చిలుక కొరికిన పండు తియ్యన. ఆ పండు రుచే రుచి . చిలుక కొరకడంవల్ల పండు తియ్యగా మారదు…మొత్తం చెట్టుకాయల్లో ఏది తియ్యగా ఉంటుందో పసిగట్టి దాన్నే చిలుక కొరుకుతుంది. నృసింహ శతకంలో అడవిపక్షులకెవడు ఆహారమిచ్చెను ? అని ప్రశ్న . అడవి పక్షుల ఆహారం గురించి అక్కినేని అమలలాంటివారు చూసుకుంటారు . ముందు జనారణ్య పక్షులమయిన మనం తినే ఆహారం ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుసుకుంటే వీధివీధికి కార్పొరేటు ఆసుపత్రులు మూడు బెడ్లు ముప్పైమంది రోగులుగా ఎందుకు క్షణక్షణప్రవర్ధమానమవుతున్నాయో అర్థమవుతుంది .
బాహుబలి భుజబలంతో ప్రపంచరికార్డులను ఎలా కొల్లగొట్టిందో ? ఒకే రోజు సాహో పదివేల ప్రపంచతెరలమీద తెరలు తెరలుగా అరారా ఆరు షోలుగా జగతి సాహో సాహో అంటుండగా గ్రాఫిక్స్ గిజిగూడులో ప్రేక్షకులు ఎలా ఆనందపరవశంతో కాళ్ళుచేతులు కొట్టుకుంటున్నారో ? లాంటి అత్యవసర , జీవన్మరణ వార్తల వెల్లువలో జీవవైవిధ్య సదస్సులాంటి పరిశోధనలు , పరిశీలనలు , విశ్లేషణలు , హెచ్చరికలు , జాగ్రత్తలు ఎవరికీ పట్టవు .
ఆమధ్య రైల్వే కోడూరులో వ్యవసాయం చేసే మా బంధువు మంచి కడప మాండలికంలో వెటకారం దట్టించి ఒక విషయం చెప్పాడు . ఆ ప్రాంతంలో వేసవిలో దోసకాయలు పండిస్తారు . మండువేసవిలో వాడిని కలిశాను . ఏరా ! నాలుగు దోసకాయాలన్నా ఇస్తే , పొలాల్లో నుండి తాజాగా కోసినవని తృప్తిగా హైదరాబాద్ లో తింటాను అన్నాను . లారీలకెక్కించి పూనాలో అమ్ముకుంటారట . వద్దు బావా! శత్రువుకు కూడా ఈ దోసకాయలు ఇవ్వను – నీకు అసలివ్వను అన్నాడు . కారణం కనుక్కుంటే నా అనేవారిమీద వాడి ప్రేమాభిమానాలు దోసకాయలు ఇవ్వకపోవడంలోనే ఉన్నాయని తెలిసింది . ఒకమోస్తరు పిందె నుండి దోసకాయలు కోసి లారీకెక్కించే లోపు నాలుగుసార్లు పురుగులమందు చల్లుతారట . ఈ మందులవల్ల కాయకు పురుగు పట్టదు , కాయ గట్టిగా ఉంటుంది , దిగుబడి పెరుగుతుంది . రేటు ఎక్కువ వస్తుంది . కోసిన తరువాతకూడా ఎక్కువరోజులు కాయ అలానే గట్టిగా ఉంటుంది . తిన్నవాడి కడుపులో పురుగులమీద కూడా దోసకాయ తిన్నకృతజ్ఞతతో యుద్ధం చేస్తే అదనపు లాభం . ఇదివరకే కడుపులో చల్లగా సేదతీరుతున్న పురుగులు స్థానబలం , సీనియారిటీవల్ల కొత్త మందును ఓడిస్తే మొదటికే మోసం . ఆతరువాత డాక్టరయినా చాగంటిలాగే మానవప్రయత్నం చేశాం – ఇక దేవుడే దిక్కు అని భుజాలెగరేసి దైవచింతనకు వెళ్లాల్సిందే .
Ads
వారం వారం హైదరాబాద్- విజయవాడల మధ్య తిరుగుతూ ఉండే నేను ఒక వారాంతంలో హైదరాబాద్ వస్తూ టీ తాగడానికి కోదాడకు ముందు హైవే పై ఒక డాబా దగ్గర ఆగాను . ఫ్లాస్కులో వారం కిందటి టీ కాకుండా నాముందు టీ తయారుచేసి ఇవ్వమని అడిగాను . పదినిముషాలు ఆగమన్నాడు . ఈలోపు తెలుగులో అనర్గళమైన బూతులు వినపడుతూ ఏదో గొడవ జరుగుతున్నట్లనిపించి…పక్కన జనం మూగినచోటికి వెళ్లా . అది గొడవకాదు . నాలుగయిదు ట్రాక్టర్లలో వంకాయల మూటలు వచ్చాయి . తూకం వేసి అన్నిటినీ హైదరాబాద్ మార్కెట్ కోసం ఒకలారీలోకి లోడ్ చేస్తున్నారు .
