలుపెట్టారు. ఆ పార్టీలో ఓ కొత్త ఉద్యమాన్ని మొదలుపెట్టారు.
“పురుషులకి సమానంగా మహిళలు స్వేచ్ఛగా ఉండడం గురించి ఓ ర్యాలీ నిర్వహించాలని” ప్రతిపాదించారు. అందులో పురుషులకి సమానంగా మహిళలు సిగిరెట్ తాగడం ఓ థీమ్‌గా నిర్ణయించారు.
ఇంకేముంది.. పురుషాధిక్య సమాజంలో పురుషులకి సరిసమానంగా తమని తాము భావించుకోవాలంటే సిగిరెట్ పట్టుకుని తిరగాలనే కొత్త అలవాటు అక్కడ మొదలైంది.
ఇక్కడ అడ్వర్‌టైజింగ్ గురించి చెప్పాలి..
“స్వేచ్ఛ లేకపోవడం” అనేది మహిళల యొక్క ఎమోషనల్ ట్రిగ్గరింగ్ పాయింట్ అయితే..
దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు… ఆ స్వేచ్ఛని పొందగలుగుతారు అనే ఆశని చూపి ఆడవాళ్ల మైండ్‌ని ఎంతైనా కండిషనింగ్ చేయొచ్చు.
మొహం మీద ఓ చిన్న మొటిమ వస్తే చాలు.. అద్దంలో మళ్లీ మళ్లీ చూసుకుని చాలా కుంగిపోతుంటారు చాలామంది మహిళలు. ఈ క్రీమ్ రాస్తే మొటిమలు గంటల్లో మటుమాయం అని మభ్యపుచ్చి దశాబ్ధాల తరబడి బ్యూటీ రంగంలో ఎన్నో ఉత్పత్తులు ఆ ఎమోషనల్ విషయాన్ని క్యాష్ చేసుకున్నాయి.
అంతెందుకు.. మీరు హైదరాబాద్ కూకట్‌పల్లి, లకడీకాపూల్ వంటి ఏరియాల్లో వెళుతుంటే.. మెట్రో పిల్లర్స్ మీద.. “నడుంనొప్పా అశ్రద్ధ చేయకండి.. అది ప్రాణాంతకం కావచ్చు” అని అడ్వర్‌టైజ్‌మెంట్లు కనిపిస్తాయి. ఓ మామూలు నడుంనొప్పిని కూడా ప్రాణం పోతుంది అనే ఎమోషన్‌తో ముడిపెట్టి జనాలను హాస్పిటల్స్‌కి రప్పించుకునే కండిషనింగ్ ఇది.
అందుకే.. మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటుంటాం గానీ.. మనం ఎంతోమంది అడ్వర్‌టైజర్స్ చేతిలో కీలుబొమ్మలం. చివరకు వివిధ పార్టీల సోషల్ మీడియా వింగ్స్ కూడా తమ నాయకుడే ఆకాశం నుండి దిగి వచ్చినట్లు మన మైండ్లని ప్రభావితం చేస్తుంటాయి. – Sridhar Nallamothu
Share this Article