1991లో భారత ప్రభుత్వం దగ్గర నిధులు పూర్తిగా అడుగంటిపోయినప్పుదు మన దగ్గరున్న బంగారం నిల్వల మొత్తాన్ని తనఖా పెట్టి నిధులు తేవాల్సి వచ్చింది. అలాంటి రోజుల్లో – 2009 లో రిజర్వు బ్యాంకు గవర్నరుగా ఉన్న ఒక తెలుగువాడు మార్కెట్లో బంగారం భవిష్యత్తుని పసిగట్టి, సాహసం చేసి, అతి రహస్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుంచి 200 టన్నుల (రెండు లక్షల కిలోల) బంగారాన్ని కొని, ఇంగ్లాండుకి చేర్చేదాకా ప్రపంచానికి తెలియనివ్వకుండా చూశాడు.
ఆ తరువాత కాలంలో రిజర్వు బ్యాంకు అప్పుడు కాస్త అప్పుడు కాస్త బంగారం కొంటూ వస్తే పేరుకున్న 822 టన్నుల్లోంచే తాజాగా “నిల్వల సర్దుబాట్లలో భాగంగా” ఒక 100 టన్నుల్ని ఆర్.బి.ఐ మన దేశానికి తరలించింది. ఎవరా తెలుగు సాహసి? ఏమా కథ ? ఆయన మాటల్లోనే చదవండి:
=== === ===
Ads
‘‘2009 లో నా ఆధ్వర్యంలో రిజర్వుబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) నుండి 200 టన్నుల – అంటే రెండు లక్షల కిలోల బంగారం కొనడం జరిగింది. ఈ కొనుగోలు వెనక రెండు యాదృచ్ఛికమైన విడ్డూరాలున్నాయి. అంతకు సుమారు 20 ఏళ్ల క్రిందట, ఖచ్చితంగా చెప్పాలంటే 1991 లో, మన ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిల్వలు అడుగంటాయి. విదేశీ చెల్లింపులలో ముందెప్పుడు లేనటువంటి విపరీతమైన గడ్డు పరిస్థితి. మన ఆర్థిక పరిస్థితి పతనమవకుండా ఆపడానికి బంగారాన్ని విదేశాల్లో కుదువపెట్టి అప్పులు చెయ్యవలసిన అత్యవసరం ఏర్పడింది.
ఆ కాలంలో నేను ఢిల్లీలో ఆర్థిక మంత్రిత్వశాఖలో జాయింట్ సెక్రటరీగా వుండేవాడిని. ఆ బంగారం తనఖా పత్రాలమీద సంతకం పెట్టే బాధ్యత, ఒకవిధంగా చెప్పాలంటే ఆ దురదృష్టం, నామీద పడింది. అనేకమంది భారతీయులు ఈ బంగారం తాకట్టు మనదేశ ఆత్మగౌరవానికి భంగం కలుగచేసిందని చాలా మథన పడ్డారు కూడా. ఏమయితేనేం, సమయానికి బంగారం ఆదుకుంది. యాదృచ్ఛికమేమిటంటే, ఇవాళ అంటే సుమారు ఇరవయి ఏళ్ల తరువాత దేశం కోసం మళ్లీ బంగారాన్ని కొనే ఆదేశాలమీద సంతకం పెట్టే అవకాశం, అదృష్టం నాకే దక్కాయి.
ఇక రెండో విషయమేమిటంటే ఆ తరువాతి సంవత్సరాలలో, ఇంకా నేను గవర్నరుగా ఉండగానే, బంగారం కొనవద్దని ప్రజలకి నచ్చచెప్పడానికి పెద్ద ప్రయత్నం చేసాం. ఒక ప్రక్క రిజర్వు బ్యాంకు 200 టన్నుల బంగారం కొంటూనే, మరోప్రక్క ప్రజలని మాత్రం బంగారం కొనవద్దని నిరుత్సాహపరచడం, నియంత్రించడం కూడా జరిగింది. ఇది మరీ విడ్డూరం.
ఈ బంగారం కొనుగోలు వెనుక అసలు కథ: ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిధుల నిర్వహణ… విదేశాలతో లావాదేవీలు జరపాలంటే మనదగ్గర దానికి తగ్గ నిధుల నిల్వలు ఉండాలి కదా! ఆ నిల్వలు ఫారిన్ ఎక్స్ఛేంజ్, ఎస్.డి.ఆర్, బంగారం మొదలైన రూపాలలో ఉంటాయి. నేను 2008 సెప్టెంబర్లో రిజర్వు బ్యాంకు గవర్నర్ బాధ్యతలు స్వీకరించేనాటికి, రిజర్వు బ్యాంకు దగ్గర 358 టన్నుల బంగారం నిల్వగా వుంది. అంటే మన మొత్తం ఫారెక్స్ నిల్వల్లో బంగారం కేవలం 3.5 శాతం.