నాకు వంకాయ అస్సలు పడదు కాబట్టి మా ఆవిడకు సహజంగా వంకాయంటే చాలా ఇష్టం. విజయవాడనుండి ఏమీ తీసుకురావు అని విసుక్కుంటూ ఉంటుంది కదా ? ఈ వంకాయలు నాలుగు కే జీ లు తీసుకెళ్లి వంకాయ మాసోత్సవమో , సంవత్సరోత్సవమో చేయవచ్చు. ఇబ్బడి ముబ్బడిగా వంకాయలు తెచ్చినందుకు మా ఆవిడ తెగ సంతోషపడుతుంది…అనుకుంటూ…నిగనిగలాడే వంకాయలు నాలుగు కే జీ లు ఒక కవర్లో తూకం వేసి…ఎంతో చెప్పు అన్నా . చేతిలో పెన్ను , కాగితం , క్యాలికులేటరు పెట్టుకుని అందరు రైతులనుండి వంకాయలు కొంటున్న ఆ ఆసామి నిర్మలంగా , నిశ్చలంగా , జ్ఞానిలా , నాకు అత్యంత శ్రేయోభిలాషిలా – ఎందుకండీ? టీ పెట్టించుకున్నారు…తాగి వెళ్లిపోండి . ఈ విషం మీకెందుకు మధ్యలో ? అని పాత సినిమాల్లో మంచి విలన్ లా ముసిముసినవ్వులతో చెప్పాడు . కారణం చెప్పాలికదా ? అన్నాను . సేమ్ రైల్వే కోడూరు స్టోరీనే . కథంతా సేమ్ టు సేమ్ . ఓన్లీ ఐటెం చేంజ్ .
అక్కడంటే బావమరిది బతగ్గోరు – అని సామెత. ఇక్కడ మన బతుకు కోరిన దారిన పోయే ఈ ఆసామి దానయ్య కూడా బంధువుకంటే గొప్పవాడే . కోయడానికి కొన్నిరోజులముందు వంకాయ నిగనిగలాడడానికి , పురుగుపట్టకుండా ఉండడానికి మందులు చల్లే కూలీలే ఘాటుకు స్పృహదప్పి పడిపోతారట . అలాంటిది చూస్తూ చూస్తూ మీకమ్మనలేనండి- అన్నాడు. ఇలాంటివారు భూమ్మీద కోటికొక్కరైనా ఉండడం వల్ల వర్షాకాలంలో చినుకులు పడుతున్నాయి; ఎండా కాలంలో ఎండలు కాస్తున్నాయి అనుకుంటూ కారెక్కాను.
ఈ ఆసామి అత్యాశకానీ…మా ఇంటిముందు సూపర్ మార్కెట్ ఫ్రిడ్జ్ ప్లాస్టిక్ కవర్లలో నేను తింటున్నది చలికి గడ్డకట్టిన ఈ వంకాయల్నే కదా ? వేసవిలో ఆవురావురుమని ఆరగిస్తున్నది ఆ రైల్వే కోడూరు దోసకాయల్నే కదా! మనమివన్నీ తినకపోతే వేల కోట్ల పెట్టుబడులతో పెట్టిన ఏడు నక్షత్రాల ఆకాశ హర్మ్య భవనాల ఇంద్రలోక ఆసుపత్రులు ఎలా బతుకుతాయి- పాపం! పొలాల్లో ఎక్కువ మందులు – శరీరానికి మరింత ఎక్కువ మందులు . ఆ ముందుకు – ఈమందు విరుగుడుకాదు . పరస్పరపోషకం .
జీవవైవిధ్యసదస్సులో చెప్పిన ఒక మాటతో ముగిద్దాం . పుచ్చులున్న కాయల్లోనే మంచివి ఏరుకోవాలట . నిగనిగలాడే పళ్లు కాకుండా నాలుగురోజులు కాగానే మచ్చలు పడే పండ్లు; మెత్తబడే పండ్లు బాగున్నపుడు ( మనంకాదు – పండ్లు) తినాలట . లేకపోతే పురుగులుకూడా ముట్టని కాయలు , పళ్లు మనం తింటున్నందుకు – పురుగులుపడకుండానే పోతార్రా ! అని పురుగులు కూడా మనల్ని శపిస్తాయట! -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article