.
ఉద్వేగం..! కన్నీళ్లు..! నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి..! నిన్నటి వరల్డ్ వుమెన్ క్రికెట్ కప్ సెమీఫైనల్ తరువాత… రెండు జట్లూ కన్నీళ్లు పెట్టుకున్నాయి… విలపించాయి… అదేమిటి..?
అదంతే, తన్నుకొచ్చే ఉద్వేగం కన్నీళ్లే పెట్టుకుంటుంది… అది బాధ కావచ్చు, ఆనందం కావచ్చు, లోలోపల రగులుతున్న ఏదో అనిర్వచనీయ కసిపర్వతం ఏదో బద్ధలు కావడం వల్ల కూడా కావచ్చు…
Ads
ఉదాహరణకు… 127 పరుగులు చేసిన జెమీమా… తరచూ తనను జట్టు నుంచి తీసేయడం, ఇదే ప్రపంచ కప్ తొలి మ్యాచుల్లో వైఫల్యాలు… అనిశ్చితి… ఆవేదన… వాటి నుంచి ఇప్పటి గెలుపు తాలూకు ఏదో ఉద్వేగం తన్నుకొచ్చి విలపించింది… ఆ ఉద్వేగానికి పేరు లేదు…
కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కూడా… తనదైన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది… చివరి ఓవర్లలో తట్టుకోలేని టెన్షన్… జెమీమాకన్నా తనే ఎక్కువ క్రెడిట్ తీసుకోవాలి కదా… గెలుపుకి… నింద మోయాల్సిందీ తనే కదా ఓటమికి… అందుకే గెలవగానే గుండె పగిలింది… జెమీమాను పట్టుకుని కన్నీళ్లపాలయింది…
ఇవి ఆనంద బాష్పాలు కూడా కావు… అదేదో చెప్పలేని భావోద్వేగం… గర్వం, ఆనందం, ఊహించని గెలుపు తాలూకు పోరాట ఫలితం, పగిలిపోయిన ఉత్కంఠ… ఎన్ని..? ఎన్నన్ని..? అనేకానేక ఉద్వేగాల కలయిక అది… అదే సమయంలో మరోవైపు ఓడిన ఆస్ట్రేలియా జట్టు కూడా కన్నీళ్లు…
2017 సెమీస్ నుంచి ఈరోజుకూ ఓటమెరుగని జట్టు అది… చివరి బంతి వరకూ పోరాడే ప్రొఫెషనల్ కేరక్టర్స్ వాళ్లు… అంతకుముందే 331 రన్స్ టార్గెట్‌నూ ఊదిపారేసిన నైపుణ్యం… ఇప్పుడు ఇండియాకు 338 పరుగుల టార్గెట్ పెట్టీ, కట్టడి చేయలేని వైఫల్యం… వెరసి కన్నీళ్లు… ఊహించని అపజయం… అసలు ఆ టార్గెట్ ఛేదించగలరని ఎవరనుకున్నారు..? అసలు ఈ ఛేజింగే ఓ వరల్డ్ రికార్డు కదా…
సో, కన్నీటికి విజయమో, అపజయమో మాత్రమే కారణాలు కానక్కర్లేదు… అనేక ఉద్వేగాలుంటయ్, అన్నింటికీ కన్నీళ్లే వస్తాయి.., ఒక్కసారి జెమీమా గురించీ చెప్పాలి… మనం తిలక్ వర్మను నెత్తిన పెట్టుకుంటున్నాం… ఎందుకు..? ఆఫ్టరాల్ ఆసియా కప్… ఐతేనేం, ఆ గెలుపు పాకిస్థాన్ మీద..! నిలబడి గెలిపించాడు కాబట్టి…
సేమ్… అంతటి ఆస్ట్రేలియా మీద నిలబడి, ఎదురుదాడి చేసింది కాబట్టే జెమీమా రోడ్రిగ్స్ గ్రేట్… తరచూ జట్టులోకి వస్తూ పోతున్న చేదు అనుభవాల నడుమ ఓ అవకాశం వచ్చింది… స్టార్ బ్యాటర్లు ఫెయిల్… అందుకే పదే పదే జీసస్ అని జపిస్తూ, తలుచుకుంటూ… కొట్టిపారేసింది…
కొందరికి నచ్చలేదు, ఎందుకు..? ఆమె తన ఇన్నింగ్స్ క్రెడిట్‌ను ప్రభువుకు అంకితం చేసినందుకు..? సో వాట్… అది ఆమె వ్యక్తిగత నమ్మకం… ఆమె తండ్రి మత వ్యాప్తిస్ట్ అనీ, క్రికెట్ ప్రాంగణాల్నీ మతవ్యాప్తికి, ప్రచారానికి వాడుకున్నాడనీ..! సో వాట్..? ఆమె గెలుపు ఇన్నింగ్స్‌కు అవెలా మరకలు అవుతాయి..?
మీరొక పరీక్ష పాసయ్యారు, అంతా రాముడి దయ అన్నారు, పైకి చూస్తూ దండం పెట్టుకున్నారు… తప్పేముంది..? దేవుడి మీద విశ్వాసం అది… ఆమె చేసిందీ అదే… ఆమె దేశం కోసం ఆడింది, వరుస వైఫల్యాల నుంచి గట్టెక్కించమని ప్రార్థించింది… అంతేకదా…
మరి ఆ ఆస్ట్రేలియా ప్రేయర్లూ ఆ ప్రభువునే ప్రార్థించే ఉంటారు కదా… అదంతే… ఆట… దేవుడి ఆట… గెలిపించేదీ తనే, ఓడించేదీ తనే… హిందూ విశ్వాసం కూడా నమ్మేది అదే… జగన్నాటక సూత్రధారి దేవుడే..!
ఆ ప్రభువునే కాదు…, నాన్నను, అమ్మను, సొంత గ్రౌండ్‌ను, నేటివ్ ప్రేక్షకులను కూడా జెమీమా తలుచుకుంది, స్మరించింది… ఈ దేశాన్ని కూడా..! వీసమెత్తు తప్పులేదు…. జెమీ మా తుఝే సలాం…
రేప్పొద్దున ఇదే ప్రదర్శన ఉంటుందా..? ఉండకపోవచ్చు, జానేదేవ్… ఈరోజు ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచులో అదే హీరో తిలక్ వర్మ ఫ్లాప్… జరుగుతూ ఉంటయ్… నిన్నటి మ్యాచుకు జెమామాకు అభినందన… అంతే..! అలాగని మన టీమ్ ఇతర ప్లేయర్లు ఆడలేదా..? ఆడారు, కాబట్టే సెమీస్ దాకా వచ్చారు… అందరికీ కంగ్రాట్స్..!!
Share this Article