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో బంగారం ధర, డాలర్ ధరలలో ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది. అందుకని, ఒడిదుడుకులకు తట్టుకునేందుకు వీలుగా ఎంతో కొంత బంగారం నిల్వలు ఉంచుకోవాలి. అయితే మనకున్న మొత్తం ఫారెక్స్ నిల్వల్లో బంగారం ఎంత శాతం ఉండాలి అన్నది గట్టిగా నిర్ధారించలేని విషయం. మనకున్న డాలర్లు అమ్మి, బంగారం కొనవచ్చు. అయితే బంగారం మీద పెట్టే పెట్టుబడి మీద ఆదాయం రాదు. అందువల్ల బంగారం కొనడానికి విదేశీమారకద్రవ్యాన్ని ఖర్చుపెట్టడం సమంజసమా అన్న ప్రశ్న ఎప్పుడూ వుంటుంది. ఒకవేళ కొనాలనుకున్నా, ఆ లావాదేవీ జరపడంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. రిజర్వు బ్యాంకు బంగారం కొనబోతోంది అన్న మాట కొంచెంపొక్కినా, మార్కెట్లో బంగారం ధర పెరిగిపోతుంది. ఆ ధర గిట్టుబాటుకాక రిజర్వుబ్యాంకు వెనక్కి తగ్గవలసి వస్తుంది.
2009 నాటికి ఈ అంచనాల్లో కొన్ని మార్పులొచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం కారణంగా, రాబోయేకాలంలో డాలర్ విలువ నిలబడుతుందా అన్న విషయం సందిగ్ధంలో పడింది. అంటే మనదగ్గరున్న కొన్ని డాలర్లు అమ్మి బంగారం కొంటే మంచిదనే ఆలోచన బలం పుంజుకుంది. యాదృచ్ఛికంగా, ఇదే సందర్భంలో బంగారం కొనడానికి, బంగారం లాంటి ఒక అవకాశం కూడా వచ్చింది.
సెప్టెంబర్, 2009 లో ఐ.ఎమ్.ఎఫ్.కి డబ్బుకొరత వచ్చింది. ఆ కొరత పూడ్చుకోడానికి, ఐ.ఎమ్.ఎఫ్., తమ దగ్గరున్న బంగారంలో 403.3 టన్నులు అమ్మబోతున్నామని ప్రకటించింది. అమ్మదలుచుకున్న బంగారమంతా బజార్లో అమ్మే ముందు ఐ.ఎమ్.ఎఫ్. ప్రపంచంలో ప్రభుత్వాలకి, సెంట్రల్ బ్యాంకులకీ ఒక ఆఫర్ ఇచ్చింది, మీరేమన్నా బంగారం కొనాలనుకుంటే ముందు చెప్పండి. ముందు మీ బేరం చూసి, అప్పుడే మార్కెట్లోకి వెళతామని. ఈ పథకం ద్వారా అప్పుడు చలామణి అవుతున్న మార్కెట్ రేటులో బంగారం కొనడానికి మూడునెలలు గడువు ఇచ్చింది. ఎవరు ముందుగా ముందుకు వస్తే వాళ్లకి అమ్మడం అయిపోతుంది. ఒకవేళ మనం కొనాలనుకుంటే ఆలస్యం చెయ్యకుండా తీర్మానం చేసుకోవాలి.
రిజర్వు బ్యాంకులో ఐ.ఎమ్.ఎఫ్. అమ్ముతున్న ఈ బంగారం కొనాలా, వద్దా అన్న విషయంమీద తర్జనభర్జనలు చాలానే నడిచాయి. అటువంటి సందర్భంలో అంత పెద్ద మొత్తంలో అలా బంగారం కొనడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. భద్రతతోపాటు పోటీవల్ల వచ్చే సమస్యలూ బోలెడు. ఎంతకి కొన్నాం దగ్గరనుంచి, చెల్లింపుకీ కొనడానికీ మధ్య ఎంత వ్యవధి వుంది దాకా ఒప్పందంలోని నిబంధనలన్నీ రహస్యంగా ఉంచాలి. ఏ కొంచెం పొక్కినా మార్కెట్ తలక్రిందులవుతుంది.
బంగారం కొనడానికి ఇదేమో అక్షరాలా ‘సువర్ణావకాశం’. కానీ నాకా అనుభవం తక్కువ. కొన్న తరువాత ధర అటూయిటూ అయితే వచ్చే భూషణదూషణలకీ సిద్ధంగా ఉండాలి. అన్నిటికీ తెగించి, కొందామనుకున్నా, ఎంత బంగారం కొనాలి అన్నది ఒక సమస్య. పోనీ ఎవరన్నా నిపుణుల సలహా తీసుకుందామా అంటే, ఈ విషయం చాలా రహస్యంగా ఉంచాలాయే. బయటకి పొక్కితే పెద్ద గందరగోళం అవుతుంది. రిజర్వు బ్యాంకుకి దక్కేది కేవలం అపకీర్తే.
సరే, చాలా కింద, మీద పడి ఒక 200 టన్నులు కొనడానికి తెగించాం. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకులో కూడా అతి గుప్తంగా వుంచాం. నలుగురయిదుగురు పెద్ద అధికార్లకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇక బయటవాళ్ల విషయానికొస్తే, నేను కేవలం ప్రధానమంత్రికీ, ఫైనాన్స్ మినిస్టరుకీ మాత్రమే చెప్పాను. అదీ ఫోన్ లో కాదు. వాళ్లిద్దరినీ ఆ తరువాత ముఖాముఖీ కలిసినప్పుడు.
కొనాలని నిర్ణయించుకున్నాక తతంగం నడిపించడానికి ఒక జట్టును తయారుచేశాం. ఐ.ఎమ్.ఎఫ్. కూడా అన్ని జాగ్రత్తలూ తీసుకుంది. రేటు నిర్ణయించుకున్నాం. ఇచ్చిన గడువు 15 రోజులు, నవంబర్ 2 తో ముగుస్తుంది. తుది చెల్లింపు చేశాం. బంగారం రిజర్వుబ్యాంకు ఖాతాలో జమ అయ్యింది.
ఐ.ఎమ్.ఎఫ్. కీ మాకూ ఉన్న ఒప్పందం ప్రకారం ఈ బంగారం లావాదేవీ మీద ఇద్దరమూ ఒకేసారి ప్రకటన విడుదల చెయ్యాలి. ఆ ప్రకటన నవంబరు 4 న చెయ్యాలని నిశ్చయించుకున్నాం. కానీ ఈలోగా నవంబరు రెండవ తేదీ సాయంత్రం ఒక మీడియా ప్రతినిధి రిజర్వు బ్యాంకుకి ఫోన్ చేసి, “మీరు బంగారం కొంటున్నారట. నిజమేనా?” అని వాకబు చేశాడు. “మీదగ్గర నుంచి ఏ అధికారిక వ్యాఖ్య లేకపోయినా, ఇది నేను రేపటి పేపర్లో రాస్తాను” అని ఒక విధంగా హెచ్చరించాడు కూడా!
ఈ వార్త ఒక విలేఖరి ద్వారా బయట పడటం ఏమీ సమంజసం కాదు. ఇటువంటి కీలకమయిన వార్త ఒక రహస్యవిషయం (scoop) లా కాక, రిజర్వుబ్యాంకు ఆధికారిక ప్రకటనగా వెలువడాలి. కానీ, ఐ.ఎమ్.ఎఫ్.తో 4వ తేదీన సంయుక్త ప్రకటన చేద్దామని ఒప్పుకున్నాం కదా! ఆ గడువుకి ఇంకా రెండు రోజులుంది . ఎలాగయితేనేం, రాత్రికి రాత్రి అమెరికాలో ఐ.ఎమ్. ఎఫ్. తో మాట్లాడి, మూడవ తేదీనే రెండు వైపులనించీ ఆధికారికంగా ప్రకటించాం. కథ సుఖాంతం.
మొత్తానికి ఈ వ్యవహారం అతి గోప్యంగా నడిచింది. భారతీయ రిజర్వు బ్యాంకు బంగారం కొన్న రీతిని చూసి “ఇతర దేశాల ముఖాలు కందిపోయాయి” అని Financial Times వంటి అంతర్జాతీయ వార్తాపత్రికలూ వర్ణించాయి, పొగిడాయి. ఇంతకు ముందెన్నడూ ఇంత భారీ మొత్తంలో బంగారం కొనుగోలు లావాదేవీ మనదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా జరగలేదు. ఇది ఒక ఘనమైన విజయం అనే చెప్పుకోవాలి. 1991 ఆర్థిక సంక్షోభంలో పూట గడవడానికి బంగారం తాకట్టుపెట్టి అప్పుచేసిన దేశం ఇప్పుడు మిగిలిన దేశాలని తలదన్ని అమాంతంగా 200 టన్నుల బంగారం కొనడం, భారతదేశం ఆర్థికంగా ఎంత ఎదిగిందనడానికి, ఆ దేశ ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అంతర్జాతీయంగా చాలామంది నిపుణులు ప్రశంసించారు.
రిజర్వు బ్యాంకు బంగారం విలువని దీర్ఘకాలిక దృష్టికోణంలో చూస్తుంది. వచ్చేవారం, వచ్చేనెల బంగారం ధర పెరిగితే అమ్మేయటం, మళ్లీ ధర తగ్గినప్పుడు కొనటం వంటివి రిజర్వు బ్యాంకు చేయదు. ఈ 200 టన్నుల బంగారం కొన్నామంటే, అది కూడా దేశ దీర్ఘకాలిక ఆర్థిక భవిష్యత్తుకి మంచిదని కొన్నాం. మేము కొన్న తరువాత బంగారం ధర పెరుగుతూనే ఉంది. అది చూసి, నేను చేసిన నిర్ణయం లాభసాటిగానే ఉందని చాలామంది విశ్లేషకులు నన్ను ప్రశంసించారు. ఒకవేళ బంగారం ధర తగ్గితే, ఈ విశ్లేషకులే ‘బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని’ నన్ను తప్పక విమర్శించేవారు.
(డా. దువ్వూరి సుబ్బారావు రచన: ‘RBI రాతిగోడల వెనకాల ‘)
Share this Article